Friday, September 20, 2024
Homeతెలంగాణకాంగ్రెస్‌కు అధికారం ఇస్తే మళ్లా బర్రెకుంటకు మురుగు మళ్లిస్తరు

కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే మళ్లా బర్రెకుంటకు మురుగు మళ్లిస్తరు

కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే మళ్లా బర్రెకుంటకు మురుగు మళ్లిస్తరు

దశాబ్ది ఉత్సవాల్లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జూన్ 16(కలం శ్రీ న్యూస్):నాలుగు రోజులైతే పుట్ట మధు కనబడడని,కనబడకుండా చేస్తామని ప్రచారం చేస్తున్నారని, తాను కనబడకుండా పోయి అధికారం కాంగ్రెస్‌కు ఇస్తే మళ్లా బర్రెకుంటకు మురుగు నీళ్లు మళ్లిస్తరని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా శుక్రవారం మంథనిలో నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవం సందర్బంగా స్థానిక గాంధీచౌక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు.2009లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తూ పుట్ట మధూకర్‌కు అవకాశం ఇస్తే దోచుకుంటాడని ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని, కాంగ్రెస్‌ మోసాన్ని పసిగట్టిన మంథని ప్రజలు 2014లో ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా తనకు అవకాశం కల్పించారని అన్నారు. అయితే అనేక ఏండ్లు మంథనిని పరిపాలించిన ఒకే కుటుంబ పాలనలో ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులుపడ్డారని గ్రహించి అప్పటి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైన పుట్ట శైలజతో మంథనిని గొప్పగా తీర్చిదిద్దాలనే ఆలోచన చేశామని అన్నారు. మొట్టమొదటగా మంథని మున్సిపల్‌ పరిధిలోని అంబేద్కర్‌ నగర్‌ వాసుల గురించి ఆలోచన చేసి బర్రెకుంటను శుభ్రం చేశామన్నారు. 40ఏండ్లలో ఏనాడు అంబేద్కర్‌నగర్‌ ప్రజలను మనుషులుగా చూడలేదని,కానీ తాము తమ బిడ్డలుగా బావించి బర్రెకుంట మురుగును బొక్కల వాగుకు మళ్లించామని ఆయన గుర్తు చేశారు.రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మంత్రపురిగా పేరుగాంచిన మంథని గురించి గొప్పలు చెప్పుకోవడానికే తప్ప గత పాలకులు చేసిందేమీ లేదని, ప్రజల కనీస అవసరాలు తీర్చని చరిత్ర కాంగ్రెస్‌ పాలకులదని ఆయన విమర్శించారు.ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలకు సేవకులుగా బాధ్యతగా పనిచేసి ఉంటే ఈనాడు మంథని రూపురేఖలు మారి ఉండేవని ఆయన అన్నారు.అయితే 40ఏండ్లలో జరుగని అభివృధ్దిని నాలుగేండ్లలో చేసి చూపిస్తే తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు సైతం ఆ ప్రచారాలనే నమ్ముతున్నారని అన్నారు.గత పాలకులు ఏం చేశారని ప్రశ్నించాల్సిన ప్రజలు ప్రశ్నించకపోవడం,ఆలోచన చేయకపోవడం మూలంగానే మోసపోతూనే ఉన్నామన్నారు. మోసం చేసే వారిది తప్పుకాదని, పదేపదే మోసపోయే మనదే తప్పు అని ఆయన గుర్తుచేశారు. తుమ్మలు,పందులు తిరిగే బొక్కలవాగును ఏనాడు పట్టించుకోలేదని,36కోట్ల నిధులు వస్తే నామమాత్రపు పనులు చేసి చేతులు దులుపుకున్నారని,కానీ తాము నాలుగేండ్లలో మరో .36కోట్లు తీసుకువచ్చి సుందరంగా తీర్చిదిద్దామని, అలాగే.8కోట్లతో చెక్‌డ్యాం నిర్మించి ఆహ్లదకరంగా మార్చామన్నారు. రాబోయే