స్తంభంపల్లిలో ఇథనాల్ పరిశ్రమ కు శంఖుస్థాపన చేసిన మంత్రి కొప్పుల
జగిత్యాల, మార్చి 31 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామం లో శుక్రవారం 13 కోట్ల రూపాయల నిధులతో స్థల సన్నద్దతకు (లెవెలింగ్) పనులకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమి పూజ, శంఖుస్థాపన చేశారు. ఈ పరిశ్రమ ద్వారా ఏటా 8 కోట్ల లీటర్ల సామర్థ్య గల ఇథనాల్ తయారీ అవుతుందని ఆయన అన్నారు. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం వెల్గటూరు మండలం లోని స్థంభంపల్లి గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ భూమిలో వంద ఎకరాల స్థలాన్ని ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రముఖ ప్రఖ్యాత క్రిభ్‌కో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని సంకల్పించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇథనాల్ పరిశ్రమను ధర్మపురి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయాలని గత ఏడాది నవంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి, భూమి సేకరణ లో భాగంగా గోదావరి నది తీర సమీపం లో గల వెల్గటూరు మండలం లోని స్థంభంపల్లి గ్రామ శివారు భూమి లో పరిశ్రమ ఏర్పాటుకు అనుగుణంగా ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు పరిశీలించి ఎంపిక చేశారని, కాగా ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన, వంద ఎకరాల స్థలంలో కొంత మేర ఉన్న గట్టు ప్రాంతాన్ని చదును చేసి, ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు స్థలాన్ని చదును చేయాలని ప్రభుత్వం సంకల్పించి స్థలం చదును చేసి సన్నద్ధం చేయడానికి రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్థల సన్నద్దత పనుల కోసం13 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలన్నారు.ఈ రోజు నిర్ణీత స్థలం లోని గుట్టబోరు ప్రాంతాన్ని చదును చేయడానికి భూమి పూజ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.ఈ పరిశ్రమ వల్ల జిల్లా రైతాంగానికి అండగా నిలువడంతో పాటు వేలాది మంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాల వారు అత్యధికంగా ఉన్న ధర్మపురి ప్రాంతంలో ఇంత పెద్ద ఇథనాల్ కర్మాగారం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. వ్యవసాయ రంగంలో గొప్పగా పేరుగాంచిన జగిత్యాల జిల్లాలో పెద్ద ఫ్యాక్టరీలు లేవు. జగిత్యాల ప్రాంతంలో వ్యవసాయాధారితమైన భారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన నేపథ్యంలో పుష్కలమైన నీటి వసతి, వరి, మక్క పంట పండే పరిస్థితులు ఉన్న ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ప్రాంతంలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ క్రిభ్‌కో సంస్థ ముందుకు రావడంతో పరిశ్రమ ఏర్పాటుకు అంగీకారం కుదురడంతో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యిందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ మేరకు పరిశ్రమకు 700 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని మంత్రి గుర్తు చేశారు.
ధర్మపురి నియోజకవర్గ పరిధిలో క్రిభ్‌కో సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించనున్న ఇథనాల్ పరిశ్రమ వల్ల జగిత్యాల జిల్లా సాంకేతిక రంగ స్వరూపమే మారిపోనుందన్నారు.త్వరలోనే ఇథనాల్ కర్మాగారం నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.