రైస్ మిల్ కార్మికుల వేతనాలు పెంచాలి.
సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 1( కలం శ్రీ న్యూస్):రైస్ మిల్లు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి శనివారం మంథని ప్రాంతంలోని రైస్ మిల్లులను సిఐటియు జిల్లా బృందం పర్యటించింది, రైస్ మిల్లులో పనిచేస్తున్న ఆపరేటర్స్, గుమస్తాలు,హమాలీలు,లేబర్ తదితర కార్మికులను వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సర్వే సందర్భంగా అనేక సమస్యలు కార్మికులు సిఐటియు నాయకులకు వివరించారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ చట్టానికి విరుద్ధంగా 12 గంటల పని విధానం రైస్ మిల్లులో అమలు చేస్తున్నారని, పండుగ సెలవులు,ఆదివారాలు ఇవ్వడంలేదని,ఈఎస్ఐ సౌకర్యం అమలు చేయడం లేదని,పిఎఫ్ కూడా నామమాత్రంగా కడుతున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పెంచవలసిన కనీస వేతనాలను 2007 నుంచి ఇప్పటివరకు 15 సంవత్సరాలుగా పెంచకుండా నిర్లక్ష్యం చేస్తుందని, దీని మూలంగా యజమానులతో చర్చించి వేతనాలు పెంచుకునే శక్తి తగ్గిపోతుందని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడంతో కార్మికుల కుటుంబాల జీవితం దుబ్బరంగా మారిందని,ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న రైస్ మిల్లు కార్మికుల కనీస వేతనాల జీవోలను సవరించి,నెలకు కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మంథని రైస్ మిల్లులో చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయకపోవడాన్ని వ్యతిరేకిస్తూ సంబంధిత కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని అదే విధంగా ఈ సమస్యలను పరిష్కారం కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి త్వరలోనే ఆందోళన కార్యక్రమాలను చేపడతామని అన్నారు. రైస్ మిల్లులో పనిచేస్తున్న అన్ని విభాగాల కార్మికులందరూ ఐక్యంగా రాబోయే రోజుల్లో జరిగే పోరాటాల్లో పాల్గొని,జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ బృందంలో రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, తాండ్ర అంజయ్య, సిఐటియు మంథని డివిజన్ నాయకులు బూడిద గణేష్, తదితరులు ఉన్నారు.