రోజుల్లో బొక్కలవాగులో బోట్లు తిప్పుతామని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అరకొరగా నిధులు తీసుకువచ్చి కాంగ్రెస్‌ కార్యకర్తల జేబులు నింపారే కానీ ప్రజల అవసరాలను గుర్తించలేదన్నారు. నాటి నుంచి నేటి వరకు మంథని ప్రజలను చీకట్లోనే ఉంచాలన్నదే కాంగ్రెస్‌పార్టీ పాలకుల నైజమని ఆయన స్పష్టం చేశారు. గాంధీ ఆశయాలే కాంగ్రెస్‌ పార్టీ ధ్యేయమని,గాంధీమార్గమే తమ మార్గమని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్‌పార్టీ పాలకులు మంథని నడిబొడ్డున వర్తక వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న మహాత్మాగాంధీ విగ్రహం శిథిలమై పోయినా పట్టించుకోలేదని, గాంధీని గౌరవించని పార్టీ కాంగ్రెస్‌ పార్టీనేనని ఆయన విమర్శించారు. మంథనిని అన్ని విధాలుగా అభివృధ్ది చేయాలన్నదే మా ఆకాంక్ష అని,ఈ క్రమంలో మంథని మున్సిపాలిటీకి నిధులు తీసుకువచ్చి సుందరీకరణపై దృష్టిసారించామన్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన తనలాంటి వారికే ఈ ప్రాంతంపై ప్రేమ ఉంటుందని,ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ మన ఓట్లతో అధికారంలోకి వచ్చిన వారు ఎందుకు పట్టించుకుంటారని ఆయన ప్రశ్నించారు.విదేశాల్లో ఉండే మంథనికి చెందిన వాళ్లు ఇక్కడకు వస్తే ఇక్కడే ఉండాలని అనిపించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నదే మా లక్ష్యమని అన్నారు.ఆనాడు మంథని గ్రామపంచాయతీ సర్పంచ్‌లుగా ఉన్నవారు ఏ మాత్రం ప్రజల గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరమని,ఈ క్రమంలో పుట్ట శైలజకు సర్పంచ్‌గా,మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు అప్పగించడంతో మంథనికి అభివృధ్ది బాటలు పడుతున్నాయని ఆయన వివరించారు.ఆనాడు గ్రామపంచాయతీలో పనిచేసే కార్మికులకు సక్రమంగా వేతనాలు చెల్లించలేదని,తాను పలుమార్లు అప్పటి సర్పంచ్‌లను కోరినా పట్టించుకోలేదని ఆయన వాపోయారు.కానీ ఈనాడు మున్సిపల్‌లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి కలెక్టర్‌కు ఎలా నెలనెలా వేతనాలు వస్తాయో అదే రీతిలో కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నామని ఆయన గుర్తు చేశారు.వ్యాపార కేంద్రంగా ఉండే మంథనిలోని వ్యాపారుల సంక్షేమం కోసం అనేక ప్రణాళికలు తయారు చేస్తన్నామని,ఇందులో బాగంగా మున్సిపల్‌ దుకాణ సముదాయంపై మరో అంతస్తు నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.అలాగే పన్నుల బారం తగ్గించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన ఈ సందర్బంగా వివరించారు. రాబోయే రోజుల్లో మంథని రూపురేఖలు మార్చి అభివృధ్దిచేస్తామని,బర్రెకుంటను ఇతర చెరువుల్లా శుభ్రమైన నీళ్లతో నింపి అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.నాడు నేడు మంథని మార్పుపై ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని, మనం చర్చించుకోకపోతే మళ్లా మోసం చేసే వాళ్లు మన ముందుకు వస్తారని ఆయన సూచించారు.ఈ కార్యక్రమం లో ప్రజాప్రతినిధులు,అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్ లు,బిఆర్ఎస్ నాయకులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!