యువత లక్ష్యంతో ముందుకెళ్లాలి: సీఐ జగదీష్
సుల్తానాబాద్,జూలై25(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల యువకులకు సుల్తానాబాద్ సిఐ జగదీష్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ….ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఒత్తిడిని జయించలేక తప్పుడు అలవాట్లకు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు.
విద్యార్థులు, యువత ఒక లక్ష్యంతో ముందుకెళ్లాలి. ఆన్‌లైన్ మోసాలు, నకిలీ బ్యాంక్ లోన్ యాప్స్‌పై ప్రజల్లో చైతన్యం రావాలంటే యువతతోనే సాధ్యమవుతుంది. సోషల్ మీడియా కీడు ఎక్కువగా చేస్తుందని, టెక్నాలజీ ముసుగులో జరుగుతున్న మోసాలపై చైతన్యం చేసేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నం. ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తాం అని సీఐ జగదీష్ తెలిపారు. మనం మంచి స్నేహితులను ఎంచుకున్నప్పుడే మంచి దారిలో పయనించవచ్చని పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని సానుకూలంగా తీసుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్లను మంచి కోసం వినియోగించాలని కోరారు. ప్రతి అంశంలో మంచీ చెడు రెండూ ఉంటాయి. ప్రతి దానిని మంచి కోసం వినియోగించాలి. యువత మంచి మార్గంలో పయనించాలి. మత్తు పదార్థాలకు బానిస కావద్దు. జీవితాలను అంధకారం చేసుకోవద్దు. దేశభవిష్యత్తు, అభివృద్ధి నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాలి అని సూచించారు.
పోలీస్ ఆధ్వర్యంలో వచ్చేనెల లో నిర్వహించే బ్లడ్ డొనేషన్ క్యాంపు కి అధిక సంఖ్యలో హాజరై రక్తదానం చేయాలని, మీరిచ్చే రక్తం ఆపదలో ఉన్నవారికి ప్రాణం పోస్తుందని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలనీ అలా చేయడం ఆరోగ్యపరంగా కూడా మనకు కూడా మంచిదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ఎస్ఐ విజేందర్, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ శ్రీనివాస్, జూలపల్లి ఎస్ఐ వెంకటకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.