నిర్దేశిత ప్రభుత్వ కార్యక్రమాలు కట్టుదిట్టంగా అమలు- జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
రైతుల ఖాతాలో పంట నష్ట పరిహారం అందేలా చర్యలు
వడదెబ్బ నివారణకు అధికారులు అవసరమైన చర్యలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు
ధాన్యం కొనుగోలులో రైతులుఇబ్బందులు పడకుండా చర్యలు
ప్రతి రోజూ 10 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలుకు చర్యలు
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు అధికంగా జాయిన్ అయ్యేలా చర్యలు
మంథని మే 18(కలం శ్రీ న్యూస్):నిర్దేశిత ప్రభుత్వ కార్యక్రమాలను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.గురువారం ఎన్.టి.పి.సి. మిలీనియం హాల్ నందు జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పాల్గొన్నారు.
జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ,.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగానే చర్యలు తీసుకుంటుందని, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల పరిహారం అందిస్తామని,మొదటి విడత కింద జిల్లాలో 5 వేల 790 మంది రైతులకు 6910.02 ఎకరాలకు 6 కోట్ల 91 లక్షలు మంజూరు చేసామని, రెండవ విడత కింద జిల్లాలో 17 వెల 560 మంది రైతులకు చెందిన 21 వేల 948 ఎకరాలకు పంట నష్ట పరిహారం కొరకు ప్రతిపాదనలు పంపినట్లు, రైతుల ఖాతాలో నేరుగా నష్ట పరిహరం అందజేస్తామని తెలిపారు.మిషన్ భగీరథ క్రింద ఇంటింటికి త్రాగునీటి సరఫరా చేస్తున్నామని, నీటి సరఫరా ఇబ్బంది ఉన్న కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లను ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని సూచించారు.
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 3.45 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, 83 వేల మంది కంటి అద్దాలు పంపిణీ చేశామని, ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 1843 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించి 134 మందిని తదుపరి చికిత్స కోసం రిఫర్ చేశామని అధికారులు వివరించారు. మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం సైక్రియాటిస్టును ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
జిల్లాలో త్వరలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం, డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు సకాలంలో విధులకు హాజరయ్యే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారికి ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు లారీల కదలికలపై నిఘా ఉంచి సకాలంలో మిల్లుల వద్ద ధాన్యం దిగుబడి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అదనపు లారీలు ఏర్పాటు చేయాలని సూచించారు.
మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన పాఠశాల వివరాలు ప్రజలకు వివరిస్తూ అధిక సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు పంపే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు తప్పనిసరిగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, బయోమెట్రిక్ విధానం ద్వారా అటెండెన్స్ ప్రతిరోజు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.ధాన్యం కొనుగోలు సమయంలో వచ్చే చిన్న, చిన్న సమస్యలు పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని,గత సంవత్సరంతో పోలిస్తే 10 వేల మెట్రిక్ టన్నులు అదనంగా కొనుగోలు జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లాలో ఇకనుంచి ప్రతిరోజు 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే విధంగా పటిష్ట చర్యలు చేపట్టామని,జూన్ మొదటి వారం నాటికి నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 3.5 లక్షల మెట్రిక్ టన్నుల దానం కొనుగోలు చేస్తామని తెలిపారు.
ధాన్యం సరఫరా సమయంలో లారీల కొరత రాకుండా అవసరమైతే అదనపు లారీల ఏర్పాటుకు కాంట్రాక్టర్ తో చర్చిస్తామని, రైస్ మిల్లుల వద్ద లారీ దానిని దించుకోకుండా పెండింగ్లో ఉంటే డిప్యూటీ తహాసిల్దారులు, పౌర సరఫరా అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరిస్తున్నా మని అన్నారు.
ప్రతి మండలానికి ప్రత్యేక అధికారుల్ని నియమించి క్షేత్రస్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ రైతులకు ఇబ్బంది కలగకుండా తమ పరిధి మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
మోడల్ పాఠశాలల్లో విద్యార్థులు వచ్చేందుకు వీలుగా అవసరమైన మేర ఆర్టీసీ బస్సులు నడిపే విధంగా ఆర్టీసి వారితో సంప్రదించి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ల స్థానంలో విద్యా వాలంటీర్లు ఏర్పాటు కోసం వినతి పత్రం అందించిన మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా అధిక సంఖ్యలో విద్యార్థులు చేరే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జెడ్పీ సి. ఈ. ఓ. శ్రీనివాస్, జెడ్పిటిసిలు,ఎంపీపీలు,జిల్లా అధికారులు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.