సుల్తానాబాద్ లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
సుల్తానాబాద్,జనవరి12(కలం శ్రీ న్యూస్):
వివేకానందుని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో ఆదివారం స్వామి వివేకానందుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్వామి వివేకానందుని విగ్రహానికి ఎమ్మెల్యే విజయరమణ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ..ప్రపంచ దేశాల్లో భారత దేశ ఔన్నత్యాన్ని, సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పిన మహనీయుడు వివేకానందుడు అని అన్నారు. ఆయన బోధనలు నేటి యువతరానికి ఎంతో ఆదర్శమని చెప్పారు. యువత వల్లే భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు. చెడు మార్గాలకు దూరంగా మెలుగుతూ యువత రాబోయే తరానికి మార్గదర్శకంగా నిలవాలని చెప్పారు. యువతకు ఉద్యోగాల కల్పన, వివిధ రంగాల్లో నైపుణ్యతా, శిక్షణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కార్యచరణతో ముందుకు సాగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్య గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలక సతీష్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ఎం. రవీందర్, సాయిరి మహేందర్, నిర్వాహకులు సామల హరికృష్ణ, సామల రాజేంద్రప్రసాద్, పట్టణ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.