మా కుటుంబానికి న్యాయం చేయండి
మంథని, డిసెంబర్23(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథని పోలీసుల హింస కారణంగా ఆత్మహత్య చేసుకొని గత మూడు నెలల క్రితం మృతి చెందిన శీలం రాజ్ కుమార్ అనే యువకుడి కేసుపై న్యాయం చేయాలని కోరుతూ మృతుని తల్లి శీలం రాజేశ్వరి ఈరోజు హైదరాబాద్ లో ఎం.ఆర్.పి.ఎస్. వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ని కలిసి వినతిపత్రం అందించారు.ఇటీవల కోదాడ పట్టణంలో పోలీసుల హింస కారణంగా మృతి చెందిన కర్ల రాజేష్ అనే దళిత యువకుని కేసులో న్యాయం చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మంద కృష్ణ మాదిగ కోదాడ ఘటన లాగా మంథని ఘటన పై కూడా న్యాయం చేయాలని కోరారు.గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన మంథని ఎస్.ఐ. డేగల రమేష్ కొట్టిన దెబ్బల వలన ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఈ ఏడు సెప్టెంబర్ 19న తన కొడుకు శీలం రాజ్ కుమార్ మృతి చెందగా, సదరు ఎస్. ఐ. తమకు తన మధ్యవర్థుల ద్వారా 5 లక్షలు రూపాయలు పంపించి 100 రూపాయల బాండ్ పేపర్ పై తమ సంతకాలు తీసుకొన్నారని ఆరోపించారు. అదేవిధంగా మృతి చెందిన రోజు రాత్రి ఇద్దరూ సి.ఐ లు, ముగ్గురు ఎస్.ఐ లు భారీ సంఖ్యలో పోలీసు బలగాలు వచ్చి తమ కుల సంప్రదాయం ప్రకారం పెండ్లి కానీ యువకున్ని బొంద పెడుతారు కానీ బలవంతంగా ఇంట్లోనే పోస్టుమార్టం చేయించి శవాన్ని అదే రాత్రి గోదావరి తీరంలో దహనం చేయించారని భాదితురాలు విలపిస్తూ మంద కృష్ణ మాదిగ కు జరిగిన విషయం వివరించారు.జరిగిన పూర్తి విషయాలపై అక్టోబర్ 14న పూర్తి ఆధారాలతో తెలంగాణ రాష్ట్ర డీజిపికి ఫిర్యాదు చేసినా కూడా విచారణ చేయకుండా జాప్యం చేస్తూ రాష్ట్ర డీజిపి కార్యాలయం నుండి మొదలుకొని మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం దాకా ఫిర్యాదు ను పార్వర్డ్ చేస్తూ,రాజకీయ నేతల జోక్యంతో రోజుల తరబడి నిర్లక్ష్యం వహించారని, ఇప్పటికి మంథని ఎస్.ఐ. డేగల రమేష్, ఇతర పోలీసులు తమను బెదిరిస్తూ కేసును వాపస్ తీసుకోవాలని ఎస్.ఐ. తన అనుచరులతో తమపై సోషల్ మీడియాలో అసత్యపు ఆరోపణలతో ట్రోల్స్ చేస్తున్నారని, మాకు న్యాయ సహాయం చేస్తున్న న్యాయవాది అంతు చూస్తామని, అంతేకాకుండా గతంలో 5 లక్షల రూపాయలు ఇచ్చిన మధ్య వర్థులతో రాజీ పడి బాండు పేపర్ కు తనకు సంబంధం లేదని చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని భాధితులు ఆరోపించారు.ఇట్టి కేసును సిబిఐ లేదా సిట్ తో విచారణ జరిపించాలని, తమ కుటుంబానికి ఒక కోటి రూపాయల నష్టపరిహారం చెల్లిస్తూ, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి న్యాయం చేయాలని,భాద్యులైన మంథని ఎస్.ఐ. డేగల రమేష్ తో పాటు కారకులైన వారిని సస్పెండ్ చేసి,కేసులో ఎస్.ఐ. డేగల రమేష్ ను నిందితునిగా చేర్చి, అడిషనల్ చార్జ్ షీట్ దాఖలు చేయాలని, ఫిర్యాదు లో ఉన్న నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,ఇటీవల కోదాడ పట్టణంలో జరిగిన కర్ల రాజేష్ కేసులో లాగా తమకు కూడా న్యాయం చేయడానికి గాను మంద కృష్ణ మాదిగ కృషి చేయాలని ఆ వినతిపత్రం లో కోరారు.
ఈ కార్యక్రమంలో మృతుని తల్లి శీలం రాజేశ్వరి, సోదరి మణి అలేఖ్య,పెద్దపల్లి మాజీ ఎం పి. బోర్లకుంట వెంకటేష్ నేత,హైకోర్టు న్యాయవాదులు డి.అంబేద్కర్, ఇనుముల సత్యనారాయణ, ఎం.ఆర్.పి.ఎస్. రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ , ఇతర నాయకులు పాల్గొన్నారు. కాగా ఇప్పటికే ఇట్టి కేసు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో, హైకోర్టులో పెండింగ్ లో ఉండగా ఇప్పుడు తాజాగా రాష్టంలో సంచలనం సృష్టించిన కోదాడ కర్ల రాజేష్ మృతిపై పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమం చేపట్టిన ఎం.ఆర్.పి.ఎస్. వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ వద్దకు భాదితులు రావడం మంథని ప్రాంతంలో సంచలనం సృష్టిస్తోంది.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

