దొడ్డి కొమురయ్య లేకపోతే ఈనాడు తెలంగాణ ఉండేది కాదు
పోరాట వారసత్వంతోనే తెలంగాణ సాధించుకున్నం
విగ్రహ విష్కరణలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 4(కలం శ్రీ న్యూస్):
ఇన్నేండ్ల చరిత్రలో ఏనాడు ఎక్కడా మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎవరికి రాలేదని,మంథనిలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌కు ఆలోచన రావడం చాలా గొప్పదని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.మంథని పట్టణంలోని బొక్కలవాగు రెండో వంతెనపై పుట్ట లింగమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాటయోధుడు,తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్‌నేత, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌లోకి సాధువులు,సన్యాసులు,నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను తయారు చేసిన మనువు విగ్రహాన్నిపెట్టి పార్లమెంట్ ఓపెన్‌చేశారని ఆయన వివరించారు. వైవిద్యంగా కాలాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కేంద్రంలోని ప్రభుత్వంతో పాటు కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడ మాత్రం మహనీయుల చరిత్రను చాటిచెప్పాలని,భవిష్యత్ తరాలకు బంగారుబాటలు వేయాలని ఆలోచనతో మహనీయుల విగ్రహనీయుల విగ్రహాలు పెడుతూ బహుజన రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని,ఇదే రేపటి వాస్తవమని ఆయన తెలిపారు. మంథని లాంటి ప్రాంతంలో ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రవేశపెట్టాలని,విగ్రహాల ఏర్పాటుతో స్పూర్తి వస్తుందని, భవిష్యత్ నిస్తాయని, చూపుడువేలుతో దొడ్డి కొమురయ్య,చాకలి ఐలమ్మ విగ్రహాలు దారిచూపిస్తాయని ఆయన అన్నారు.మంథనిలాంటి బ్రాహ్మణులు ఉండే ఈ ప్రాంతంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, బీపీ మండల్ కొమురంభీం విగ్రమాలను నిలబెట్టడం చరిత్రగా బావిస్తున్నట్లు ఆయన అన్నారు. ఇన్ని రోజులు ఏ కులాలైతే అణిచివేతకు గురయ్యాయో ఆ అట్టడుగువర్గాలు లేచి నిలబడకపోతే భవిష్యత్ ఉండదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.అట్టడుగు వర్గాలకు మార్గదర్శకులుగా నిలిచిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి చెప్పలేదని,చూపించలేదని, ఆయన చరిత్రను మూసిపెట్టిండ్లని ఆయన తెలిపారు. ప్రపంచ మేధావుల్లో అంబేద్కర్ నంబర్‌వన్ అని సమాజం చెప్తున్నా ఆయన చరిత్రను తెలియకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.బిన్నమతాలు,బిన్న బాషలు,బిన్నమైన సంస్కృతి ఉన్న భారత దేశంలో మనువు ఒక నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను తయారు చేసిందని,పుట్టుకతోనే మనం అంటరానీవాళ్లమని, వాళ్లతో కలిసి బోజనం చేయలేని వాళ్లమని,ఇండ్లలోకి పోలేని వాళ్లమనే బతుకులు మనువు నిర్థేశించాడని ఆయన తెలిపారు. స్త్రీలు చదువకూడదని, మాట్లాడ కుండా, బయటకు రాకూడదనే కట్టుబాట్లను పార్లమెంట్ మోస్తున్న సమయంలో మంథని లాంటి సంప్రదాయ బ్రాహ్మణ ప్రాంతంలో మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ సాహసానికి పూనుకోవడం గొప్ప విషయమన్నారు.ఆనాడు సాయుధ పోరాటం చేసిన అమరుడైన దొడ్డి కొమురయ్య లేకపోతే తెలంగాణ లేదన్నారు. తెలంగాణ కోసం సాయుధ పోరాటం తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమ స్వభావం కల ప్రాంతమని,వందేళ్ల ఉద్యమాల్లో తెలంగాణ వికసించిందన్నారు.మలి దశ తెలంగాణ పోరాటంతో తెలంగాణ వచ్చిందే కానీ సమ్మక్క సారక్క నుంచి మొదలుకుంటే మన దగ్గరి పోరాట సంప్రదాయం 50,60ఏండ్ల తర్వాత కూడా పోరాట వారసత్వంతోనే తెలంగాణ సాధించుకున్నామని ఆయన వివరించారు. తెలంగాణ సాయుధ పోరాటం లేకుంటే,తొలి అమరుడు దొడ్డి కొమురయ్య లేకుంటే మనకు పోరాట సంప్రదాయం లేకపోతే మనం లేమన్నారు.ఆనాడు మంథనిలో గుల్కోట శ్రీరాములు లాంటి వాళ్లు స్వాతంత్య్ర సమరంలో, కాంగ్రెస్‌తో కలిసి చేసిన పోరాటంలో,నాగపూర్ క్యాంపులో నిజాం వ్యతిరేక పోరాటాల్లో ఇక్కడ కూడా ఒక పోరాట సంప్రదాయం ఉండేదన్నారు.ఆనాడు పీవీ నర్సింహరావును తెలంగాణ ఏదని నిలదీసిన చరిత్ర మంథనికి ఉందన్నారు.తొలి తెలంగాణ పోరాటంలో మంథని ఉందని, మంథని పోరాటం ఉందన్నారు.వివక్ష ఆదిపత్యం,వలసల మీద ఎక్కుపెట్టిందే మలి తెలంగాణ పోరాటమన్నారు.ప్రపంచ వ్యాప్తంగా సుధీర్షకాలం జరిగిన పోరాటం లేదని,ఒక్క నెత్తుటి చుక్క కిందపడని ఉద్యమం ప్రపంచ చరిత్రలో లేదని,ఉద్యమం శాంతిద్వారా జరిగి విజయవంతం అయింది ఒక్క తెలంగాణ పోరాటమేనని,1200మంది ఆత్మాహుతి చేసుకున్నారే కానీ ఒక్కరిని గాయపర్చని పోరాటం ఇదేనని ఆయన గుర్తు చేశారు. మంథనిలో మహనీయుల విగ్రహాల ఏర్పాటుతో బావితరాలకు చరిత్ర తెలుస్తుందని,వారి పోరాట స్పూర్తితో ముందుకు సాగాలని ఈ సందర్బంగా ఆయన పిలుపునిచ్చారు.చాలా రోజుల తర్వాత తన స్వంత ప్రాంతానికి వచ్చిన తాను విగ్రహాలను చూసి ఎంతో ఆనందపడ్డానని,పుట్ట మధూకర్ లాంటి నాయకుడు మహనీయుల చరిత్ర చాటిచెప్పడం అభినందనీయమని,మంథని ఇతర ప్రాంతాలకు దారి చూపిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
దేశానికి ముందుచూపునిచ్చింది ఎస్సీలు,బీసీలే….
