ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయంలో చోరీ
మల్యాల,ఫిబ్రవరి24(కలం శ్రీ న్యూస్): ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన కొండగట్టులో దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. అర్థరాత్రి ఆలయంలోకి చొరబడి భీభత్సం సృష్టించారు. రాత్రి స్వామి వారి పవళింపు సేవ అనంతరం గుడి ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి వెళ్లిపోయారు. శుక్రవారం వేకువ జామున ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ చేసేందుకు గుడికి వెల్లిన అర్చకులు ప్రధాన ద్వారం నుండి లోపలకు అగంతకులు చొరబడినట్టుగా గమనించారు. వెంటనే పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో ఆరా తీయడం ఆరంభించారు.
వెండి మకర తోరణం తో పాటు పలు వెండి వస్తువులు చోరీ జరిగిందని సమాచారం. ప్రధాన ఆలయంలో బంగారు నగలతో పాటు కొన్ని విగ్రహాలు, అనుభంద ఆలయాల్లోని విగ్రహాలను చోరీకి గురైనట్టు ప్రాథమికంగా నిర్దారించారు. అయితే పోలీసులు పూర్తిగా ఆరా తీసే పనిలో నిమగ్నం కావడంతో పూర్తి వివరాలు తెలియరావడం లేదు. అయితే కొండగట్టు అంజన్న క్షేత్రంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిని సీసీ కెమెరాల్లోని ఫుటేజీ ఆధారంగా అనుమానితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు.