Thursday, June 13, 2024
Homeతెలంగాణప్రగతి కాంతులతో కళ కళలాడుతున్న పట్టణాలు....... జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రగతి కాంతులతో కళ కళలాడుతున్న పట్టణాలు……. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రగతి కాంతులతో కళ కళలాడుతున్న పట్టణాలు……. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

సుల్తానాబాద్ లో నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

సుల్తానాబాద్, జూన్ 16(కలం శ్రీ న్యూస్):మన రాష్ట్రంలో ప్రతి పట్టణం, నగరం ప్రగతి కాంతులతో కళ కలాడుతున్నాయని, ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పన దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ పాల్గొన్నారు.

తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవంలో భాగంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఉదయం రంగోలి పోటీలు నిర్వహించారు, అనంతరం పురపాలక సంఘ కార్యాలయం లో మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత జాతీయ పతాకావిష్కరణ చేశారు. ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటోలతో మెప్మా, అంగన్వాడి ఆశ వర్కర్లు, కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వద్దకు ర్యాలీగా వెళ్లి చౌరస్తాలో మానవ హారం నిర్వహించి తిరిగి అంబేడ్కర్ చౌరస్తా నుండి పద్మనాయక కళ్యాణ మండపం వరకు ర్యాలీగా వచ్చారు. స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహించిన తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలలో సుల్తానాబాద్ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పెద్దపల్లి ఎమ్మెల్యే లు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ,  ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత వివిధ శాఖలలో చేపట్టిన అభివృద్ధి పనులను తెలుసు కునేందుకు ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు నిర్వహిస్తున్నదని , అందులో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలు జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నూతన పురపాలక చట్టాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ సేవలను సులభతరం చేయడం జరిగిందని, ఈ గవర్నెన్స్ ద్వారా ఆఫీస్ ల చుట్టూ తిరగకుండా, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొని ఇంటి నుండే అనుమతులు, వివిధ ధృవీకరణ పత్రాలు పొందే అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు.

వార్డ్ సమావేశాలను తరచుగా నిర్వహించుకుని కౌన్సిల్ సభ్యులతో యువత, మహిళలు తమ ప్రాంతాల్లో అవసరమైన పనుల గురించి చర్చించి, ప్రభుత్వ పరంగా విడుదల అయ్యే నిధులను ఒక క్రమ పద్ధతిలో ప్రణాళిక ప్రకారం ఉపయోగించుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలలోనీ ప్రతి వార్డులో మౌళిక సదుపాయాలు, వసతులు కల్పించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని, సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మిషన్ భగీరథ ఇంట్రా క్రింద 8 కోట్ల 28 లక్షల వ్యయంతో ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తున్నామని అన్నారు.పారిశుధ్య వాహనాలతో ప్రతిరోజు ఇంటి నుంచి చెత్త సేకరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. చెత్త నిర్వహణ కోసం సుల్తానాబాద్ పట్టణంలో కాంపోస్టింగ్ షెడ్, డి.ఆర్.సి.సి ఏర్పాటు చేశామని, మన ఇంటి నుండి, పరిసరాల నుండి వెలువడే చెత్తను ఒక క్రమ పద్ధతిలో డిస్పోజ్ చేయకపోతే వ్యాధులు ప్రభలి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, వ్యర్థాలను డిస్పోస్ చేసే విధంగా మౌళిక వసతులు కల్పన, వ్యర్ధాల నిర్వహణ కొరకు 46 లక్షలతో ఎఫ్.ఎస్.టి.పి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.

పట్టణాలలో తక్కువ విస్తీర్ణంలో అధిక శాతం ప్రజలు నివాసం ఉంటారని, కాంక్రీట్ జంగిల్ గా పట్టణాలు, నగరాలు ఉంటాయని, మున్సిపాలిటీలలో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కు కేటాయిస్తూ హరిత పట్టణాల సాధన దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో గ్రీన్ బడ్జెట్ నిధులతో 4 నర్సరీలు, 13 పట్టణ ప్రకృతి వనాలు, 15.7 కిలోమీటర్ల అవెన్యూ ప్లాంటేషన్ పూర్తిచేశామని కలెక్టర్ తెలిపారు.