పుట్ట మధూకర్,జిల్లా పరిషత్ చైర్మన్..
పోరాటాలు,త్యాగాలతో దేశానికి ముందుచూపునిచ్చింది ఎస్సీ, బీసీ సామాజికవర్గానికి చెందిన మహనీయులేనని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటయోధుడు,తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌నేతతో కలిసి ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు మనకోసం మన భవిషత్‌తరాల కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్పూర్తిని మర్చిపోవడం మూలంగానే 40ఏండ్లుగా ఇంకా బానిసలుగానే ఉంటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మహనీయుల స్పూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని,అలాంటి మహనీయుల చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత అందిరిపై ఉందన్నారు.ఎంతో మంది మహనీయులు వందేళ్ల క్రితమే మన భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేశారని,కానీ ఈనాడు అధికారం,ఆస్తులు కూడబెట్టుకోవడమే లక్ష్యంగా నాయకులు పనిచేస్తున్నారని, కనీసం ఆకలి తీర్చాలనే ఆలోచన చేయడం లేదన్నారు.ఆనాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన బాబు జగ్జీవన్‌రాం బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినప్పటికి గొప్పగా ఆలోచన చేసి దళితుల కోసం పాటుపడ్డారని,వారికి రైల్వేలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన మహనీయుడని కొనియాడారు. ఆదివాసీ బిడ్డ కొమురంభీం జల్ జంగిల్ జమీన్ నినాదంతో బ్రిటిష్‌వారిపై పోరాటం చేశారని, ఆయన ప్రపంచానికే ఆదర్శమన్నారు.అలాగే మేము పండించిన పంటకు శిస్తు ఎందుకు కట్టాలని చాకలి ఐలమ్మ తిరుగుబాటు చేసిందని,ఆనాటి ఆమె స్పూర్తి దేశానికి వెలుగులు ఇచ్చాయన్నారు.దళితుల కోసం నిరంతరం కృషిచేసిన గుడిసెల వెంకటస్వామి గొప్ప నాయకుడని, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన సింగరేణిలో పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చారన్నారు.బీసీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతో పోరాటం చేసిన బీపీ మండల్‌లాంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకుని వారి చరిత్రను చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు.కులాలు,మతాలు, రాజకీయాలకు అతీతంగానే మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం జరుగుతుందన్నారు.మంథనిలో ప్రోఫెసర్ జయశంకర్‌సార్,కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహాలను త్వరలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు.ఆనాటి నుంచి ఈనాటి వరకు మన కోసం మన భవిషత్ తరాల కోసం పోరాటం చేసి త్యాగాలు చేసిన వారిలో ఎక్కువగా బీసీలు,ఎస్సీలే ఉన్నారని,వారి త్యాగాల ఫలితంగానే ఈనాడు మనం అనేక ఫలాలు అనుభవిస్తున్నామని అన్నారు. 40ఏండ్లు ఈ ప్రాంతంలో అధికారంలో ఉండి ఈ ప్రాంత ప్రజలకు గత పాలకులు ఏమీ చేయలేదని,తన తండ్రి విగ్రహాలు పెట్టి మొక్క మన్నారే కానీ మహనీయుల గురించి చెప్పలేదన్నారు.అయితే ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు స్వంత గ్రామంలో ఎంత మంది పేదోళ్లకు ఇండ్లు కట్టించారని,ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అవినీతికి పాల్పడ్డారని భూపాలపల్లి జెడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ ప్రశ్నిస్తే కాంగ్రె్స్ నాయకులు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని ఆయన అన్నారు. 40ఏండ్ల క్రితమే శ్రీపాదరావు తల్లి ఎంతో మంది పేదోళ్లకు చల్ల పోసిందని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకోవడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఈనాడు తమ నాయకుడు పది మంది అన్నం పెట్టాడనో, నాలుగురి సాయంచేశాడనో చెప్పుకోకుండా 50ఏండ్ల కిందట చల్ల పోసిండ్లని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.అధికారం కోసం పదవుల కోసం పరితపించే నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని,ఆనాడు మనకోసం త్యాగాలు చేసిన మహనీయులే మనకు స్పూర్తి అని వారి చరిత్రపై చర్చ పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.