Tuesday, September 17, 2024
Homeతెలంగాణనేడే‌ తెలంగాణ సచివాలయం ప్రారంభం

నేడే‌ తెలంగాణ సచివాలయం ప్రారంభం

నేడే‌ తెలంగాణ సచివాలయం ప్రారంభం

హైదరాబాద్, ఎప్రిల్ 30(కలం శ్రీ న్యూస్):ప్రతిష్టాత్మకం.. ఆత్మగౌరవ ప్రతీక, పరిపాలనా సౌధం.. తదితర పేర్లతో అధికార పార్టీ నేతలు గొప్పగా చెప్పుకునే కొత్త సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతల్లాంటి చీఫ్ గెస్టులు లేకుండా అన్నీ తానై కేసీఆర్ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మెయిన్ ఎంట్రీ దగ్గర శిలాఫలకాన్ని ఆవిష్కరించడంతో సెక్రెటేరియట్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామునే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొనే సుదర్శన యాగం జరుగుతుంది. మధ్యాహ్నం 1.20 గంటల తర్వాత పూర్ణాహుతి జరగనున్నది. ఆ సమయానికి ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చి నేరుగా యాగశాలకు చేరుకుని పూజలో పాల్గొంటారు.

అనంతరం గ్రౌండ్ ఫ్లోర్‌లో వాస్తు పూజలో పాల్గొని నేరుగా ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లోకి వెళ్తారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ, మంత్రులు, అధికారుల సమక్షంలో మొదటి ఫైల్‌పై మధ్యాహ్నం 1.33 గంటల లోపు సంతకం చేస్తారు. ఆ తర్వాత మంత్రులంతా వారివారి ఛాంబర్లలోకి వెళ్ళిపోయి పూజల అనంతరం వారి శాఖలకు సంబంధించిన ఫైళ్ళపై సంతకాలు చేస్తారు. మంత్రులకు, ఆ శాఖల కార్యదర్శులకు తొలుత సూచించిన విధంగా మధ్యాహ్నం 1.58-2.04 గంటల మద్య సంతకాల ప్రక్రియ ముగిసిపోతుంది. ఆ తర్వాత సరిగ్గా 2.15 గంటల సమయంలో కోర్టు యార్డులో అందరినీ ఉద్దేశించి ముఖ్యమంత్రి అరగంట పాటు ప్రసంగిస్తారు. ఆ సమయానికి అందరూ అక్కడకు చేరుకోవాల్సిందిగా ఇప్పటికే ప్రోగ్రామ్ షెడ్యూలును ప్రధాన కార్యదర్శి రూపొందించారు.

తొలి సంతకంపైనే గులాబీ నేతల్లో ఆసక్తి

సంక్షేమానికి సంబంధించిన ఫైల్‌పైన ముఖ్యమంత్రి కొత్త సచివాలయం ఛాంబర్‌లో తొలి సంతకం చేస్తారంటూ అధికారుల సమాచారం. సొంత స్థలం ఉన్న పేదలకు ఇల్లు కట్టుకోడానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేసే ‘గృహలక్ష్మి’ పథకానికి సంబంధించిన ఫైల్‌పైనే ఈ సంతకం ఉంటుందని లీకులు వెలువడ్డాయి. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున వివిధ సెక్షన్ల ప్రజలను ప్రభావితం చేసే అంశాన్ని ఎంచుకుంటారన్న వార్తలు వెలువడుతున్నాయి. కొత్త సచివాలయం కేంద్రంగా ప్రజలకు సుపరిపాలన, సంక్షేమ పాలన అందుతుందన్న సందేశానికి సంకేతంగా తొలి ఫైల్ ఎంపిక ఉంటుందని సన్నిహితులు పేర్కొన్నారు. ఆలోచనలకు అనుగుణంగా కొత్త సచివాలయాన్ని కట్టుకుని దాన్ని ప్రారంభించే సన్నివేశాన్ని ఉద్వేగంగా తన ప్రసంగంలో కేసీఆర్ ప్రస్తావించే అవకాశమున్నది.

ఇటీవలే అంబేడ్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కొత్త సచివాలయానికి ప్రారంభోత్సవం చేయడాన్ని అధికార పార్టీ నేతలు గర్వంగా ఫీలవుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున అమరవీరుల స్మారక మందిరాన్ని కూడా స్వయంగా ఆయనే ప్రారంభించడానికి ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. అనేక జిల్లాల్లో కొత్త కలెక్టర్ భవనాలకు సీఎం ప్రారంభోత్సవం చేయగా మరికొన్నింటిని కూడా త్వరలోనే ఓపెనింగ్ చేయనున్నారు. ప్రధాన కార్యదర్శి రూపొందించిన షెడ్యూలు ప్రకారం కేసీఆర్ తన ప్రసంగాన్ని మధ్యాహ్నం 2.45 గంటలకల్లా ముగించనున్నారు. ఆ తర్వాత అందరికీ అక్కడే లంచ్ ఏర్పాటు చేయడంతో ఆ కార్యక్రమం ముగియడంతోసచివాలయం ఓపెనింగ్ ప్రోగ్రామ్ సమాప్తం కానున్నది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!