దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని కలిసి వినతి పత్రం అందజేసిన గ్రామ పంచాయతీ కార్మికులు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 22 (కలం శ్రీ న్యూస్ ):పంచాయతీ సిబ్బందినందరిని పర్మినెంట్ చేయాలి పిఆర్సి లో నిర్ణయించిన మినిమమ్ బెసిక్ను వేతనంగా చెల్లించాలి.ఆలోపు జీవో నెం.60 ప్రకారం స్వీపర్లకు రూ.15,600/-లు కారోబార్,బిల్ కలెక్టర్లకు రూ.19500/లు కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.22750/-లు నిర్ణయించాలి.గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటును కేటాయించాలి.ఆ గ్రాంట్ నుండే వేతనాలను చెల్లించాలి.2011 జనాభా ప్రాతిపదికన కాకుండా అవసర ప్రాతిపదికన కార్మికుల్ని పరిగణించాలి.ప్రస్తుతం పని చేస్తున్న వారందరికీ వేతనాలు పెంచాలి.వివిధ పంచాయతీలలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అదనంగా నియమించిన కార్మికులందరికీ వేతనాలు నిర్ణయించాలి.ఉద్యోగ భద్రత కల్పించాలి.జీవో నెంబర్ 51 ని సవరించాలి.మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి.వివిధ కేటగిరీలన్నింటినీ యధావిధిగా కొనసాగించాలి.కారోబార్ బిల్ కలెక్టర్ లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలి.వారికి పంచాయతీ అసిస్టెంట్ గా నామకరణం చేయాలి.రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన ఎస్క్రీడే పేరిట 2లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకాన్ని 5 లక్షలకు పెంచాలి.వయస్సు మీరిందనే సాకుతో కార్మికులను మార్చితే ఆ కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్గా రూ.5 లక్షలు ఇవ్వాలి.విధి నిర్వహణ ప్రమాదాల్లో మరణించిన సిబ్బంది కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వమే ఇవ్వాలి.ప్రమాదంలో మరణించిన కార్మికుని దహన సంస్కారాలకు 30 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించాలి. సంవత్సరానికి మూడు జతల యూనిఫామ్, సరిపడా చెప్పులు సబ్బులు నూనెలు ఇవ్వాలి.వాటిని నగదు రూపంలో అలవెన్స్ చెల్లించాలి.సిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. 8 గంటల పని దినాన్ని అమలు చేయాలి.ఆదివారం, పండుగ సెలవులు,జాతీయ, అంతర్జాతీయ సెలవు దినాలను అమలు చేయాలి. కార్మికులపై రాజకీయ నాయకుల వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలి. కార్మికులకు సంబంధించిన అంశాలలో ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల జోక్యాన్ని అరికట్టాలి.అలా జోక్యం చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మంథని మండలం అన్ని గ్రామ పంచాయతీల సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.