Sunday, September 8, 2024
Homeతెలంగాణజోరుగా సాగుతున్న అనుమతులు లేని ఫైనాన్స్ దందాలు 

జోరుగా సాగుతున్న అనుమతులు లేని ఫైనాన్స్ దందాలు 

జోరుగా సాగుతున్న అనుమతులు లేని ఫైనాన్స్ దందాలు 

  • అధికంగా వడ్డీలు వసూలు చేస్తున్న వైనం.
  • ఒక్క సుల్తానాబాద్ లోనే కోటి రూపాయలకు పైగా నడుస్తున్న దందా 
  •  బంగారు ఆభరణాలు, వాహనాలు కుదువ పెట్టుకొని చేస్తున్న దందా.
  •  సామాన్యులను వీరి నుండి కాపాడే వారే లేరా?..

 

సుల్తానాబాద్,జులై22, (కలం శ్రీ న్యూస్):

పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో అలాగే చుట్టుపక్క గ్రామాల్లో అనుమతులు లేని ఫైనాన్స్ సంస్థలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ, పేదల రక్తాన్ని జలగల వలే రక్తాన్ని పిండి తాగేస్తున్నారు. ఎదుటి వారి ఆర్థిక ఇబ్బందే వారి వ్యాపారం.. మండలంలో వడ్డీ దందా, ప్రైవేటు చీటీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. అత్యవసరాల కోసం తీసుకున్న అప్పు మొత్తానికి శక్తికి మించి వడ్డి కడుతూ భౌతికంగా, మానసికంగా ,ఆర్థికంగా కుంగిపోతున్న కుటుంబాలు మండలంలో ఎన్నో ఉన్నాయి. మండలంలో వీక్లీ ఫైనాన్స్, డైలీ ఫైనాన్స్, నెలవారి వడ్డీలు ఇలా పేరు ఏదైనా సామాన్యుడి నడ్డి విరిచే వడ్డీలతో సామాన్య కుటుంబాలకు నరకం చూపించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ దందాలకు అనధికార చిట్టి పాటలు సైతం తోడవుతున్నాయి. ఆయా దందాలో లక్షల్లో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్న అధికారికంగా ఎవరు అడిగే వారు లేరనే ధైర్యంతో దందా రాయుళ్ళు ఇష్టానుసారంగా వడ్డీరేట్లను వసూలు చేయడం మండలాల్లో సర్వసాధారణమైంది.

సుల్తానాబాద్ లో సుమారు 100 మంది  వరకు అనుమతులు లేని ఫైనాన్స్ సంస్థలు నడుపుతున్నట్టు గా సమాచారం. వీరు ప్రధానంగా చిరు వ్యాపారులను, వీధి వ్యాపారులను టార్గెట్ చేసుకొని ఈ దందా నడుపుతున్నారు. వీరిలో కొంతమంది పెద్దపెద్ద బడాబాబులు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరికొన్ని సంస్థలు కొంతమంది అధికారుల అండదండలతో నడుస్తుందని తెలుస్తుంది. వీరు ఉదాహరణకు 10 వేల రూపాయలకు 1500 రూపాయలు కట్ చేసుకొని 8500 రూపాయలు ఇచ్చి రోజుకు వంద రూపాయలు చొప్పున వంద రోజులు చేస్తున్నారు. మరికొందరైతే ఈ వంద రోజుల్లో కట్టకపోతే అధికంగా వడ్డీ వసూలు చేస్తున్నారు. మరికొంత మంది ఫైనాన్స్ నిర్వాహకులు బంగారు ఆభరణాలు, వాహనాలు కుదువ పెట్టుకొని మరి అప్పులు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొంతమంది చిరువ్యాపారులు ఒకరి అప్పు తీర్చేందుకు మరొకరి వద్ద అప్పు చేస్తున్నారు. దీనివల్ల ఫైనాన్స్ నిర్వాహకులు కోట్లలో ఎదిగి పోతున్నారు చిరువ్యాపారులు అప్పుల ఊబిలో మునిగిపోతున్నారు.

వడ్డీ, ఫైనాన్స్‌ వ్యాపారం నిబంధనలు ఇవీ..

వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్‌లు, ప్రైవేట్‌ చీటీలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతులు పొంది, పారదర్శకంగా ఎవరైనా, ఏ సంస్థలైనా ఫైనాన్స్‌లను, వడ్డీ వ్యాపారాన్ని నిర్వహించుకునే అవకాశముంది. ఫైనాన్స్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ నమోదై ఉండాలి. రిజిస్ట్రేషన్‌ అయిన ఫైనాన్స్‌ పేరిట, టాన్‌, పాన్‌ కార్డులు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఫైనాన్స్‌ మనీ లెండింగ్‌ లైసెన్స్‌ పొంది ఉండాలి. ఫైనాన్స్‌ వ్యవహారాలన్నీ బ్యాంకు ఖాతా ద్వారా నిర్వహించాలి. ఫైనాన్స్‌కు సంబంధించి ఆదాయ, వ్యయాల వ్యవహారాల రికార్డులను ఏటా ఫైనాన్స్‌ ఆడిటింగ్‌ చేయించాలి. ఫైనాన్స్‌ కార్యాలయానికి లీజ్‌ డీడ్‌ ఉండాలి. అన్ని రకాల అనుమతులతో పాటు నిబంధనలను పాటించాలి. ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో సభ్యులు ఎవరు? మూలధనం ఎంత? వాటాధనం ఎంత? ఎన్ని చీటీలు నడుపుతున్నారు? ఎంత మొత్తం వసూలు చేస్తున్నారు? డివిడెంట్‌ ఎంత ఇస్తున్నారు? నివేదించాలి. చీటీల మొత్తాన్ని డిపాజిట్‌ రూపంలో పెట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఐదు లక్షల చీటీ నిర్వహిస్తే, ఐదు లక్షల రూపాయల డిపాజిట్‌ను ఫైనాన్స్‌ నిర్వాహకులు బ్యాంకులో డిపాజిట్‌ చూపించాలి. ఇన్ని నిబంధనలను ప్రభుత్వం మనిలెండింగ్‌ చట్టంలో పొందుపర్చింది. ఈ నిబంధనలన్నింటినీ పాటిస్తూ ఏటా ఆదాయ, వ్యయాల లెక్కలను నివేదిస్తూ, ప్రైవేట్‌ ఫైనాన్స్‌లు చీటీల వ్యాపారం, అప్పులు ఇచ్చే వ్యాపారం నిర్వహించుకునే అవకాశముంది.

ఏది ఏమైనప్పటికీ దయచేసి ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!