శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద పాముకాటుకు గురైన చిన్నారి
కేరళ,నవంబర్23(కలం శ్రీ న్యూస్):కేరళ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయ పరిసరాల్లో విషసర్పాలు భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గురువారం ఉదయం స్వామివారి దర్శనానికి వచ్చిన ఓ ఆరేళ్ల చిన్నారిని పాము కాటేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ చిన్నారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లాకు చెందిన ఆరేళ్ల చిన్నారి నిరంజన తన కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమల వెళ్లింది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అయ్యప్పన్ రోడ్డు ముందు పాము కాటుకు గురైంది. స్పందించిన ఆలయ అధికారులు చిన్నారిని వెంటనే పంబ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చిన్నారికి అత్యవసర వైద్యం అందించారు. యాంటీ-వెనమ్ ఇంజెక్షన్ వేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఆలయానికి వెళ్లే మార్గంలో వన్యప్రాణుల దాడిని నిరోధించేందుకు చర్యలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ఎక్కువ మంది పాములు పట్టేవారిని నియమించాలని నిర్ణయించారు. ప్రస్తుతం డిపార్ట్‌మెంట్‌లో ఇద్దరు స్నేక్ క్యాచర్లు మాత్రమే పనిచేస్తుండగా.. ఘటన తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అదనంగా మరో ఇద్దరు పాములు పట్టేవారిని నియమించాలని అధికారులు ఆదేశించారు.
మరోవైపు శబరి అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు అధికారులు అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
రెండు నెలల పాటు సాగే దర్శనాల్లో భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయం ఈనెల 17వ తేదీ నుంచి తెరుచుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మండల- మకరవిళక్కు వేడుకలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో మండల పూజల కోసం శబరిమల ఆలయాన్ని అధికారులు గురువారం సాయంత్రం తెరిచారు. శుక్రవారం ఉదయం నుంచి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దీంతో అయ్యప్ప దర్శనం కోసం కేరళ నుంచే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు శబరిమల కొండకు తరలివెళ్తున్నారు. మరోవైపు రెండు నెలల పాటు సాగే స్వామి దర్శనాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.