Wednesday, May 22, 2024
Homeతెలంగాణవేసవిలో గిరిజనులకు ప్రధాన ఆదాయవనరులు 

వేసవిలో గిరిజనులకు ప్రధాన ఆదాయవనరులు 

వేసవిలో గిరిజనులకు ప్రధాన ఆదాయవనరులు 

అడవుల్లో సహజ సిద్ధంగా లభ్యమవుతున్న పండ్లు

పాల, మొర్రి, తునికి, ఇప్ప పువ్వుల సేకరణ

అదిలాబాద్,ఎప్రిల్17(కలం శ్రీ న్యూస్):మారుమూల అటవీప్రాంత ప్రజలకు వేసవికాలం అడవుల్లో లభించే పండ్లే ప్రధాన ఉపాధి. అటవీ ప్రాంతాల్లో ఈ సీజన్‌లో పలు రకాల పండ్లు లభిస్తాయి. సమీపగ్రామాల్లోని గిరిజనులు తెల్లవారుజామున అడవికి వెళ్లి వివిధ రకాల పండ్లను సేకరించి గ్రామాల్లో విక్రయిస్తారు. పాల, మొర్రి, తునికి, ఇప్ప పువ్వులతో పాటు తునికాకు, చీపురు పుల్లలను సేకరిస్తారు. మండువేసవిలో సహజసిద్ధంగా లభించే అడవి పండ్లు అందరికీ ఆరోగ్యాన్ని పంచుతున్నాయి. అడవులకు నిలయమైన జిల్లాలోని ఆయా మండలాల్లో అటవీప్రాంతాల్లో పలురకాల పండ్లు లభిస్తాయి. ప్రకృతి పరంగా లభ్యమయే ఇలాంటి పండ్లు పట్టణప్రాంతాల్లో చాలామందికి తెలియదు. అడవులు దగ్గరగా ఉన్న గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో మాత్రం నెల రోజుల పాటు వీటి విక్రయాలు జోరుగా సాగుతాయి. వీటిలో ఉండే పోషకవిలువల గురించి తెలిసిన పల్లె జనం వీటిని కొనుగోలు చేస్తుంటారు. మనం తినే అన్ని ఆహార పదార్థాల్లో ప్రమాదకరమైన రసాయనాలను వినియోగిస్తున్న తరుణంలో ఇటీవల చాలామంది ఎలాంటి క్రిమిసంహారక రసాయనాలు వాడని ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని వాంకిడి, కెరమెరి, ఆసిఫాబాద్‌, తిర్యాణి, జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, బెజ్జూరు, సిర్పూర్‌(టి), చింతలమానేపల్లి, పెంచికలపేట మండలాల్లో విస్తరించి ఉన్న అడవుల్లో వేసవికాలంలో అటవీ పండ్లతో పాటు తునికాకు, చీపురు లాంటి అటవీ ఉత్పత్తులను గిరిజనులు నెలరోజుల పాటు సేకరించి ఆదాయం పొందుతారు. అటవీ ప్రాంతంలో పాలపండ్లు, మొర్రిపండ్లు, విత్తనం మొర్రి పలుకులు(సార పప్పు), తునికి పండ్లు, ఇప్పపువ్వు విరివిగా లభ్యమవుతుంటాయి.

గిరిజనులకు మంచి ఆదాయం.

అటవీ ప్రాంతంలో లభించే పలు రకాల పండ్లు, అటవీ ఉత్పత్తులు గిరిజనులుకు ఆదాయవనరులుగా ఉన్నాయి. అటవీ ప్రాంతంలో సేకరించిన వీటిని సాయంత్రం వేళల్లో సమీప గ్రామాల్లో, మండల కేంద్రాల్లో విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వేసవి కాలంలో సుమారు 45రోజుల పాటు లభించే ఈ అటవీ ఉత్పత్తులను గిరిజనులు సేకరించి రోజుకు రూ.300నుంచి రూ.500వరకు సంపాదించుకుంటున్నారు.

సేకరణలో పొంచిన ఉన్న ప్రమాదాలు..

గిరిజనులు తెల్లవారు జామున 4నుంచి 5ప్రాంతంలో గ్రామాల సమీపంలో అడవికి వెళ్లి వివిధ రకాల పండ్లు సేకరించే క్రమంలో ప్రమాదాల బారిన పడిన సంఘటనలు అనేకంగా ఉన్నాయి. పండ్లను సేకరిస్తున్న క్రమంలో ఒక్కోసారి అడవిపందులు, ఎలుగుబంట్లు, పాముల నుంచి ప్రమాదాలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో పలువురు గాయపడిన సంఘటనలు అనేకం. పండ్లను తెంపే సమయంలో చెట్లపై నుంచి పడి పోయి గాయాలపాలవుతుంటారు.

అంతరిస్తున్న వివిధ రకాల పండ్లు.

అయితే అడవులు రాను రాను అంతరించి పోతుండడంతో వివిధ రకాల పండ్లు దొరకడం లేదు. దీంతో అనేక వ్యయ ప్రయాసాలకు కోర్చి సేకరించిన పలురకాల పండ్లను చిన్న గ్లాస్‌కు రూ.15-20, వాటర్‌ గ్లాస్‌కు రూ.50కి విక్రయిస్తున్నారు. అయినప్పటికీ కొద్ది రోజుల పాటు సహజసిద్ధంగా లభించే ఈ పండ్లతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుండడంతో జనం కొనుగోలు చేస్తున్నారు.

వేసవిలో ఉపాధి లభిస్తుంది.

వేసవికాలంలో అడవిలో దొరికే పండ్లతో మాకు కొంత ఉపాధి లభిస్తున్నది. తెల్లవారు జామునే అడవికి వెళ్లి అక్కడ దొరికే సహజసిద్ధమైన పండ్లు తీసుకువచ్చి విక్రయిస్తున్నాం. దీంతో రోజుకు రూ.300ల నుంచి రూ.500 మేరకు ఆదాయం లభిస్తున్నది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!