లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సహాయ ఇంజనీర్ కు ఘన సన్మానం
సుల్తానాబాద్,సెప్టెంబర్15(కలం శ్రీ న్యూస్):
లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం “జాతీయ ఇంజనీర్ల దినోత్సవం” సందర్భంగా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని స్థానిక విద్యుత్ శాఖ సహాయ ఇంజనీర్ రంగు శంకరయ్యకు క్లబ్ సభ్యులు జ్ఞాపికను అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆధునిక భారత నిర్మాణ పితామహుడు, ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా అతని గౌరవార్థం 1968 వ సంవత్సరం నుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 15న ‘జాతీయ ఇంజనీర్ల దినోత్సవం’ జరుపుకుంటారని, వారు నీటిపారుదల రంగం అభివృద్ధికి ఎన్నో బహుళార్థ సాధక ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఎంతోమంది యువ ఇంజనీర్లకు స్ఫూర్తిగా నిలిచారని, తన 101 సంవత్సరాల జీవిత కాలంలో 80 సంవత్సరాలు దేశం కోసం అహర్నిశలు కృషిచేసి దేశ భావి నిర్మాణంలో భాగస్వాములు అయ్యారని తెలిపారు. అతని సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 1955లో ‘భారతరత్న’ బిరుదుతో సత్కరించారని, దేశం కోసం, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం వెన్నెముకగా నిలిచి కృషి చేస్తున్న నేటితరం ఇంజనీర్ల సేవలను కొనియాడుతూ వారికి ఇంజనీర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా చీఫ్ కో-ఆర్డినేటర్ వలస నీలయ్య, జిల్లా కో-ఆర్డినేటర్లు మాటేటి శ్రీనివాస్, జూలూరి అశోక్ సభ్యులు తమ్మనవేణి సతీష్ కుమార్ పాల్గొన్నారు.