ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృధ్ది చేసి చూపిస్తా
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 24 (కలం శ్రీ న్యూస్):ఏ సమస్య చెప్పినా మా ప్రభుత్వం అధికారంలో లేదని చెప్పటోళ్లకు ఓటు వేసుడెందుకని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ప్రశ్నించారు. ఆదివారం మంథని మండలం గోపాల్‌పూర్ గ్రామంలో పలు పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మా ప్రభుత్వం లేదని చెప్తున్న ఎమ్మెల్యేకు మళ్లీ ఓట్లు వేస్తే మా ప్రభుత్వం లేదనే చెబుతాడని ఆయన వివరించారు. 40ఏండ్లు అధికారంలో ఉండి ఏమీ చేయనోళ్లు ఇప్పుడు ఏం చేస్తరో ఆలోచన చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వృద్దులకు రూ.200 పించన్ ఇచ్చిందని, పదేళ్ల పాటు అదే పించన్ ఇచ్చారే తప్ప ఒక్క రూపాయి పెంచలేదని ఆయన విమర్శించారు.ఈనాడు ఓట్ల కోసం కుర్చీ కోసం పించన్ పెంచుతామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల్లో ప్రశ్నించాలనే ఆలోచన రావాలని, అలా వచ్చినప్పుడే మనం బాగుపడుతామని,ఇటీవలి కాలంలో మంథని మండలం నాగెపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు ఎస్సీ బిడ్డలు ఎమ్మెల్యేను నిలదీశారని, మా ప్రభుత్వం లేదని చెప్పితే మేము మీకు మాత్రమే ఓటు వేస్తాం కానీ రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యేకు ఓటు వేయలేం కదా అంటూ నిలదీశారని, అలా నిలదీసినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వస్తుందని చెప్పారు. ఈనాడు ప్రభుత్వం ప్రతి దళితబిడ్డ భవిష్యత్ గురించి ఆలోచన చేసి దళితబంధును అందిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు లేనిపోని రాద్దాంతాలు చేస్తున్నారని, దళితబంధు ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారని బదనాం చేస్తున్నారని అన్నారు. ఆనాడు దళితులకు లక్ష రూపాయల లోన్ ఇవ్వడానికి నానా షరతులు పెట్టి చెప్పులు అరిగిపోయేలా తిప్పుకున్నారే తప్ప లోన్ మాత్రం ఇవ్వలేదని,ఈనాడు ఎలాంటి షరతులు లేకుండా పది లక్షలు ఇస్తుంటే బీఆర్‌ఎస్ పార్టీలోచేరి మద్దతు తెలుపడంలో తప్పేంటని ప్రశ్నించారు. దేశంలో రాష్ట్రంలో అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏనాడు మన గురించి ఆలోచన చేయలేదని, మంథనిలో సైతం 40ఏండ్లు ఒకే కుటుంబానికి అధికారం ఇస్తే మన ఆకలి తీర్చాలని ఆలోచన చేయలేదన్నారు. గత ఏడాది బారీ వర్షాలతో వరదలు వస్తే పడవలు, ట్రాక్టర్‌లలో తిరిగేటోళ్ల మన కోసం ఏం చేస్తారో ఆలోచన చేయాలన్నారు, ఒక ఎమ్మెల్యే తలచుకుంటే ఏదైనా చేయవచ్చని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, ఎమ్మెల్యే అధికారంలో ఉంటే అభివృధ్ది చేయవచ్చని, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల కోసం పోరాటం చేయవచ్చన్నారు. ప్రతిపక్షంలో ఉన్న మంథని ఎమ్మెల్యే ఏనాడైనా గోపాల్‌పూర్ రోడ్డు గురించి ధర్నా చేశాడా, వరదలో నష్టపోయిన రైతుల కోసం ఆందోళన చేశాడా అని ఆయన ప్రశ్నించాడు. కాంగ్రెస్ నాయకులు మాత్రం మా నాయకుడు అసెంబ్లీలో గళం విప్పుతాడని,ఫోన్‌లలో మాట్లాడుతాడని గొప్పలు చెప్పుకుంటున్నారని, అసెంబ్లీలో గళం విప్పితే, ఫోన్‌లలో మాట్లాడితే పనులు ఎందుకు కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల కోసం తన సిద్దాంతాలు, వ్యక్తిత్వాన్ని పక్కకు పెట్టిన గొప్ప నాయకులు స్వర్గీయ మేడ రాజయ్య అని కొనియాడారు. 20ఏండ్లు సర్పంచ్‌గా కొనసాగిన ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటే పనులు కావడంలేదని, ఈ గ్రామాలకు కనీసం రోడ్లు సౌకర్యాలు లేవని కాంగ్రెస్‌లో చేరితే రోడ్లయినా వస్తాయని కాంగ్రెస్ పార్టీలోకి చేరారని అన్నారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మేడ రాజయ్య తనను కలిసారని, తాను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పితే నీవు గెలిచావు కానీ నేను నీకు ఓటు వేయలేదని నిక్కచ్చిగా చెప్పారని, నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మేడ రాజయ్య అని అన్నారు. మేడ రాజయ్య ఆశయాలకు అనుగుణంగా తాను గ్రామాల్లోని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, పూర్తిస్థాయిలో రహదారులను నిర్మించి తీరుతానని ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృధ్ది పనులు చేస్తానని ఆయన హమీ ఇచ్చారు.