Breaking News
Friday, January 16, 2026
Breaking News

కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి

కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి

నేడు ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనం

ముస్తాబైన వైష్ణవ ఆలయాలు

సుల్తానాబాద్ డిసెంబర్30,(కలం శ్రీ న్యూస్):

మార్గశిర మాసం శ్రీమహావిష్ణువుకు అంత్యంత ప్రీతికరమైంది. ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథుని గా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణుని స్తుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నంగా చేసుకుంది. ఇక, పుష్యమాసంలో వచ్చే శుక్షపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ఏడాదికి వచ్చే ఇరవైనాలుగు ఏకాదశుల్లో ప్రతిదీ పవిత్రమైందే. కానీ, వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు.ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని, వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు.శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోడానికి వైకుంఠానికి తరలివెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు.

ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సరిసమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడని, మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని కూడా భక్తుల విశ్వాసం.ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని నియమ నిష్ఠలతో పూజ చేసివారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి, గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించుకోవాలి. విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి, టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి. ఇకపోతే… వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.

 

 

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

error: Content is protected !!