కౌలు రైతు దంపతుల ఆత్మహత్య
కాలేశ్వరం ప్రాజెక్ట్ పంట ముంపుకు గురై కౌలు రైతు దంపతుల ఆత్మహత్య
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని,అక్టోబర్ 10 (కలం శ్రీ న్యూస్ ): కాలేశ్వరం ప్రాజెక్టు అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్ ముంపు ఓ యువ కౌలు రైతు దంపతుల నిండు ప్రాణాలను బలిగొన్న సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో చోటు చేసుకుంది. గత కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు, వరదల సమయంలో గోదావరి ముంపుకు గురై కౌలుకు తీసుకొని సాగు చేసిన రెండు ఎకరాల పత్తి పంట, మూడు ఎకరాల వరి పంట నష్టపోవడంతో మనస్థాపానికి గురైన మంథని మండలం ఎగ్లాస్ పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నెల్లిపెల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు దంపతులు కటుకు అశోక్- సంగీత యువ దంపతులు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి ఐదు సంవత్సరాల కుమారుడు ( సాయి), నాలుగు సంవత్సరాల కుమార్తె (సనా) ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మంథని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.