Saturday, July 27, 2024
Homeతెలంగాణబుల్లెట్‌ కంటే బ్యాలేట్‌ బలమైందని నిరూపించుకోవాలి

బుల్లెట్‌ కంటే బ్యాలేట్‌ బలమైందని నిరూపించుకోవాలి

బుల్లెట్‌ కంటే బ్యాలేట్‌ బలమైందని నిరూపించుకోవాలి

5కే రన్‌ లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని, ఆగస్టు 19 (కలం శ్రీ న్యూస్ ):స్వాతంత్య్రం వచ్చి 76ఏండ్లు గడుస్తున్నాఇంకా ఓటు వేయాలని,ఓటు హక్కు వినియోగించుకోవాలని,ఓటు నమోదుచేసుకోవాలని చెప్పడం బాధాకరమని, ఓటు విలువ తెలుసుకోకపోతే అనర్థాలు తప్పవని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు ఐ ఓట్‌ ఫర్‌ షూర్‌ అనే నినాదంతో చేపట్టిన కార్యక్రమంలో బాగంగా శనివారం మంథనిలో చేపట్టిన 5కే రన్‌ను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ,ఆర్డీఓ హనుమ నాయక్‌తో కలిసి ప్రారంభించారు.మంథని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన 5కేరన్‌ అంబేద్కర్‌ చౌక్‌,చాకలిఐలమ్మ చౌక్‌,పాత పెట్రోల్‌బంక్‌ వరకు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ చౌక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ సమాజంలో చదువుకున్న మేధావులు ఓటు విలువను అర్థం చేసుకోవడం లేదని,చదువురాని తల్లి, చదువుకోని తండ్రి గొప్పగా ఆలోచనలు చేస్తున్నారని, ఓటు వేయకపోతే భూమి మీద ఉన్నట్లే కాదని, ఖచ్చితంగా ఓటు వేయాలని ఎన్నికల సమయంలో బూతు తెరువకముందే లైన్‌లో నిల్చుంటున్నారని ఆయన అన్నారు. కానీ చదువుకున్న వారు ఓటు హక్కును వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలోని ఏ వర్గమైనా సురక్షితంగా, సంతోషంగా జీవించాలంటే మంచి ప్రజాప్రతినిధి ఉండాలని, ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాలను అనుసరించి శాసనాలు తయారు చేసి ప్రజలకు అందించే వాడే నిజమైన ప్రజాప్రతినిధి అని ఆయన వివరించారు.ప్రజాప్రతినిధిగా ఎన్నికైన నాయకుడు గొప్పగా ఆలోచన చేసి ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకపోతే ఆ సమాజం వెనుకబడి పోతుందన్నారు. ఏదో రెండు సార్లు ఓడిపోయాడని అమాయకత్వంతో ఓటు వేసి గెలిపించి ఆ తర్వాత బాధపడవద్దని,ముందుగానే ఆలోచన చేయాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు.సమాజం బాగుండాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలని ఆయన స్పష్టం చేశారు. ఈనాడు మనలో కొందరు కూలీ పని, మరికొందరు ఉద్యోగం కోసం ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తామని,ఈ క్రమంలో మనకు సౌకర్యాలు, వసతులు కల్పించి, మన కోసం మన కష్టాలు తీర్చడం కోసం ఆలోచన చేసే నాయకుడిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలని ఆయన సూచించారు. నాయకుడు, ప్రజాప్రతినిధి ఆకాశంలో నుంచి ఊడిపడడని, మనమే నాయకుడిని, ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటామని ఆయన తెలిపారు. ఈనాడు ఢిల్లీలో కూర్చున్న ఎన్నికల కమీషన్‌ గల్లీల్లో ఓటు నమోదు చేసుకోవాలని, ఓటుహక్కును సక్రమంగా వినియోగించుకోవాలని ఇంకా ప్రచారం చేయడానికి గల కారణాలపై ఆలోచన చేయాలన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ప్రజాప్రతినిధికి ఎంత బాధ్యత ఉందో ప్రజలకు అంత బాధ్యత ఉంటుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. బుల్లెట్‌ కంటే బ్యాలెట్‌ బలమైందని చెబుతున్న క్రమంలో ఆ నినాదాన్ని నిరూపించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆనాడు అట్టడుగు వర్గాలకు ఓటు అవసరం లేదన్న సందర్బంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గొప్పగా ఆలోచన చేసి సంపన్నుడైనా, పందులు కాసేవాడికైనా సమానంగా ఓటు హక్కు ఉండాలని పోరాడి మనకు ఓటు అనే ఆయుధాన్ని అందించారని ఆయన గుర్తు చేశారు. ఆనాడు అంబేద్కర్‌ ముందుచూపుతో ఆలోచించినట్లుగానే ప్రతి ఒక్కరు మంచి సమాజం కోసం ఆలోచన చేసి ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!