Tuesday, December 3, 2024
Homeబిగ్ బ్రేకింగ్యదేచ్చగా నిషేధిత గుట్కా అమ్మకాలు

యదేచ్చగా నిషేధిత గుట్కా అమ్మకాలు

యదేచ్చగా నిషేధిత గుట్కా అమ్మకాలు

  • సుగ్లాంపల్లి లో భారీ నిల్వలు..?
  • ఒక్క సుల్తానాబాద్ మండలంలో నెలకు సుమారు కోటి రూపాయల వ్యాపారం.!
  • చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు.

సుల్తానాబాద్,జులై15(కలం శ్రీ న్యూస్):    మండలంలో నిషేధిత గుట్కా విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వాటి విక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ పలువురు వ్యాపారులు ఆ నిబంధనలను తుంగలో తొక్కారు.  పలు దుకాణాల్లో గుట్కా విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. అదిలాబాద్,మహారాష్ట్ర నుంచి మండలానికి గుట్కా ప్యాకెట్ల సరఫరా జరుగుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. గుట్కా విక్రయాల్లో అధిక లాభాలు ఉండడంతో కొందరు వ్యాపారులు ఆ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే తప్ప గుట్కా విక్రయాలపై పోలీసులు దృష్టి సారించడం లేదని స్థానికుల నుంచి ఆరోపిస్తున్నారు.

 

జోరుగా అమ్మకాలు

సుల్తానాబాద్ మండలంలో నిషేధిత గుట్కా దందా జోరుగా కొనసాగుతుంది. మూడు మండలాలతో పాటు, గ్రామాల్లోని వివిధ కిరాణ దుకాణాల్లో అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. మొన్నటి వరకు నిషేధిత అంబర్ ప్యాకేట్ 200రూపాయలు ఉండగా,నేడు 400 రూపాయలకు అమ్ముతున్నారు. కొందరు బడా వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి పొగాకు ఉత్పత్తులను కొనుగోళ్లు చేసి రాత్రివేళ్లలో తీసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. రోజు ద్విచక్ర వాహనాలపై కిరాణా షాపులకు సరఫరా చేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది.

తనిఖీలు శూన్యం…!

మండలంలో గుట్కా అక్రమ వ్యాపారంపై సంబంధిత అధికారులు కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గుట్కా వ్యాపారులపై అధికారులు ఎందుకు దాడులు చేయడం లేదో, ఇందులో మతలబు ఏమిటో అర్థం కావడం లేదు అని పలువురు గుసగుసలాడుతున్నారు.ఇందులో బడా వ్యాపారులు ఉన్నారని,వారి మామూళ్ల మత్తులో సంబంధిత అధికారులు ఉన్నారని ఆరోపణలున్నాయి.లేదంటే ఇంతవరకు మండలంలో గుట్కా వ్యాపారులపై దాడులు చేసి ఒక్క కేసు నమోదు చేయక పోవడం చాలా శోచనీయం.ఇదే అదునుగా భావించిన గుట్కా వ్యాపారులు బహిరంగంగా అమ్మకాలు జరుపుతున్నారు.

జిల్లాలో ఉమ్మడి దాడులు ఏవి..?

వాస్తవానికి నిషేధిత గుట్కా నిల్వలు అమ్మకుండా రెవెన్యూ, పొలీసు, ఆహార తనిఖీ శాఖ అధికారులు చూడాల్సి ఉంది. స్థానిక పరిస్థితులను బట్టి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. అన్ని శాఖల సమన్వయంతో ఉమ్మడిగా దాడులు చేయాలి. కానీ జిల్లాలో ఎక్కడా ఆవిధంగా జరగడం లేదు. ఫిర్యాదులు అందగానే పోలీసులు వ్యాపారుల వద్దకు వాలిపోయి మొక్కుబడిగా కొన్ని కేసులు నమోదు చేయడానికి అలవాటు పడ్డారు. ఇక రెవెన్యూ, ఆహార తనిఖీ శాఖ అధికారులు గుట్కా అమ్మకాల నియంత్రణ ఊసెత్తిన సందర్భం లేదనే చెప్పాలి. 2005 ఆహార భద్రత చట్టం ప్రకారం గుట్కా తయారు చేసినా,విక్రయించినా, రవాణా చేసినా చట్టరీత్యా నేరం. వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, రవాణా, కార్మిక, పురపాలక, పంచాయతీరాజ్‌, నిఘా, వాణిజ్య పన్నుల శాఖల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా గుట్కా అమ్మకాలపై తనిఖీలు చేయాలి. కానీ ఏ సందర్భంలోనూ అన్ని శాఖలు కలిసి గుట్కాపై నిల్వలపై దాడులు చేసిన సందర్భాలు లేవు.

మత్తులో యువత

నిషేధిత గుట్కా ప్యాకెట్ల విక్రయాలు జోరుగా సాగుతుండడంతో యువకులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. చిన్న వయసులోనే అలవాటు పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గుట్కా ప్యాకెట్లు తింటూ చెడు వ్యసనాలకు గురవుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి నిషేధిత గుట్కా ప్యాకెట్ల విక్రయాలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!