లోక్ అదాలత్ లను సద్వినియోగ పరుచుకోవాలి–జడ్జి ప్రియాంక
సుల్తానాబాద్,ఆగస్టు31(కలం శ్రీ న్యూస్):కక్షి దారులు లోక్ అదాలత్ లను సద్వినియోగ పరుచుకోవాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి జిఎస్ఎల్ ప్రియాంక అన్నారు. సెప్టెంబర్ 9న నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్ కు సంబంధించి గురువారం స్థానిక కోర్టు హాల్ లో న్యాయవాదులతో జడ్జి ప్రియాంక సమీక్షా సమావేశం నిర్వహించారు. లోక అదాలత్ లో పరిష్కరించబడే పలు సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసుల గురించి పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్జి ప్రియాంక మాట్లాడుతూ సెప్టెంబర్ 9న సుల్తానాబాద్ కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ నిర్వహించబదుతుందని, ఇరువర్గాల అంగీకారంతో రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఇరువర్గాల కక్షిదారులు సామరస్యంగా రాజీ చేసుకునేందుకు లోక్ అదాలత్ లు ఎంతగానో ఉపయోగపడతాయని, కక్షిదారులు ఇట్టి లోక్ అదాలత్ ను సద్వినియోగ పర్చుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భూసారపు బాలకిషన్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పెగడ శ్యాం సుందర్ తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.