ప్రజలే విగ్రహం పెట్టుకున్న చరిత్ర ప్రభాకర్‌రెడ్డిదే
విగ్రహ ఆవిష్కరణలో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 22(కలం శ్రీ న్యూస్):ప్రజల కోసం పరితపిస్తూ వాళ్ల కోసమే పనిచేసే వారే నిజమైన నాయకులని వాళ్లే ఏనాటికైనా వెలుగులోకి వస్తారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ స్పష్టం చేశారు.గురువారం ముత్తారం మండలం ఓడేడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్ స్వర్గీయ పోతిపెద్ది ప్రభాకర్‌రెడ్డి విగ్రహాన్ని ఆయన లాంచనంగా ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు మల్హర్ మండలానికి చెందిన మల్హర్‌రావు చనిపోతే ఆ మండలంలోని ప్రతి ఇంటిలో మల్హర్‌రావు ఫోటో పెట్టుకున్నారని,ఈనాడు ఓడేడ్ గ్రామ ప్రజల అందరి హృదయాల్లో ప్రబాకర్‌రెడ్డి కన్పిస్తున్నాడని అన్నారు. నియోజకవర్గంలో రాష్ట్ర ఏర్పాటు తర్వాత నుంచి అనేక మంది మహనీయుల విగ్రహాలను నెలకొల్పుతూ ఈ ప్రాంతంలో చర్చ జరుగాలని పదేపదే చెబుతున్నామని అన్నారు.కానీ నియోజకవర్గంలో ఒకే విగ్రహం పెట్టి వాళ్ల చరిత్రనే చాటిచెప్పేలా ప్రయత్నం చేశారని అన్నారు. మా విగ్రహాలు పెట్టుకోవాలని బలవంతం చేస్తే బోసిపోయి కన్పిస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. అయితే అసలు మహనీయులు ఎవరు ప్రజల కోసం ఎవరు పాటుపడ్డరు వాళ్ల కోసమే ఎవరు బతికిండ్లని చర్చ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మహనీయుల చరిత్ర తెలియకుండా చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆయన గుర్తు చేశారు. అనేక ఏండ్ల బ్రాహ్మణీయ పాలనలో మహనీయుల చరిత్రను దాచిపెట్టారని,చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేస్తే పక్కదారి పట్టించారని ఆయన అన్నారు. చరిత్రను బావితరాలకు చెప్పకపోతే మళ్లా మోసం చేస్తారని ఈ క్రమంలోనే చరిత్ర తెలుసుకుని చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ప్రజలే స్వచ్చందంగా ఒక నాయకుడి విగ్రహం పెట్టుకోవడం జరుగుతోందని, ప్రజల నాయకుడిగా ప్రభాకర్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఆయన అన్నారు. 33ఏండ్ల తర్వాత కూడా ఆయనపై ఇక్కడి ప్రజలకు ప్రేమ ఉందో అర్థం అవుతుందని, ఆనాడు ఏ విధంగా ప్రజల కోసం పనిచేసిండో కన్పిస్తోందన్నారు. ప్రజలను పీడించి హింసించిన వాళ్లు చనిపోతే చర్చ పెడుతున్నారే కానీ ప్రజల కోసం పనిచేసిన వారి గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు. నియోజకవర్గంలో ప్రజల కోసం పరితపిస్తూ రాజకీయంగా పైకి రావాలని ఆలోచన చేసిన వాళ్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు అణిచివేశారని,అంతే కాకుండా హత్యలు చేయించారని ఆయన గుర్తు చేశారు. దామెరకుంటకు చెందిన తోటపెల్లి రాజిరెడ్డి. ప్రభాకర్‌రెడ్డిలను హత్య చేయించింది ఎవరో గుర్తు చేసుకోవాలన్నారు. మన ఓట్లతో గెలిచి చెంచడు నీళ్లు పోయని ఒక కుటుంబం 40ఏండ్లుగా అధికారం చెలాయిస్తోందని,ఎస్సీ ఎస్టీ, బీసీలను అణిచివేసేందుకు అనేక కుట్రలు చేశారన్నారు. బ్రాహ్మణీయ పాలనలో రెడ్డి సామాజిక వర్గాన్ని సైతం అణిచివేశారని, ఈ క్రమంలో రెడ్డి సామాజిక వర్గం చైతన్యం కావాలని మంథనిలో రాజా బహుదూర్ రెడ్డి విగ్రహం పెట్టే ఆలోచన చేస్తున్నామని ఆయన తెలిపారు. రాజకీయంగా ఎదుగుతున్న నాయకులను హత్య చేయించిన చరిత్ర కాంగ్రెస్‌కే దక్కిందన్నారు.అనాడు కాంగ్రెస్‌పార్టీ అణిచివేత దోరణికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రభాకర్‌రెడ్డిని అనేక ఇబ్బందులకు గురి చేసి జైలుపాలు చేశారని ఆయన గుర్తు చేశారు.అనేక ఏండ్లు జెండా మోసి అన్నం పెట్టిన కుటుంబానికి ఏం చేసిండో చర్చ జరుగాలన్నారు.మీతో మేలు జరుగుతలేదని పార్టీ నుంచి బయటకు వచ్చిన కిషన్‌రెడ్డిని గంజాయి కేసులో ఇరికించాలని చూసింది ప్రస్తుత ఎమ్మెల్యే కాదా అని ఆయన ప్రశ్నించారు. మా జెండాలు మోస్తూ మా కోసం బతికితేనే వదులుతామని ఆనాడు ప్రభాకర్‌రెడ్డి నుంచి ఈనాటి కిషన్‌రెడ్డి వరకు ఆ కుటుంబం వదిలిపెట్టలేదని ఆయన వివరించారు. ప్రజల కోసం ఎవరు ఆరాటపడుతారో, ఎవరు అధికారం కోసం తపన పడుతారో ప్రజల ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని,అంబేద్కర్ ఇచ్చిన సీక్రెట్ ఓటుద్వారా మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. మన ఓట్లతో అధికారంలో ఉన్న ఒక్క కుటుంబం ఏనాడు మన బాగు కోసం ఆలోచన చేయలేదని, వాళ్లు అమెరికాకు పోయి బాగుపడ్డారే కానీ మనల్ని బాగు చేయాలని చూడలేదన్నారు. ప్రబాకర్‌రెడ్డి స్పూర్తితో ప్రతి ఒక్కరు పని చేయాలని, ప్రజలు అంబేద్కర్ ఇచ్చిన సీక్రెట్ ఓటు ద్వారా మంచి నాయకత్వాన్ని ఎన్నుకుని నియోజకవర్గానికి వెలుగులు వచ్చేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.