Wednesday, January 15, 2025
Homeతెలంగాణప్రజాసంక్షేమమే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యం

ప్రజాసంక్షేమమే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యం

ప్రజాసంక్షేమమే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యం

మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్‌

దశాబ్ది ఉత్సవాల్లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని,జూన్13(కలం శ్రీ న్యూస్):మంచి చెప్పేవాళ్లు లేకపోతే మన మనుగడకే ప్రమాదమని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్బాద దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం మంథనిలోని ఎస్‌ఎల్బీ గార్డెన్స్‌లో జరిగిన మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన 76ఏండ్లలో అగ్రబాగాన పరిపాలన చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం,పాలకులు ఏనాడు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చేయలేదన్నారు. అధికారం పదవుల కోసమే ఆరాటపడ్డారే కానీ ఏనాడు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.దేశం,రాష్ట్రంతో పాటు మంథనిలో అనేక ఏండ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్‌ పాలకుల పాలనలో అభివృధ్దికంటే అనర్థాలే ఎక్కువగా ఉండేవన్నారు.మహిళలు, యువకుల భవిష్యత్‌ గురించి ఏనాడు ఆలోచన చేయలేదని, కానీ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం,సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని అన్నారు.ముఖ్యంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారని ఆయన గుర్తు చేశారు.ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గత ప్రభుత్వాల హయాంలో పోలీస్‌శాఖలో అతితక్కువగా మహిళా సిబ్బంది ఉండేవారని,ఈనాడు బీఆర్‌ఎస్‌ సర్కార్‌లో 33శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తూ ఎంతో మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు లభించాయని అన్నారు.మహిళా సంక్షేమం కోసం గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు,ప్రస్తుతం అమలవుతున్న పథకాలను బేరీజు వేసుకోవాలని అన్నారు.గత ప్రభుత్వాల హయంలో అంగన్వాడి కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఉండేవి కాదని,54 శాతం మాత్రమే బాలింతలకు,గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం లభించేదని అన్నారు.దేశంలోనే అంగన్వాడి కార్యకర్తలకు అత్యధిక జీతాలు చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.పేద మహిళలకు అంగన్వాడీ కేంద్రాలలో శ్రీమంతం జరిపిస్తోందని,మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలనే ఉద్దేశంతో గతంలో లేని విధంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం,మార్కెట్ కమిటీలలో, పోలీస్ నియామకాలలో 33 శాతం రిజర్వేషన్ ను సీఎం కేసీఆర్ కల్పించారని ఆయన వివరించారు.ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్‌ పాలకులు గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్‌ పాలకులు, మంథని ఎమ్మెల్యే దశాబ్ది ఉత్సవాల్లో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు.ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జరుగుతున్న సమయంలో సమైఖ్యాంధ్ర సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డిని ఇక్కడకు తీసుకువచ్చి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది మంథని ఎమ్మెల్యే కాదా అని ప్రశ్నించారు.ఆనాడు తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఈనాడు తామే తెలంగాణ ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌పార్టీ అయితే మరి ఆవిర్బావ ఉత్సవాలకు ఎందుకు రావడం లేదని,ఆవిర్బావ ఉత్సవాలను మరిచి కర్ణాటక సంబరాలు జరుపుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.కాంగ్రెస్‌ పార్టీకి మంథని ఎమ్మెల్యేకు తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేదు కావచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు అధికారం కోసం ఆరాటపడిన కాంగ్రెస్‌ పాలకులు ఏనాడు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చేయలేదని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చేస్తున్నామని,ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంత ప్రజల మేలు కోసమే తపిస్తున్నామని ఆయన అన్నారు.నేటి యువత చదువుతో పాటు మంచి మార్గాన్ని అలవర్చు కోవాలని,కేవలం ఉద్యోగాల కోసమే చదువుకుంటున్నామనే బావన ఉండవద్దని ఆయన సూచించారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యువత భవిష్యత్‌ కోసం, మహిళా సాధికారత కోసం అనేక పథకాలను అమలుచేస్తుందని ఆయన గుర్తు చేశారు.ఈనాడు యువత కేవలం ఉద్యోగాల కోసమే చదువుకుని తమ చదువు ఏ ఉద్యోగానికి అవసరముంంటుదో తెలియని పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల కలలకు సాకారం చేకూర్చే విధంగా యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.పూర్వం నుంచి వచ్చే మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని,సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకుని అకాశమే హద్దుగా ఎదగాలే తప్ప అజ్ఞానుల్లా తప్పుడు మార్గాల వైపు చూడకూడదని ఆయన సూచించారు.

 

మహిళా సాధికారిత కోసమే అనేక పథకాలు….       

