జోరుగా సాగుతున్న నిషేధిత గుట్కా అమ్మకాలు
- ఒక్క సుల్తానాబాద్ మండలంలో నెలకు సుమారు 30 లక్షల వ్యాపారం.!
- జిల్లా కేంద్రంలో కోట్ల లో వ్యాపారం
సుల్తానాబాద్,జూన్18(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ లో గుట్కా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. మండలంలోనీ ప్రతి గ్రామాల్లో, ప్రతి కిరాణా,పాన్ షాపుల్లో నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్లు జోరుగా విక్రయిస్తున్నారు.
జోరుగా అమ్మకాలు
సుల్తానాబాద్, ఎలిగేడు, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో గుట్కా దందా జోరుగా కొనసాగుతుంది. మూడు మండలాలతో పాటు, గ్రామాల్లోని వివిధ కిరాణ దుకాణాల్లో అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. మొన్నటి వరకు నిషేధిత అంబర్ ప్యాకేట్ 200రూపాయలు ఉండగా,నేడు 400 రూపాయలకు అమ్ముతున్నారు. కొందరు బడా వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి పొగాకు ఉత్పత్తులను కొనుగోళ్లు చేసి రాత్రివేళ్లలో తీసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. రోజు ద్విచక్ర వాహనాలపై కిరాణా షాపులకు సరఫరా చేస్తూ.. అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది.
చిరువ్యాపారులపైనే చర్యలు..!
గుట్కా అక్రమ వ్యాపారంపై సంబంధిత అధికారులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు జరుపుతున్న దాడుల్లో చిరువ్యాపారులు మాత్రమే పట్టుబడుతున్నారు. బడా వ్యాపారులు చిక్కడంలేదని ఆరోపణలున్నాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా పెద్ద మోతాదులో గుట్కాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నప్పటికీ గుట్కా వ్యాపారులు తమ పద్ధతులను మార్చుకోవడం లేదు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి తాఖీదులు, హుకుం జారీ చేస్తే నామ్‌కేవాస్తుగా షాపుల్లో తనిఖీలు నిర్వహించి గుట్కాలు,అంబార్ ప్యాకేట్లను స్వాధీనం చేసుకుని వ్యాపారులను వదిలేస్తున్నారని ఆరోపణలున్నాయి
మత్తులో యువత
నిషేధిత గుట్కా ప్యాకెట్ల విక్రయాలు జోరుగా సాగుతుండడంతో యువకులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. చిన్న వయసులోనే అలవాటు పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గుట్కా ప్యాకెట్లు తింటూ చెడు వ్యసనాలకు గురవుతున్నారు. పోలీసు యంత్రాంగం అడపాదడపా నిషేధిత గుట్కా విక్రయాలపై దాడులు నిర్వహించి చేతులు దులుపుకోవడంతో గుట్కా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి నిషేధిత గుట్కా ప్యాకెట్ల విక్రయాలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.