సర్థార్ సర్వాయి పాపన్న వారసులుగా గొప్పగా ఆలోచించాలి
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని, ఆగస్టు 18 (కలం శ్రీ న్యూస్ ):మహనీయుల చరిత్ర తెలుసుకుని చెప్పకపోతే ఎంత ప్రమాదమో గ్రహించే భవిష్యత్ తరాలు బాధపడకూడదని ఆలోచన చేస్తున్నామని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ ఫుట్ట మధూకర్ అన్నారు. శుక్రవారం మంథని పట్టణంలో గీతాపారిశ్రామిక సహకార సంఘం మంథని వారి ఆధ్వర్యంలో సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని సర్వాయి పాపన్న విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముందుగా రాజగృహ నుంచి అంబేద్కర్ చౌక్ మీదుగా భూపాలపల్లి జెడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌తో కలిసి ప్రదర్శనగా వచ్చిన ఆయన శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనం మహనీయుల చరిత్ర తెలుసుకుని స్మరించుకుంటుంటే కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది బానిసలుగా మారి కాళ్లు మొక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పైసల కోసం పదవుల కోసం బానిసలుగా ఉంటే భవిష్యత్ ఉండదని ఆలోచన చేయడం లేదని ఆయన అన్నారు. ఆనాడు కల్లు శిస్తు చెల్లించమని సర్థార్ సర్వాయి పాపన్న అప్పటి పాలకులపై తిరుగుబాటు చేసి గోల్కొండ ఖిల్లాను ఏలారని ఆయన గుర్తు చేశారు.బానిసలు ఉండటం కంటే భవిష్యత్ కోసం పోరాటం చేయాలని ఆనాడు ఆలోచన చేసిన సర్థార్ సర్వాయిపాపన్న వారసులుగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు. సర్థార్ సర్వాయి పాపన్నను చూడకపోయినా, ఆయన గురించి వినకపోయినా ఆయన వారసులతో కలిసి పని చేశానని, ఆనాడు సారా మామూలు పట్టాలంటే ఉన్నోళ్లకే సాధ్యమయ్యేదని, కానీ మంథనికి చెందిన కొందరు గౌడ్‌లు తామేమి తక్కువ కాదని సారామమూలు పట్టి తమ కులం గొప్పతనాన్ని చాటారని ఆయన గుర్తు చేశారు. అంత పెద్ద ఆలోచన ఉన్న గౌడ సామాజికవర్గంలోని మహాళలు ఈనాడు కూలీ పనికి వెళ్తున్నారంటే అందుకు ప్రస్తుత ఎమ్మెల్యే కారణం కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నసమయంలో గౌడలపై కేసులు పెడ్తే కనీస సాయం చేయకపోవడంతో భూములు అమ్ముకుని కేసుల నుంచి బయటపడ్డారని అలాంటి పరిస్థితులను ప్రతి గౌడ గుర్తు చేసుకోవాలన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం గౌడలకు ఎలాంటి సాయం చేయలేదని, వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. ఈనాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పన్నులు రద్దు చేశారని, ఎక్స్‌గ్రేషియా, పించన్‌లు, వైన్‌షాప్‌ల్లో రిజర్వేషన్ లాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఆనాడు కులవృత్తులను నిర్వీర్యంచేసే విధంగా కాంగ్రస్ ప్రభుత్వం కల్లు మండువాలను తీసేసిందని, అదే బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నీరా కేఫ్‌లను ఏర్పాటు చేస్తూ గౌడ కులవృత్తిని ప్రోత్సహిస్తోందన్నారు. తాను కాపు కులానికి చెందిన తాను కల్లు తాగి ప్రోత్సహించానని,అదే మంథని ఎమ్మెల్యే చేస్తాడా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నో ఏండ్ల క్రితమే మహనీయులు ముందుచూపుతో ఎన్నో త్యాగాలు చేశారని, అవమానాలు ఎదుర్కొంటున్నామని ఆగిపోతే ఈనాడు మనం ఇలా ఉండేవాళ్లమా అని అన్నారు. మన చదువుల కోసం జ్యోతిబాపూలే, సావిత్రీబాయి పూలే అనేక అవమానాలు ఎదుర్కొన్నారని, తమజీవితాలను త్యాగం చేశారన్నారు. అలాగే ఓటు హక్కు కల్పించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన పిల్లలు చావుబతుకుల్లో ఉన్నా ఆగిపోలేదని ఆయన వారి త్యాగాలను కొనియాడారు. అలాంటి మహనీయుల స్పూర్తితోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని ఆయన అన్నారు. చరిత్ర లేని వాళ్ల విగ్రహాలు పెట్టి మహనీయుల చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం చేసిన గత పాలకుల తీరును అర్థం చేసుకోవాలన్నారు. మనం గొప్పగా ఆలోచన చేయకపోవడం మూలంగానే అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని, అబద్దాలతో అధికారం కోసం చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారన్నారు. ప్రజలంతా అమాయకులని ఏమి చెప్పితే అదే నమ్ముతారనే బావన వారిలో ఉందని, నిలదీస్తామనే భయం లేకనే మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని ఆయన అన్నారు. నాగేపల్లి గ్రామానికి చెందిన ఎస్సీబిడ్డల స్పూర్తితో ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని, మా ప్రభుత్వంలేదని ఎమ్మెల్యే అంటే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమయ్యే ఎమ్మెల్యేలకు ఓటు వేసే హక్కు మాకు లేదు కదా అంటూ నిలదీసే ఆలోచన రావడం గొప్ప విషయమని అలాంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. అహంకారంతో విర్రవీగేవాళ్లకు ఓటుతోనే జ్ఞానోదయం కల్పించాలని బాధ్యత మన అందరిపై ఉందన్నారు. మహనీయుల చరిత్రను తెలుసుకుని చైతన్యం దిశగా అడుగులు వేస్తుంటే ఈనాడు పాడేలు మోయటానికి వస్తాండ్లని, పల్లెనిద్రల పేరుతో ఊర్లకు వస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సర్థార్ సర్వాయిపాపన్న వారసులుగా ప్రతి ఒక్కరు తాటిపైకి రావాలని,ఆయన స్పూర్తితో ముందుకు సాగాలన్నారు. తాను పదవులు ఇచ్చిన వాళ్లు ఈనాడు కాంగ్రెస్‌లో చేరి ఆడిపోసుకుంటున్నారని, తనపై బురదజల్లె ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారు కాంగ్రెస్ పార్టీలో అవమానాలకు గురవుతున్నారని, రోడ్డుపై పడకూడదని ఆలోచన చేస్తున్నానని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాల కోసమే ఆలోచన చేస్తున్నానని, ప్రజలు సైతం గొప్పగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.