ఐదేండ్లలో ఏం చేసిండ్లని మళ్లీ ఓట్లు వేయాలే
ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ.
మంథని,నవంబర్27(కలం శ్రీ న్యూస్):మనం ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఐదేండ్లు ఏం చేసిండ్లని మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ ప్రశ్నించారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా సోమవారం మంథని మున్సిపల్ పరిధిలోని 13, 09వ వార్డుల్లో ఆమె ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ 40ఏండ్ల పాటు మంథని కాంగ్రెస్ పార్టీ పాలకులే రాజ్యమేలారని, వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎమ్మెల్యే, మంత్రి స్థాయిలో పదవుల్లో ఉన్నా మంథనిని అభివృద్ది చేయలేదని విమర్శించారు. అధికారం, పదవులపై ఉన్న శ్రద్దను అబివృధ్ది, ప్రజల కష్టాలను తీర్చాలని ఆలోచన చేయలేదని అన్నారు. ఐదేండ్లు ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మన కష్టాలు పట్టించుకోకుండా మళ్లీ ఎన్నికల వచ్చాయని ఓట్ల కోసమే వస్తున్నాడని ఆమె ఎద్దేవా చేశారు. అనేక ఏండ్లు అధికారంలో ఉన్నా కనీసం ఒక్క పేదోడికి ముఖ్యమంత్రి సహయ నిధి ఇప్పించిన దాఖాలాలు లేవని ఆమె అన్నారు. కానీ 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మంథని ప్రజలు గొప్పగా ఆలోచన చేసిన తనను మంథని సర్పంచ్‌గా, పుట్ట మధూకర్ ని ఎమ్మెల్యేగా ఆదరించి ఆశీర్వదించారని, ఆనాటి నుంచే మంథనిలో మార్పు మొదలైందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంథని అభివృధ్దితో పాటు ఈ ప్రాంత ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. ఆర్థిక స్థోమత లేక అనారోగ్యంతో అస్పత్రిల్లో చికిత్స పొందే ఎంతో మంది పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా ఆదుకున్న చరిత్ర పుట్ట మధూకర్‌దేనని ఆమె గుర్తు చేశారు. మున్సిపల్ పరిధిలో ప్రజల అవసరాలను గుర్తించి పనులు చేశామని, ప్రజలకు అండగా నిలుస్తూ అభివృధ్ది చేస్తుంటే తమ కుటుంబంపై కాంగ్రెస్సోళ్లు అపవాదులు, అబండాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె వివరించారు. ఈనాడు మున్సిపల్ చైర్ పర్సన్‌గా తాను, జెడ్పీ చైర్మన్‌గా పుట్ట మధూకర్ మంథని ప్రజల కోసమే జీవిస్తున్నామని అన్నారు. ఇటు అభివృద్ది సంక్షేమంతో పాటు అనేక సేవలు అందిస్తున్నామని అన్నారు. 40ఏండ్లు మన ఓట్లతో ఈ ప్రాంతాన్ని ఏలినోళ్లు ఏనాడైనా ఒక పేద కుటుంబానికి సాయం చేసిండ్లా, ఎవరికైనా అన్నం పెట్టి ఆకలి తీర్చిండ్లా అని ఆలోచన చేయాలన్నారు. ఐదేండ్లు మా ప్రభుత్వం లేదన్నోళ్లకు ఓట్లు వేస్తే వృధానేనని ఆమె అన్నారు. మంథని మరింత అభివృధ్ది చెందాలంటే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం, మంథనిలో పుట్ట మధూకర్ గెలుపుతోనే సాధ్యమవుతాయని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలతో పాటు పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా గొప్పసేవలు అందిస్తామని ఆమె తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మంథని ఎమ్మల్యేగా పుట్ట మధూకర్‌ను ఆదరించి ఆశీర్వదిస్తే ఐదేండ్లు మీ సేవకులుగా పనిచేస్తామని ఆమె పేర్కొన్నారు.