Tuesday, October 8, 2024
Homeతెలంగాణమీ ఇంటి బిడ్డగా ఆదరించి ఆశీర్వదిస్తే సేవకుడిగా పని చేస్తా

మీ ఇంటి బిడ్డగా ఆదరించి ఆశీర్వదిస్తే సేవకుడిగా పని చేస్తా

మీ ఇంటి బిడ్డగా ఆదరించి ఆశీర్వదిస్తే సేవకుడిగా పని చేస్తా

బీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌

మంథని,నవంబర్15(కలం శ్రీ న్యూస్):నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి ఆదరిస్తే అభివృధ్దితో పాటు అనేక సేవలు చేశానని, మరోమారు అవకాశంకల్పిస్తే మీ బిడ్డల భవిష్యత్‌ బాధ్యత నేనే తీసుకుంటానని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టమధూకర్‌ హమీ ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మల్హర్‌ మండలం దబ్బగట్టు ,మల్లారం, చిన్నతూండ్ల, శాత్రాజుపల్లి, అడువాలపల్లి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రచారం చేపట్టిన ఆయన గ్రామప్రజలు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు మంగళహరతులతో నీరాజనాలు పలికారు. ఈసందర్బంగా ఆయన ఇంటింటికి వెళ్లి తన సేవలు, చేసిన అభివృధ్దిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి ఏడాది పేదింటి ఆడబిడ్డలకుపెండ్లి చేస్తానని, ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌లో ఉండే పేద విద్యార్ధులకు హస్టల్‌ వసతి కల్పిస్తానని ఆయన తెలిపారు. అంతేకుండా గతంలో కాంగ్రెస్‌ పాలకులు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో బిల్లులు మాయం చేసి మన సొంతింటి కలను విచ్చిన్నం చేశారని, కానీ ఈసారి గృహలక్ష్మి పథకం ద్వారా ఇళ్లు మంజూరీ చేయించి మూడు లక్షలతో పాటు తాను కొంత సాయం చేసి గొప్పగా ఇంటి నిర్మాణం చేయిస్తానని ఆయన హమీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలతో పాటు తాను సొంతంగా సేవా కార్యక్రమాలను చేస్తానన్నారు. అనేక ఏండ్లు అదికారంలో ఉండి గొప్ప గొప్ప పదవులు పొందినా తట్టెడు మట్టిపోయని కాంగ్రెస్సోళ్లు ఈనాడు ఓట్ల కోసం మళ్లా మన ఊర్లకు వస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తాను ఇన్నిసేవలు, అభివృధ్ది చేసినా అబద్దాలు, అసత్యప్రచారాలు చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని, ఈ ప్రాంత ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఐదేండ్లు మా ప్రభుత్వం లేదన్నరే కానీ ఏ ఆడబిడ్డ పెండ్లికి సాయం చేశారా అని ఆయన అన్నారు. ఐదేండ్లలో ఏమీ చేయనోళ్లు మళ్లా ఐదేండ్లు ఏం చేస్తరని ఆలోచన చేయాలన్నారు. మళ్లీ ఐదేండ్లు ఇలాగే పాలిస్తారే తప్ప వాళ్లు ఏమీ చేయరన్నారు. మంథని నియోజకవర్గంలో ఎవరు రాజకీయంగా ఎదిగినా ఆ కుటుంబం కుట్రలు చేస్తుందని, ఈ ప్రాంతానికి చెందిన వెలమలు, రెడ్డిలను రాజకీయంగా అణిచివేసిన చరిత్ర వాళ్లదేనన్నారు. ఓ బీసీబిడ్డగా తాను ఈ స్థాయికి ఎదిగితే అనేక కుట్రలు, అబద్దాలు, అసత్య ప్రచారాలతో రాజకీయ సమాధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నా మల్హర్‌ మండలానికి ప్రభుత్వ కార్యాలయాలను తీసుకురాకుండా మండల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన విషయాన్నిమర్చిపోతారా అని ఆయన అన్నారు. ఈ ప్రాంత మట్టిలో మాణిక్యంలా ఒక మెరుపులా ప్రజల మనిషిగా, ప్రజల మనస్సును దోచుకున్న నాయకుడు మల్హర్‌రావు అని, ఆయన హయాంలోనే మల్హర్‌ మండలం అభివృధ్ది చెందిందే కానీ అటు తర్వాత ఒక్క అడుగు ముందు సాగలేదన్నారు. కీ.