భూపాలపల్లి జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌, 

మహిళా సాధికారిత కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని భూపాలపల్లి జెడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు మహిళ సంక్షేమాన్ని ఆనాటి ప్రభుత్వాలు విస్మరించాయని, కనీస అవసరాలు,వసతులు కల్పించలేని దుస్థితి ఉండేదన్నారు.పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల కాలంలో దేశం గర్వించే రీతిలో అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, మహిళా సంక్షేమం కోసం ముందుచూపుతో అనేక పథకాలకు రూపకల్పన చేశారని ఆమె గుర్తు చేశారు. అంతంతమాత్రంగానే నడిచే అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి ఎంతో కృషిచేశారని,ఈనాడు ప్రతి అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చి అన్ని వసతులు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు పౌష్టికాహారం అందించే ఆరోగ్య లక్ష్మి పథకం దేశానికి ఆదర్శవంతంగా నిలిచిందని,నీతి ఆయోగ్,యూనిసెఫ్ ప్రశంసలు అందుకుందని ఆమె తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందని,దాని ఫలితంగానే తనకు జడ్పీ చైర్పర్సన్ గా అవకాశం లభించిందని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని,జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గా తాను, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భార్య సైతం ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాలు చేసుకోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు బారకావద్దని, పెళ్లి ఖర్చులు భరిస్తూ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను అమలు చేస్తుందని ఆమె తెలిపారు.గర్భిణీ స్త్రీలలో రక్త హినత తొలగించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని,2 వేల విలువ చేసే న్యూట్రిషన్ కిట్లను ప్రతి గర్భిణీ స్త్రీకి రెండుసార్లు అందించడం జరుగుతుందని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగే జిల్లాపరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తున్నారని, ప్రభుత్వపరంగా తన సొంతంగా ఎంతో మంది పేదవారికి అండగా నిలిచారని ఆమె గుర్తు చేశారు. ఈ ప్రాంతం నుంచి ప్రజల ఓట్లతో గెలిచి అనేక పదవులు అనుభవించిన గత పాలకులు ఏనాడు ఈ ప్రాంత ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని,కానీ ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పుట్ట మధన్న తన సొంత ఖర్చులతో ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసి చరిత్రలో నిలిచారని ఆమె కొనియాడారు.ఈ ప్రాంత ప్రజలను తమ బిడ్డలుగా భావిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించే పుట్ట మధుకర్ కు మహిళలంతా అండగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.

 

మహిళలకు అన్ని దశల్లో అండగా ప్రభుత్వం….

జిల్లా కలెక్టర్ డాక్టర్‌ ఎస్‌.సంగీత సత్యనారాయణ

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలకు జీవిత కాలంలో ప్రతి దశలో ప్రభుత్వం సహాయం అందిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ అన్నారు.గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం అందిస్తూ అనీమియా నివారణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి పథకానికి నీతి ఆయోగ్ ప్రశంసలు లభించాయని కలెక్టర్ తెలిపారు.ఆరోగ్య లక్ష్మి పథకం అమలులో దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని,గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పాలు,గుడ్డుతో పౌష్టికాహారం అందించడంతో పాటు,పుట్టిన పిల్లలు ఎదుగుదలకు బాలామృతం ప్లస్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని తెలిపారు.ప్రభుత్వ ఆస్పత్రులలో వంద శాతం ప్రసవాలు జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టిందని,దీనివల్ల ప్రభుత్వ ఆస్పత్రులలో జరిగే ప్రసవాలు మన జిల్లాలో 30 నుంచి 70 శాతానికి పెరిగాయని ఆమె అన్నారు.బాలికల విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసిందని ,కస్తూర్బా విద్యాలయాలను బలోపేతం చేసిందని అన్నారు.ఆడపిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీం బృందాలను ఏర్పాటు చేసి, ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు ద్వారా నిరంతర నిఘా పెట్టిందని అన్నారు.ఆడపిల్ల పెండ్లికి ఆర్థిక సహాయం అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం కుల,మతాలకతీతంగా కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ కింద ఒక లక్షా 116 సాయం అందిస్తుందన్నారు.మహిళల అభివృద్ధి కోసం ప్రతి దశలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం అర్హులకు పారదర్శకంగా అందిస్తుందని,పథకాలను మరింత సమర్థవంతంగా,విస్తృతంగా అమలు చేసేందుకు ప్రజల నుంచి వచ్చే సూచనలు,సలహాలను ఎప్పటికప్పుడు స్వీకరిస్తామని ఆమె తెలిపారు.అనంతరం వివిధ శాఖల్లో ఉత్తమసేవలు అందించిన మహిళా ఉద్యోగులు,సిబ్బందికి జెడ్పీ చైర్మన్‌లు పుట్ట మధూకర్‌, జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌,కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ, అడిషనల్‌ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!