ఎల్లమ్మతల్లి దీవెనలు అందరిపై ఉండాలి
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 20(కలం శ్రీ న్యూస్):గౌడ కులస్తుల ఆరాధ్యదైవం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దీవెనలు అందరిపై ఉండాలని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ వేడుకున్నారు. రామగిరి మండలం చందనాపూర్ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ, జమదగ్నిమహముని కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గౌడ కులబాంధవులంతా కలిసి ఐక్యతతో కళ్యాణమహోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి గ్రామదేవతల ప్రతిష్టాపన ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని, గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్ట ఉత్సవాలు, ఆయా కులాల ఆరాధ్యదైవాల మహోత్సవాలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందుతోందని ఆయన అన్నారు. ఆ దేవతల దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలన్నారు. అనంతరం గౌడ కులబాంధవులు జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌కు మోకుతో ఘనంగా సన్మానించారు.అనంతరం ఆలయ ఆవరణలో భక్తులు,గీత కార్మికుల సౌకర్యార్థం సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేసి ఆయన ప్రారంభించారు.