అలుపెరుగని అక్షర యోధుడు రామోజీ
–సంతాపం ప్రకటించిన టీడబ్ల్యూజేఎఫ్.
పెద్దపల్లి,జూన్8(కలం శ్రీ న్యూస్):ఈనాడు మీడియా గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు మృతి పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజే ఎఫ్) పెద్దపల్లి జిల్లా కమిటి సంతాపాన్ని తెలియజేస్తూ, అలుపెరుగని అక్షర యోధునికి ఘన నివాళులర్పించింది.
రామోజీ రావు పాత్రికేయ రంగంలో చెరగని ముద్ర వేశారని, పత్రికా స్వేచ్ఛను, జర్నలిజం విలువలను కాపాడేందుకు విశేష కృషి చేశారని ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోగుల విజయకుమార్ ,సుంక మహేష్ పేర్కొన్నారు. పత్రికా రంగంలో రామోజీరావు ఒక నూతన ఒరవడి సృష్టించారని, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎందరో జర్నలిస్టులను తయారుచేసి తెలుగు సాహిత్య, సమాచారాభివృద్ధికి నిత్యం కృషి చేశారని పేర్కొన్నారు. తెలుగు భాషకు, తెలుగు మీడియా రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని, ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమస్ఫూర్తితో పని చేశారని, నైతిక విలువలు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయుడని వారు కొనియాడారు. రామోజీ రావు మృతికి సంతాపం తెలియజేస్తూ…ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు