నిలిచిపోయిన కాగజ్ నగర్, నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు…ప్రయాణికుల ఆందోళన
కమలాపూర్,మే19(కలం శ్రీ న్యూస్): హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను ఉప్పల్ స్టేషన్ లో సాయంత్రం 6.10గంటలకు నిలిపివేశారు. ఆ తర్వాత అహ్మదాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్తోన్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ను నిలిపివేశారు. నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఇంజిన్ లో సాంకేతిక లోపం కారణంగా నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌ను నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌కు మార్చిన అనంతరం రాత్రి 8గంటలు దాటిన తర్వాత రెండు రైళ్లు బయల్దేరాయి. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు స్టేషన్ మాస్టర్‌తో వాగ్వాదానికి దిగారు. దాదాపు రెండు గంటలకు పైగా రైళ్లు నిలిచిపోవడంతో వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బంది పడ్డారు.