Wednesday, September 18, 2024
Homeతెలంగాణరాష్ట్రంలోనే బీపీ మండల్‌ విగ్రహంపెట్టిన చరిత్ర మా నాయకుడిదే

రాష్ట్రంలోనే బీపీ మండల్‌ విగ్రహంపెట్టిన చరిత్ర మా నాయకుడిదే

రాష్ట్రంలోనే బీపీ మండల్‌ విగ్రహంపెట్టిన చరిత్ర మా నాయకుడిదే

మున్సిపల్‌ కో ఆప్షన్‌సభ్యుడు ఎస్‌కే యాకూబ్‌

మంథని, మే 18(కలం శ్రీ న్యూస్):నియోజకవర్గంలో బహుజనులంతా ఏకమవుతుంటే ఓర్వలేని కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను మభ్య పెడుతూ దుష్ట్రచారాలు చేస్తున్నారని మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుడు ఎస్‌కే యాకూబ్‌ అన్నారు. మంథని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం మంథనిలో ఏర్పాటు చేసిన బీసీ రిజర్వేషన్‌ పితామహుడు బిందేశ్వరి ప్రసాద్‌ విగ్రహ ఆవిష్కరణ, బహిరంగ సభ సందర్బంగా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బహుజనులు తరలిరావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. సభలో వక్తలు మాట్లాడిన విషయాలపై కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడిన తీరు బాధాకరమన్నారు. నియోజకవర్గంలో ఎంతో మందిపేదలకు ఇండ్లు కట్టిచ్చామని, ఆనాడు శ్రీపాదరావు స్పీకర్‌గా ఉన్న సమయంలో నియోజకవర్గంలోని పది వేల మంది పేదలకు ఇండ్లు కట్టిచ్చామని అజీంఖాన్‌ మాట్లాడారని, పదివేల ఇండ్లు కట్టిస్తే ఏడికి పోయాయని ప్రశ్నించారు. 40ఏండ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో పనిచేస్తున్న అజీంఖాన్‌కు ఈనాటికి స్వంత ఇల్లు లేదని, పెద్ద సారు, చిన్న సారు కట్టిస్తారని చెప్పిన అజీంఖాన్‌ ఉన్న చిన్న ఇంటికి కూడా అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూపాలపల్లి జెడ్పీ చైర్మన్‌ జక్కు హర్షిణీ వాస్తవాలు మాట్లాడితే విమర్శించడం సరికాదని, అజీంఖాన్‌ వాస్తవాలు తెలుసుకుని ధన్వాడలో పేదల ఇండ్లను పరిశీలించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు. అదే విధంగా మాజీ సర్పంచ్‌ వొడ్నాల శ్రీనివాస్‌ మాట్లాడిన తీరు హస్యాస్పదంగా ఉందని, బీపీ మండల్‌ విగ్రహం పెడితే ఆయన గురించే మాట్లాడాలని అనడంలో ఆంతర్యం ఏమిటన్నారు. నియోజకవర్గంలో తండ్రి విగ్రహాలు తప్ప మన కోసం మన భవిష్యత్‌ తరాల కోసం త్యాగాలు, పోరాటాలు చేసిన మహనీయుల విగ్రహాలు పెట్టలేదనే విషయాన్ని శ్రీనివాస్‌ గుర్తించాలన్నారు. ఆనాడు మహనీయుల చరిత్ర చెప్పలేదు కనుకనే ఈనాడు మా నాయకుడు మహనీయుల విగ్రహాలు పెట్టి వారి చరిత్రను చాటి చెప్పే బాధ్యతను తీసుకున్నాడని అన్నారు. ఆనాడు బహుజనుల గురించే మహనీయులు పోరాటం చేశారని, ఇక్కడ సైతం బహుజనుల గురించే మా నాయకుడు పోరాటం చేస్తున్నాడని, బహుజనులకు అన్యాయం చేసిన వారి గురించే మాట్లాడుతామని అన్నారు. బీసీ రిజర్వేషన్‌ పితామహుడు బిందేశ్వరి ప్రసాద్‌ విగ్రహాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటగా మంథనిలో ఏర్పాటు చేసిన చరిత్ర మా నాయకుడిదేనని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడులు చేశారని ఆరోపణలు చేస్తున్నారని, కానీ ఆనాడు శ్రీధర్‌బాబు మంత్రిగా ఉన్నసమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల ఇండ్లపై రాళ్లతో దాడి చేసి హత్యాయత్నాలు చేసిన సంఘటనలు మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు. దాడులు చేసే సంస్కృతి మాది కాదని, అది కాంగ్రెస్‌కే చెల్లుబాటు అవుతుందని ఆయన హితవు పలికారు. ఇకనైన కాంగ్రెస్‌ నాయకులు కళ్లు తెరిచి వాస్తవాలు తెలుసుకోవాలని, బహుజనుల కోసమే మా నాయకుడు పోరాటం చేస్తున్నాడే తప్ప మీ నాయకుడిలా బహుజనుల మీద పెత్తనం చెలాయించడం లేదని గ్రహించాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ టౌన్‌ ప్రెసిడెంట్‌ బత్తుల సత్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్‌ బాబా, టౌన్‌ వైస్‌ ప్రెసిడెంట్లు సుల్తాన్‌ ఆసిఫ్‌ఖాన్‌, ఇర్ఫాన్‌, మైనార్టీ టౌన్‌ ప్రెసిడెంట్‌ ఎండీ ఫయాజ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ సల్మాన్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!