Monday, May 27, 2024
Homeతెలంగాణజగిత్యాలకొండగట్టు అంజన్న చెంతకు కాళేశ్వరం నీళ్లు

కొండగట్టు అంజన్న చెంతకు కాళేశ్వరం నీళ్లు

కొండగట్టు అంజన్న చెంతకు కాళేశ్వరం నీళ్లు

జగిత్యాల, మే10(కలం శ్రీ న్యూస్): మహిమాన్విత క్షేత్రం, 400 ఏండ్ల చరిత్ర గల కొండగట్టు అంజన్న స్వామి చెంత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశనంలో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎస్సారెస్పీ వరదకాలువ నుంచి శాశ్వత నీటి వనరు కల్పించి, తద్వారా కాళేశ్వర జలాలను అంజన్న చెంతకు చేర్చి 365 రోజులు నీరు పుష్కలంగా అందుబాటులో ఉంచేందుకు కార్యాచరణను రూపొందించింది. తాజాగా రూ.13.45 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టింది. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది.

కొండగట్టు క్షేత్రం గతంలో అభివృద్ధికి నోచుకోలేదు. దేవస్థానం పరిధిలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం, అలాగే అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌.. ఈ ఏడాది ఫిబ్రవరి 15న కొండగట్టులో స్వయంగా పర్యటించారు. దానికి ముందుగానే జగిత్యాలలో జరిగిన ఓ బహిరంగ సభలో కొండగట్టు అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కొండగట్టును సమూలంగా అభివృద్ధి చేసేందుకు దశల వారీగా రూ.వెయ్యి కోట్లయినా కేటాయిస్తామని అక్కడే ప్రకటించారు.

దేవస్థానం పరిధిలో నీటి కొరత వెంటాడుతున్నది. పకడ్బందీ ప్రణాళికలు లేకపోవడం వల్ల కొండపై నిత్యావసరాలతో పాటు తాగునీటికి అవస్థలు ఏర్పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక.. మిషన్‌ భగీరథ కింద కొంత మేరకు పరిష్కారం చూపింది. అయితే భవిష్యత్‌లో నీటి కొరత పునరావృతం కాకుండా కొండగట్ట్టును ఆనుకొని ఉన్న ‘సంతలోని లొద్ది’కి వరద కాలువ నుంచి నీటిని పంపింగ్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు. ఇందుకోసం మల్యాల మండలం ముత్యాల గ్రామ శివారులోని వరదకాలువ 81 కిలోమీటర్‌ వద్ద ప్రత్యేకంగా పంపు హౌస్‌ నిర్మిస్తున్నారు.అక్కడి నుంచి 1.7 కిలోమీటర్ల మేర పైపులైన్‌ వేసి ప్రెజర్‌ పంపు ద్వారా లొద్దికి పంపిస్తారు. ఇందుకోసం లొద్ది ప్రస్తుత సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ప్రస్తుతం 358 ఉన్న ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంకు లెవల్‌) నుంచి 370కి పెంచుతున్నారు. పాత బండ్‌కు ఆనుకొని కొత్త బండ్‌ నిర్మిస్తున్నారు. వీటి ద్వారా ప్రస్తుతం 2.50 ఎంసీఎఫ్‌టీ ఉన్న లొద్ది సామర్థ్యం 13 ఎంసీఎఫ్‌టీకి పెరుగుతుంది. ఈ పనులన్నింటినీ ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. సాయిల్‌ టెస్టింగ్‌ వంటి పలు పరీక్షల నిమిత్తం ఎన్‌ఐటీ వరంగల్‌కు పంపించారు. ఈ పనులు పూర్తయితే కొండగట్టు చెంతకు కాళేశ్వరం జలాలు వచ్చి నీటి సమస్యకు శాశ్వత విముక్తి కలుగనున్నది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టి వల్లే కొండగట్టులో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతున్నది. కొండగట్టు క్షేత్రస్థాయి పర్యటన రోజే సీఎం కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ ప్రకారంగానే పనులకు శ్రీకారం చుట్టారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!