లోక్ అదాలత్ లను సద్వినియోగ పరుచుకోవాలి:జడ్జి ప్రియాంక
సుల్తానాబాద్,మే16(కలం శ్రీ న్యూస్):కక్షి దారులు లోక్ అదాలత్ లను సద్వినియోగ పరుచుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి జిఎస్ఎల్ ప్రియాంక అన్నారు. జూన్ 10న నిర్వహించనున్న లోక్ అదాలత్ కు సంబంధించి మంగళ వారం స్థానిక కోర్టు హాల్ లో సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని సిఐ, ఎస్సై పోలీసులతో జడ్జి ప్రియాంక సమీక్షా సమావేశం నిర్వహించారు. లోక అదాలత్ లో పరిష్కరించబడే పలు సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసుల గురించి పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్జి ప్రియాంక మాట్లాడుతూ జూన్ 10న సుల్తానాబాద్ కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించబదుతుందని, ఇరువర్గాల అంగీకారంతో రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఇరువర్గాల కక్షిదారులు సామరస్యంగా రాజీ చేసుకునేందుకు లోక్ అదాలత్ లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ సమావేశంలో సిఐ ఇంద్రసేనారెడ్డి, సుల్తానాబాద్, శ్రీరాంపూర్, జూలపల్లి ఎస్ఐలు విజేందర్, శ్రీనివాస్, వెంకట కృష్ణ, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.