సిండికేట్ల కనుసన్నల్లో మద్యం ఏరులై పారుతోంది.
సుల్తానాబాద్,జూన్14(కలం శ్రీ న్యూస్):సిండికేట్ల కనుసన్నల్లో మండలంలో మద్యం ఏరులై పారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న బెల్టుదుకాణాలు . మండలం లేదా మున్సిపాలిటీల పరిధిలోని మద్యం దుకాణాలన్నింటిని సిండికేట్‌గా చేసి, నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. ఈ సిండికేట్లు ఆబ్కారీ కనుసన్నల్లో నడుస్తుండటంతో ఎమ్మార్పీ కంటే రూ.10 నుంచి రూ.20 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కొక్క మద్యం దుకాణం పరిధిలో పదికి పైగా చొప్పున మండల వ్యాప్తంగా 400 వరకు బెల్టు షాపులు ఉన్నాయని సమాచారం. మద్యం దుకాణాలు సిండికేట్ అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నందువలన,కొన్ని ప్రాంతాల్లో బెల్టుదుకాణాలకు నకిలీ మద్యం సరఫరా అవుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటి వలన ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు పాలవుతారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది మిగతా ప్రాంతాల్లో సైతం మద్యందుకాణాల నిర్వాహకులు సిండికేట్‌ల చేతుల్లోకి వెళ్లిపోతున్నారా?. సిండికేట్ అయితే అధిక ధరలకు మద్యం అమ్మడంతోపాటు, ఆయా మండల, మున్సిపాలిటీల పరిధిలో గ్రామాలు, వార్డుల్లో బెల్టుదుకాణాలు నడుపుకోవచ్చనే ఆశతో వారి గుప్పెట్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వం లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించి వాటి పర్యవేక్షణ బాధ్యతలు ఎక్సైజ్ శాఖకు అప్పగించింది. ఎక్సైజ్ అధికారులు మాత్రం మద్యం దుకాణాల సిండికేట్‌ల కనుసన్నల్లో నడుస్తూ,వారు చెప్పినట్లు పనిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిండికేట్‌ల నుంచి వసూలు చేస్తున్న అధిక మొత్తం ఎవరికీ చెందుతున్నాయి. దీనిపై సంబంధించిన అధికారులు ఎందుకు స్పందించడం లేదు . సిండికేట్ నుంచి అధిక ధర కొనుగోలు చేసి బెల్ట్ షాప్ యజమానులు అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్నారు. క్వార్టర్ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు అధిక ధరలు వసూలు చేస్తూ మందుబాబుల జేబులు గుల్లచేస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.