Saturday, July 27, 2024
Homeతెలంగాణశబరిమలకు పోటెత్తిన భక్తులు.

శబరిమలకు పోటెత్తిన భక్తులు.

శబరిమలకు పోటెత్తిన భక్తులు.

కేరళ,నవంబర్25(కలం శ్రీ న్యూస్):శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవటానికి వస్తున్న భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుంది. ఒక పక్క వర్షాలు కురుస్తున్నా, అయ్యప్ప భక్తులు మాత్రం స్వామిని దర్శనం చేసుకోవటానికి వెనుకాడటం లేదు. ప్రస్తుతం కేరళలో భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. స్వామియే అయ్యప్ప అంటూ అయ్యప్ప నామ స్మరణతో శబరిమల ప్రాంతాలు మారుమోగుతున్నాయి.

కేరళలో కొలువైన అయ్యప్ప మహా మహిమాన్వితమైన స్వామి. ఎన్నో నియమాలతో అయ్యప్ప స్వామీ మాల ధరించి ఆయనను పూజిస్తే అయ్యప్ప కరుణిస్తాడని భక్తులు నమ్ముతారు. అయ్యప్ప దర్శనంతో జన్మ పావనం అవుతుందని అనాదిగా భక్తుల విశ్వాసం. ఇక ప్రస్తుతం శబరిమల కొండ మొత్తం అయ్యప్ప నామ స్మరణతో మారుమోగి పోతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తున్నారు.

ఈ సంవత్సరం మండల మకర విళక్కు వేడుకలు ఈ నెల 17 వ తేదీ నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండు  నెలల పాటు ఈ క్రమంలో అయ్యప్ప ఆలయం తెరచి ఉంటుంది. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవటం కోసం కేరళ రాష్ట్రం నుండి మాత్రమే కాక ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు శబరిమల కొండకు బారులు తీరుతున్నారు.

ఇక ఇప్పటివరకు అయ్యప్ప స్వామిని 5 లక్షల మందికి పైగా దర్శించుకున్నారు. ముఖ్యంగా నిన్న ఒక్కరోజే 70 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఇక అయ్యప్ప ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతున్న నేపధ్యంలో, భద్రతా నిఘా పెంచడానికి, అత్యవసర సమయాల్లో భక్తులను వేగంగా తరలించడానికి వీలుగా శబరిమల వద్ద హెలిప్యాడ్ అవసరమని పోలీసులు కేరళ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.

అంతేకాదు పంపా నది నుండి అయ్యప్ప స్వామి సన్నిధానం వరకు సరుకు రవాణా చెయ్యటం కోసం రోప్ వే వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలని సూచించారు. మొత్తంగా భక్తుల రద్దీతో అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చెయ్యటంలో ట్రావెన్ కోర్ బోర్డు నిమగ్నమయ్యింది.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!