Saturday, July 27, 2024
Homeతెలంగాణనేటి నుంచి ధనుర్మాసం ఆరంభం

నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం

నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం

ముస్తాబైన వైష్ణవాలయాలు

రామానుజ దాసుడు సాదుల సుగుణాకర్

హైదరాబాద్,డిసెంబర్17(కలం శ్రీ న్యూస్):ఆదివారం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే వైష్ణవాలయాలు తిరుప్పావై పాశురాల పారాయణంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మికత వాతావరణం సంతరించుకుంటుంది. ముఖ్యంగా తిరుప్పావై పాశురాల పారాయణం కొనసాగుతుంది. సూర్యోదయానికి ముందుగా 15 రోజులపాటు సూర్యోదయం తర్వాత మరో 15 రోజుల పాటు ఈ తిరుప్పావై పాశురాల పారాయణం, నైవేద్యాల నివేదనలు ఉంటాయి. దక్షిణాయనికి చివర ఉత్తరాయణానికి ముందర ఈ దనుర్మాస ప్రాతః కాలం పవిత్రమైంది. ధనుర్మాసం అంటే దివ్యమైన ప్రార్థనలకు భగవంతున్ని సులభంగా పొందడానికి అనువైన మాసంగా పరిగణిస్తారు. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ఈ ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతూ తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ఈ ధనుర్మాసం ముగుస్తుంది.

ధనుర్మాసం నెల రోజుల పాటు ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్‌) మార్గళి వ్రతం , సిరి నోము పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి , స్వామిని కీర్తించింది. ధనుర్ సంక్రమణ రోజు స్నానాలు , పూజలు , జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు , వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం.

పరమ పవిత్రమైన మాసం

ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధను అనగా దేనికొరకు ప్రార్థించడమో అనే అర్థం దృష్ట్యాధనుర్మాసం అత్యంత పునీతమైనది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు , ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి అంటే ఆండాళమ్మ పూజ , తిరుప్పావై పఠనం , గోదాకళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని పెద్దలు చెప్తారు. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు , సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. శయన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సంప్రదాయం.

బ్రహ్మ ముహూర్తంలో పారాయణం

ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతి రోజు బ్రాహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తద్యమని శాస్తవ్రచనం. సాక్షాత్‌ భూదేవి , అవతార మూర్తి అయిన అండాళ్‌ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రమైన , పావై అనగా వ్రతం , ప్రబంధం అని అర్థం. వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వాచార్యులు ప్రస్తుతించి యున్నారు. ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభరీతిలో వెలువడి నాయనీ , తిరుప్పావై మహావిష్ణు పాద పద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలనీ చెప్పబడింది.

 

ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి , మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లిడు అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు , గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.ప్రతి రోజూ ఒక పాశురం తో (కీర్తన) స్వామిని కీర్తించేది ఆండాళ్ తల్లి.ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు, నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది.

ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ , ఆదిత్య పురాణాల్లో , భాగవతంలో , నారాయణ సంహితలో కనిపిస్తాయి.  ఈ వ్రతం ఆచరించుకోవాలనుకునేవారు శక్తిమేరకు విష్ణు, లేదా కృష్ణుని ప్రతిమని తయారుచేయించి , పూజాగృహంలో ప్రతిష్టించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి , స్నానాదికాలు ముగించాలి. శ్రీమహావిష్ణువును తులసీ దళాలు , పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం నమర్పించాలి. ఈ నెలరోజులూ విష్ణు కథలను చదవటం , తిరుప్పావై పాశురాలు పఠించటం చెయ్యాలి.  నెలరోజులూ చెయ్యలేనివారు పదిహేను రోజులు , 8 రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా ఆచరించవచ్చు. వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి , ఆశీస్సులు అందుకోవాలి.ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు , పరలోక మోక్షం పొందుతారు. ఆత్మపర మాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయు లందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చనీ , నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసి వారికి, తిరుప్పావై గాన , శ్రవణం చేసిన వారికీ ఆయు రారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కాగలదనీ, ఆశిద్దాం.

రామానుజ దాసుడు సాదుల సుగుణాకర్

 

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!