శే మల్హర్‌ రావు పేరును ఈ మండలానికి పెట్టడాన్ని కాంగ్రెస్సోళ్లు జీర్ణించుకోలేక కళ్లలో కారం పోసుకున్నారని అన్నారు. మల్హర్‌ రావు తర్వత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే అభివృధ్దికి బాటలు పడ్డాయని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి విషయాలపై చర్చించుకోవాల్సిన మండల ప్రజలు అక్కరకు రాని విషయాలను చర్చిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా చేసిన అభివృధ్ది, సేవలు మీ కళ్ల ముందే కన్పిస్తున్నాయని, ఆనాడుఈనాడు తాను మీ ఇంటి ముందే తిరుగుతున్నానని, అదికారం పదవులు వచ్చాక మకాం ఎక్కడికి మార్చలేదన్నారు. 50ఏండ్లుగా ఒకే కుటుంబానికి మనం ఓట్లు వేస్తున్నా వాళ్లు మనకు ఏం చేశారని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని, కనీసం మండలానికి ఒక్క రోడ్డు సౌకర్యం కల్పించారా అని ఆయన అన్నారు. మనం వేసే ఓటు మన కనీస అవసరాలు తీర్చే విధంగా ఉండాలే కానీ ఎవరికో అదికారం ఇవ్వడానికి ఉండకూడదన్నారు. ఇన్నాళ్లు మనకు ఓటు విలువ తెలియని,ఓటు వేసే ముందు ఆలోచన చేస్తలేమని కాంగ్రెస్సోళ్లు అనుకుంటున్నారని, అలాంటి పరిస్థితులు రాకూడదని, ప్రతి ఒక్కరు చైతన్యవంతులై ఆలోచనతో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు మా దగ్గరు ఏమీ లేవన్నోళ్లు ఎన్నికలు వచ్చాయని ఓట్ల కోసం గడియారాలు ఇస్తున్నారని, రేపు చీరలు, పైసలు కూడా ఇస్తారని ఆయన అన్నారు. ఓట్ల కోసం నోట్లకట్టలతో వస్తున్న వాళ్ల గురించి ఆలోచన చేయాలని ఆయన అన్నారు. ఒక రైతు బాగుంటేనే సబ్బండ వర్గాలు బాగుపడుతాయని సీఎం కేసీఆర్‌ గొప్పగా ఆలోచన చేసి రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని, ఇందులో 24గంటల కరెంటు, రైతుబందులాంటి పథకాలపై కాంగ్రెస్సోళ్లు మాట్లాడుతున్నతీరును ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలన్నారు. 24గంటల కరెంటు అవసరంలేదని, రైతుబందు దుబారా ఖర్చు అంటున్నారని ఆయన గుర్తు చేశారు. 24గంటల కరెంటు అవసరం లేదని మూడు గంటలు మాత్రమే చాలని, ప్రతి రైతు 10హెచ్‌పీ మోటారు పెట్టుకుంటే గంటకు ఎకరం నీళ్లు పారుతాయని లెక్కలు చెబుతున్నారని, ఈ ప్రాంతంలో ఏరైతైనా 10హెచ్‌పీ మోటారు వాడుతున్నాడా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి లెక్కలతో కాంగ్రెస్సోళ్లు మోసం చేస్తారని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా ఆరు గ్యారెంటీలేని పథకాలను ముందుకు తీసుకువస్తున్నారని, ఆనాడు పదేండ్లు అదికారంలో ఉండి రూపాయి పించన్‌ పెంచనోళ్లు ఆరు పథకాలు ఎలా అమలు చేస్తారన్నారు. కాంగ్రెస్పోళ్లు ఏ పథకం అమలు చేయాలన్నా ఢిల్లీకిపోయి బాస్‌లతో ఆలోచనలు చేస్తారని, కానీ బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలే బాస్‌లని, ప్రజల అవసరాలను గుర్తించే పథకాలు అమలు చేస్తామన్నారు. 24గంటల కరెంటు కావాలో కాంగ్రెస్సోళ్ల మూడు గంటల కరెంటు కావాలో రైతులు ఆలోచన చేయాలన్నారు. మీ బిడ్డగా ఆదరించి ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా కాకుండా మీ సేవకుడిగా ఐదేండ్లు సేవ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!