మన బతుకులకు భరోసా ఇచ్చేది పుట్ట మధూకర్ మాత్రమే
ఇంటింటి ప్రచారంలో మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ.
మంథని,నవంబర్24(కలం శ్రీ న్యూస్):అనేక ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్సోళ్ల హయాంలో మంథని వెనుకబాటుకు గురైందని, ఏం అభివృధ్ది చేయలేదని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మంథని మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో వార్డు కౌన్సిలర్ వీకే రవి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. 75 ఏండ్ల స్వాతంత్య్రంలో అగ్ర భాగాన మన ఓట్లు ఒకే కుటుంబానికి వేశామని, కనీసం ఈ ప్రాంత అభివృధ్ది, ప్రజల అవసరాలు తీర్చాలని ఆలోచన చేయలేదన్నారు. కేవలం ఒక్కసారి ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్‌కు అవకాశం కల్పిస్తే అనేక అభివృధ్ది పనులు, సంక్షేమ పథకాలు, సేవలు అందించారన్నారు. ఈనాటి పథకాలు, పనులు, సేవలు మీ కళ్ల ముందే కన్పిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా సేవలు అందని ఇల్లు లేదన్నారు. విద్యా వైద్యంతో పాటు పేద వర్గాలకు ఆకలి తీర్చిన గొప్ప సేవకుడు పుట్ట మధూకర్ అని వివరించారు. తొమ్మిదేండ్ల కాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా చేసిన అభివృద్ది, సేవలు మీ కళ్ల ముందే కన్పిస్తున్నాయని ఆమె అన్నారు. అన్నం పెట్టి ఆకలి తీర్చినోళ్లను ఆదరించాలని, అధికారంలో ఉండి చెంచడు నీళ్లు పోయనోళ్ల గురించి ఆలోచన చేయాలన్నారు. గత ఎన్నికల్లో ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఐదేండ్లు ఏం చేయలేదని,మళ్లీ ఎన్నికలు వచ్చాయని ఓట్ల కోసమే మన వద్దకు వస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు, ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఐదేండ్లు ఏం చేశారని ప్రశ్నించాలన్నారు. సేవ చేసే నాయకుడు కావాలా ఐదేండ్ల కోసారి ఓట్ల కోసం వచ్చే నాయకుడు కావాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఆగమై కాంగ్రెస్‌కు ఓటేస్తే ఐదేండ్లు మళ్లా గోసపడుతామని ఆమె అన్నారు. ఎన్నికలు వచ్చాయని అధికారం పదవుల కోసం ఆరు అబద్దపు పథకాలతో మన ముందుకు వస్తున్నారని, ఐదేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఏమీ చేయనోళ్లు ఆరు పథకాలు ఎలా అమలు చేస్తారని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు అవుతాయనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనీఫెస్టలోని పథకాలు ప్రతి కుటుంబానికి భరోసా ఇస్తాయని ఆమె తెలిపారు. మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్ గెలిచిన తర్వాత ప్రభుత్వ పథకాలతో పాటు ప్రతి పేదింటి బిడ్డ భవిష్యత్ బాధ్యత తీసుకుంటారని ఆమె హమీ ఇచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ మూడోసారి రావడం ఖాయమని, మంథనిలో సైతం కారు గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డగా పుట్ట మధూకర్‌ను ఆదరించి ఆశీర్వదించాలని ఆమె కోరారు.