కనుమరుగవుతున్న కుల వృత్తులు
పెద్దపల్లి,సెప్టెంబర్04(కలం శ్రీ న్యూస్):పెరిగిపోతున్న ప్లాస్టిక్ వాడకం కుల వృత్తుల జీవితాలను స్థితి గతులను మార్చేసింది. కులవృత్తి మరువకురా గువ్వలచెన్న అన్న నానుడి ను అనుసరించి మూడు నాలుగు దశాబ్దాల క్రితం గ్రామాల్లో ప్రతి ఒక్కరూ తాత తండ్రుల నుండి వస్తున్న కులవృత్తిని నేర్చుకొని బతుకు బాట పట్టేవారు. గ్రామాల్లో రైతులు యాసంగి వానాకాలం వడ్ల గింజలు ఇచ్చి మంగలి కి క్షవరం, చెప్పులు కుట్టే వారికి చెప్పులు కుట్టించుకుని, చాకలి వద్ద బట్టలు ఉతికించుకోవడం, అరక ఎడ్లబండ్లు వ్యవసాయ పనిముట్లు చేయించుకొని వడ్రంగి మేర మాదిరిగా ఇచ్చేవారు. ఆ రోజుల్లో అన్ని కులవృత్తులు కళకళలాడేది. వస్తు మార్పిడి పద్ధతి కొనసాగేవది. కాగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం కులవృత్తులను దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో చెప్పులు కుట్టేవారు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇదే సందర్భంలో పట్టణాలలో బస్టాండ్ వద్ద, రైల్వేస్టేషన్ల వద్ద, పలు కూడళ్లలో బూట్లు పాలిష్ చేయడం, చెప్పులు కుట్టడం వృత్తిని నమ్ముకొని చాలామంది జీవించేవారు.
సినిమాల్లో సైతం బూట్లు పాలిష్ చేసుకుంటూ కనబడే దృశ్యాలు ఉండేవి. కాగా ప్లాస్టిక్ చెప్పుల రాకతో ఈ కుల వృత్తి పూర్తిగా దెబ్బతిన్నది. తోలు చెప్పులు ఉన్నంతకాలం వృత్తిని నమ్ముకున్నవారు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేవారు. తోలుతో చెప్పులు కుట్టడం, తెగిన చెప్పులకు మరమ్మతులు చేయడం, పాలిష్ చేయడం వంటి పనులు చేసి రోజుకు కూలి మందం సంపాదించుకొని జీవనం గడిపేవారు. పట్టణాల్లో ఏ సెంటర్ లో చూసిన చెప్పులు కుట్టే వారు కనిపించేవారు. కాగా ప్లాస్టిక్ చెప్పులు కారు చౌకగా లభించడం తో తోలు చెప్పులను వాడకపోవడంతో కుల వృత్తి పూర్తిగా దెబ్బతిన్నది. చెప్పులు తెగితే గతంలో కుట్టించుకోని తోడిగేవారు. కాలం మారి ఫ్యాషన్ పెరిగి చెప్పులు తెగితే పార వేస్తున్నారు. తిరిగి కొత్త చెప్పులు కొంటున్నారు తప్ప తెగిన చెప్పులను పట్టించుకునే నాథుడు కరువయ్యారు. దీంతో వృత్తిని నమ్ముకున్న వారు వృత్తిని వదిలేసి కూలీలుగా మారిపోతున్నారు. అక్కడ ఎక్కడో పాతతరం వారు తప్ప కొత్త తరం వారు చెప్పులు కుట్టే వృత్తిలో ఒక్కరు కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. చెప్పుల తయారీ లో కార్పొరేటర్ రంగం ఆధిపత్యం వహించడం తో పట్టణాల్లో షోరూములు పెరగడం వలన తోలుతో చెప్పులు కుట్టేవారు వారితో పోటీని తట్టుకోలేక కనుమరుగైపోయారు.
ఆరోగ్యానికి హానికరం కలిగించే ప్లాస్టిక్ చూడడానికి రంగురంగుల్లో ఆకర్షణీయంగా ఉండటంతో యువత వాటిపై మోజు పెంచుకుంటున్నారు. పైగా తెగిపోకుండా ఎక్కువకాలం రావడం చౌకగా ఉండడంతో కృత్రిమంగా తయారుచేసే చెప్పులకు గిరాకీ లేకుండా పోయింది. గతంలో ఒక చెప్పు తెగితే కుట్టించుకునేవారు. ప్రస్తుతం మంచిగా ఉన్న చెప్పును కూడా పారవేసి కొత్త చెప్పులు కొనుకుంటున్న వైనం కనిపిస్తుంది. ఈ కథనం వినడానికి ఏదోలా అనిపించిన వాస్తవం మాత్రం ఎంతో దాగి ఉంది. ఒక చెప్పులు కుట్టే వ్యక్తిని మా కలం శ్రీ న్యూస్ ప్రతినిధి కదిలించగా వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న తమకు బతుకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో గతంలో సుమారు 30 మంది వరకు చెప్పులు కుట్టే వారు ఉంటే ప్రస్తుతం నలుగురు ఐదుగురు మాత్రమే ఈ వృత్తి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పాదాలకు రక్షణ ఇచ్చే ఈ పాదరక్షకాలు తమ బతుకు రక్షణకు దోహద పడటంలేదని కన్నీరు మున్నీరు అయ్యాడు. పాలకవర్గాలు కుల వృత్తిని నమ్ముకున్న తమలాంటి వారికి ప్రోత్సహించాలని, చిన్న తరహా కుటీర పరిశ్రమలుగా పెట్టుకోవడానికి రుణాలు అందజేయాలని వేడుకుంటున్నారు.