కోటి 54 లక్షల వ్యయంతో సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టామని కలెక్టర్ పేర్కొన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో మౌళిక వస్తువుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఐదు కోట్లు మంజూరు చేసిందని, వీటితో పట్టణాలలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు.పట్టణ ప్రగతి నిధుల నుంచి 10 లక్షల 46 వేలతో రెండు క్రీడా ప్రాంగణాలు, 13 లక్షలతో రెండు ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేశామని, 63 లక్షల ఎస్.ఎఫ్.సి నిధులతో రోడ్లు, డ్రైయిన్లు నిర్మించామని అన్నారు. ప్రజలకు గౌరవంగా అంతిమ సంస్కారాలు జరిగేలా కోటి 54 లక్షలతో అవసరమైన వసతులతో స్మశాన వాటిక ఏర్పాటు చేశామని, ప్రజలకు భవన నిర్మాణ అనుమతులు సులభతరం చేసేందుకు టిఎస్ బి పాస్ పాలసీని రూపొందించామని, ఆన్లైన్ పద్ధతిలో నిర్దేశిత సమయంలో భవన నిర్మాణ అనుమతులు పారదర్శకంగా అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధికి మీరందరూ సజీవ సాక్ష్యం అని, కే.సి.ఆర్. దార్శనికత్వం మేరకు ఈ పట్టణం గ్రామ పంచాయతీ నుండి మునిసిపాలిటీ గా మారిందని అన్నారు. కౌన్సిల్ మెంబర్ లు అర్థవంతంగా, క్రియాశీలకంగా ఉంటేనే పట్టణం అభివృద్ధి జరుగుతుందని, వీరి కృషి, సహకారం, ఆలోచనల మేరకు ఈ రోజు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.5 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్మశాన వాటికలు, డంప్ యార్డ్, పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, పట్టణంలో కోటి 60 లక్షలతో మినీ స్టేడియం ఏర్పాటు కొరకు మంజూరు చేసుకోవడం జరిగిందని, కాంట్రాక్టర్ అలసత్వం మూలాన పూర్తి చేసుకోలేక పోయామనీ తెలిపారు. మానేరు వాగు నుండి, మిషన్ భగీరథ నుండి పట్టణంలో ఎల్లప్పుడూ మంచినీరు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చేపట్టామని తెలిపారు.పట్టణానికి నలు దిక్కులా రాకపోకలు, వాహనాల సంఖ్య పెరిగినందున చిన్న చిన్న ఇరుకు రోడ్లను వెడల్పు, డబుల్ రోడ్లు చేసుకొని సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి శాస్త్రి నగర్ లో మునిసిపల్ కు రెండు ఎకరాల స్థలం కేటాయింపు కొరకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు. పట్టణాన్ని పలు విధాలుగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతున్నదని, నాడు నేడు పరిస్థితులను, జరిగిన అభివృద్ధిని ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ తెలియజేయాలని తెలిపారు.

మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత మాట్లాడుతూ పట్టణ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, సెగ్రిగేషన్ షెడ్, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుతో పాటు ప్రభుత్వ బడులను మన ఊరు మన బడిలో ఆధునీకరించి, అవసరమైన చోట పాత స్కూల్ భవనాలను తీసివేసి క్రొత్తగా కట్టుకోవడం జరిగిందని, ఎమ్మెల్యే ఇచ్చిన నిధులు 5 కోట్లను పట్టణాభివృద్ధి కి కేటాయించి పూసాల రోడ్డును, నీర్ కుల రోడ్డు వెడల్పు పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు.ప్రాక్టీసింగ్ హోమ్ కంపోస్టింగ్ అంటే తడి, పొడి చెత్తను వేరు చేసి ఎలా ఉపయోగిస్తు న్నారు అనే విషయంపై పలువురు మహిళలు ఈ సందర్బంగా వివరించారు.

అనంతరం ప్రాక్టీసింగ్ హోమ్ కంపోస్టింగ్ చేస్తున్న వారికి, ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంసా పత్రాలు అందించగా, పారిశుధ్య కార్మికులను సన్మానించి పి.పి. కిట్లని అందించారు. ఈ  కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత, వైస్ చైర్ పర్సన్ సమత,తహశీల్దార్ యాకన్న, ఎం.పి.డి.ఓ. శశికళ, మునిసిపల్ కమిషనర్ రాజశేఖర్, వివిధ ప్రజా ప్రతినిధులు, కౌన్సిల్ సభ్యులు, మెప్మా, అంగన్వాడి ఆశ వర్కర్లు, మునిసిపల్ సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!