అద్బుత ఘట్టం.. మకర జ్యోతి దివ్యదర్శనం
స్పష్టంగా జ్యోతి దర్శనం
కేరళ,జనవరి14(కలం శ్రీ న్యూస్):
శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రం శరణుఘోషలతో మారు మ్రోగింది. శబరిమల కొండపై కొలువైన అయ్యప్ప దివ్యరూపాన్ని దర్శించుకునేందుకు లక్షాలాదిగా భక్తజనం కొండకు చేరారు. నేడు పంచగిరులపై అత్యంత పవిత్రమైన ‘మకరవిలక్కు’ (మకరజ్యోతి) దర్శనం జరిగింది. బుధవారం సాయంత్రం దివ్య జ్యోతి రూపంలో పొన్నంబలమేడపై మకర జ్యోతి రూపంలో భక్తులకు అయ్యప్ప దర్శనం కలిగింది. ఈ అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు శబరిమలకు పోటెత్తారు.
బుధవారం మధ్యాహ్నం 3:13 గంటలకు మకర సంక్రాంతి పుణ్యకాలం సమయంలో స్వామివారికి మేల్ శాంతులు, తంత్రిలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. జనవరి 12 న పందళం రాజప్రసాదం నుంచి బయలుదేరిన స్వామివారి పవిత్ర ఆభరణాలు నేటి సాయంత్రం 4:30 నుంచి 5:20 నిమిషాల ప్రాంతంలో సన్నిధికి చేరుకున్నాయి. ఈ ఆభరణాలను అయ్యప్ప స్వామికి అలంకరించి మహదీపారాధన నిర్వహించారు. తంత్రులు. సాయంత్రం దీపారాధన అనంతరం, పొన్నంబలమేడు కొండపై మకరజ్యోతి మూడుసార్లు దర్శనమిచ్చింది. సాయంత్రం సుమారు 6:45 గంటలకు మహా అద్భుత దృశ్యం మకర జ్యోతి దర్శనం ఆవిష్కృతం అయ్యింది. మకరజ్యోతి దర్శనం సందర్భంగా సన్నిధానం, పంబ, శబరిమల కొండ, నీలిమల ప్రాంతాల్లో భక్తులు కిక్కిరిసిపోయారు. ఆలయంలో రద్దీ దృష్ట్యా బుధవారం ఉదయం 10 గంటల తర్వాత పంబ నుంచి సన్నిధానానికి భక్తులను అనుమతించడం ఆపివేశారు..ప్రతీ ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమల కొండలకు ఎదురుగా ఉన్న పొన్నాంబల మేడుపై మకరజ్యోతిని వెలిగిస్తారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు మాలధారణతో.. తలపై ఇరుముడితో శబరిమలకు చేరకుంటారు. మకరవిలక్కు (మకరజ్యోతి) పర్వదినం సందర్భంగా కొండపై నుంచే ఆ దివ్య రూపాన్ని దర్శించుకోవాలని తాపత్రయ పడుతుంటారు భక్తులు. పంచగిరులపై ఆ క్షణం కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తారు భక్తులు. అయితే పంచగిరులైన నీలిమల, కరిమల, శబరిమల , అప్పాచిమేడు , అలుదామేడు ప్రాంతాల్లో ఈ తొమ్మిది ప్రాంతాల నుంచే ఆ దివ్య జ్యోతి దర్శనం స్పష్టంగా కనిపిస్తుంది.

పొన్నంబల మేడుపై వెలుగే అయ్యప్ప దివ్య మకర జ్యోతి దర్శనం.. శబరిమల కొండపై ఉన్న అయ్యప్ప సన్నిదానం , పాండితావళం, మాలికాపురం – అట్టతోడు, నీలిమల కొండ హిల్ టాప్, పులిమేడు, శరణ్ గుత్తి, మరకూట్టం, పంబ, శబరిమల ఎంట్రీ పాయింట్ల వద్ద నుండి దేదీప్యమానంగా వెలిగే ఆ దివ్య జ్యోతి స్వరూపాన్ని స్పష్టంగా చూడవచ్చు. అయినా అయ్యప్ప సన్నిదానం నుంచే ఆ మకరజ్యోతిని దర్శించుకోవాలని భక్తులు పోటీపడుతారు.శబరిమల అయ్యప్పస్వామికి దర్శనంలో ఎంతో తిరువాభరణం అభరణాల ఊరేగింపు ఎంతో ప్రత్యేకమైనది. అయ్యప్ప భక్తులకు మకరసంక్రాంతి రోజున జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తారు. అంతకుముందు స్వామివారిని ఈ అభరణాలతో అలంకారం చేయడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. పంబల రాజుకిచ్చిన మాట ప్రకారం అయ్యప్పస్వామి ప్రత్యేక అభరణాల(కిరీటం, కంఠాభరణాలకు)కు పందల రాజవంశీయులు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం వారి చేతుల మీదుగా ఊరేగింపు ప్రారంభమవుతుంది.శబరిమల అయ్యప్పస్వామి తిరువాభరణం అభరణాల ఊరేగింపుకు ఈ ఏడాది మొత్తం 30 మందితో కూడిన సహాయకుల బృందాన్ని అయ్యప్ప అభరణాల ఊరేగింపుకు ఎంపిక చేసింది దేవస్వం బోర్డ్. జనవరి 12న మధ్యాహ్నం పందళ రాజా ప్రసాదం నుంచి ఒంటిగంటకు తిరువాభరణ ఊరేగింపు ప్రారంభమైంది. నారాయణ స్వామిరాజు ఆధ్వర్యంలో మారుతమాన శివనుట్టి గురుస్వామితో సహా వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో మూడు రోజులుగా సాగారు. కొండలుకోనలు రాళ్లు రప్పలు దాటుతూ 50 కిలో మీటర్లపైన అటవి మార్గంలో నడుచుకుంటూ ఈ యాత్ర సాగింది. మార్గమధ్యంలో ఉన్న గ్రామాలలో భక్తులు తిరువాభరణ ఊరేగింపుకు ఘనస్వాగతం పలికారు. నేటి మధ్యాహ్నం శబరిమల చేరింది ఈ యాత్ర. అయ్యప్పకు ఈ అభరణాలతో అలంకరణ చేసి హారతి మేల్ శాంతులు ఇచ్చిన ఆ మరుక్షణమే లక్షలాధి భక్తులకు అయ్యప్ప జ్యోతిరూపంలో పొన్నంబల మేడుపై దివ్య జ్యోతి రూపంలో దర్శనమిచ్చారు. ఈ దివ్యజ్యోతి దర్శనంతో అయ్యప్ప దీక్ష సంపూర్ణమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జనవరి 15 నుంచి 19న రాత్రి 9 గంటల వరకు అయ్యప్ప దివ్య దర్శనం కొనసాగనుంది. 19న హరివరాసనం పూర్తవగానే భక్తులకు దర్శనం నిలిపివేస్తారు. జనవరి నెల 20 న ప్రత్యేక పూజల అనంతరం ఆలయాన్ని మూసివేయనున్నారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

