Saturday, July 27, 2024
Homeతెలంగాణనన్ను ఖతం చేయాలని అందరు ఒక్కటైతాండ్లు

నన్ను ఖతం చేయాలని అందరు ఒక్కటైతాండ్లు

నన్ను ఖతం చేయాలని అందరు ఒక్కటైతాండ్లు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌

మంథని,నవంబర్26(కలం శ్రీ న్యూస్):ఐదేండ్లకోసారి వచ్చే ఎమ్మెల్యే, ఎంపీ ఓటు మన భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని, గొప్పగా ఆలోచన చేసి ఓటును సద్వినియోగం చేసుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా మహదేవ్‌పూర్‌ మండలం సూరారం, మహదేవ్ పూర్ గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్‌, ఎంపీటీసీ ఎన్నికలు కేవలం గ్రామ సమస్యలు మాత్రమే పరిష్కారం అవుతాయని, ఎమ్మెల్యే ఓటు మన జీవితాలను నిర్ణయిస్తాయని చెప్పారు. ఈనాడు ఎన్నికలు వచ్చాయంటే అనేక పరిస్థితులు మారుతుంటాయని, ప్రస్తుతం లెంకల గడ్డ నుంచిమహదేవ్‌పూర్‌ వరకు ప్రచారం చేస్తుంటే లీడర్లు ఒక్కవైపు, ప్రజలు ఒక్కవైపు ఉన్నట్లు కన్పిస్తోందన్నారు. ఎన్నికలు వచ్చాయంటే పార్టీలు మారుతున్న లీడర్ల వైఖరిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. ఆదరించి అక్కున చేర్చుకుని పదవులు ఇస్తే దగ్గరుండి వెన్నుపోటు పొడిచారని ఆయన వాపోయారు.

మహదేవ్‌పూర్‌ కు చెందిన ప్రజాప్రతినిదులు ఎన్నికల సమయంలోనే మోసం చేశారని, ఒక ప్రజాప్రతినిధిపై అవిశ్వాసంపెట్టించి, మళ్లీ ఆయన కాపాడాడని, అవిశ్వాసం పెట్టించనోళ్ల చెంతకే మళ్లీ చేరారని అన్నారు.మరోనాయకుడు నమ్మించి మరీ పార్టీ మారాడని వివరించారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి నాలుగేండ్లుగా కనబడతలేడని, ప్రజలు ఎవరూ నమ్మరంటూ ఉపన్యాసాలు ఇచ్చి ఈనాడు మళ్లీ ఆ పార్టీ లోకి ఆ అభ్యర్థి చెంతకు పోవడం సిగ్గుచేటన్నారు. ఈనాడు తనపై గెలువాలని కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి మంచోడిగా నటిస్తూ చేతికి మట్టి అంటకుండా లీడర్లను ఒకవైపు కొంటూ, మరోవైపు మాజీ నక్సలైట్లను, స్మగ్లర్లను, రౌడీలను పార్టీలో చేర్చుకుంటున్నారని అన్నారు. తాను ఈ స్థాయికి ఎదిగి అడ్డుగా ఉన్నానని రాజకీయంగా ఖతం చేయాలని అనేక కుట్రలు చేస్తున్నారని, గత ఎన్నికల్లో నా ఓటమికి కారకులను పంచన చేర్చుకున్నాడని ఆయన తెలిపారు.నాతోపాటు నా పక్కన ఉండే నాయకులకు పదవులు ఇచ్చి గౌరవింపబడాలని ఆలోచన చేసే వ్యక్తినని, అన్ని కులాలను గౌరవించేలా ఎంతోమందికి పదవులు ఇచ్చిన చరిత్ర తనదేనన్నారు. ఎన్నికలు వచ్చాయంటే డబ్బు సంచులతో అన్నా తమ్ముళ్లు వచ్చి ప్రజలను మభ్యపెట్టి మాయ చేస్తున్నారని, కాంగ్రస్‌ అభ్యర్థి మాటలు నమ్మితే మోసపోకతప్పదన్నారు. మహదేవ్‌పూర్‌ నుంచే చైతన్యం మొదలైందని, ఈ చైతన్యం నియోజకవర్గం అంతా వస్తుందని, ప్రజలు ఆలోచన చేస్తున్నారని, ఎమ్మెల్యేగా ఎవరిని ఆదరిస్తే అందుబాటులో ఉంటారో, ఎవరు ఐదేండ్లకోసారి ఓట్ల కోసం వస్తారో గమనిస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం,సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే అభివృధ్ది సంక్షేమ ఫలాలు అందుతాయని, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారంలోకి రాంగానే ఎన్నికల మేనీఫెస్టోను అమలు చేస్తారని చెప్పారు. ప్రభుత్వ పథకాలతో పాటు తాను సొంతంగా మరిన్నిసేవలు అందిస్తానని, నాలుగేండ్లు అవకాశం ఇస్తే తాను చేసిన అభివృధ్ది, సేవలు మీ కళ్ల ముందే ఉన్నాయన్నారు.మళ్లీ మీ ఇంటి బిడ్డగా ఆదరించి ఆశీర్వదిస్తే ఐదేండ్లు మీ సేవకుడిగా పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!