Saturday, July 27, 2024
Homeతెలంగాణకనుమరుగవుతున్న జాజిరి ఆట

కనుమరుగవుతున్న జాజిరి ఆట

 

కనుమరుగవుతున్న జాజిరి ఆట

రింగుడు బిల్లా రూపాయి దండా – దండ కాదురో దామెర మొగ్గ

బోల్ బోల్ కట్టమీద బొమ్మలాట – సూడబోదమా ఆడబోదమా

కోతి పుట్టుడెందుకు – కొమ్మ లెక్కటందుకు కొమ్మలెక్కుడెందుకు – నార చీరేటందుకు

పండుగ ఏదైనా తెలంగాణ పల్లెల్లో దాని శోభ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. అసలే పల్లె పదాలతో సాహిత్య పరిమళాలు కొత్త గుబాళింపు వెదజల్లే తెలంగాణలో హోలీ సందడి అంతా ఇంతా కాదు. అలాంటి హోలీ సందర్భంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఆడే జాజిరి ఆట పల్లెల్లో, పట్టణాల్లో కనుమరుగవుతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం…

హైదరాబాద్, మార్చి06,(కలం శ్రీ న్యూస్): పండుగ ఏదైనా తెలంగాణ పల్లెల్లో దాని శోభ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు తమదైన సందడితో ఆ పండగకు మరింత వన్నె తెస్తారు. అసలే పల్లె పదాలతో సాహిత్య పరిమళాలు కొత్త గుబాళింపు వెదజల్లే తెలంగాణలో ఆ సందడి మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఫాల్గుణ మాసంలో వచ్చే రంగుల పండగ ‘హోలీ’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పండగ సమయంలో చిన్నారుల జాజిరి పాటలు తెలంగాణ పల్లెల్లో ఏరులై పారుతాయి.

కాముని పున్నమి నేపథ్యంలో 9 రోజుల పాటు ‘జాజిరి’ ఆడటం తరాలుగా వస్తున్న సంప్రదాయం. చిన్నారులు, యువకులు కర్రలు చేతబూని కోలాటాలాడుతూ, పాటలు పాడుతూ వీధుల్లో ఉత్సాహం నింపుతారు. ఇంటింటికీ తిరుగుతూ కాముని ఆటలు ఆడుతారు.

నిండు చంద్రుని వెన్నెల వెలుగుల్లో జాజిరి పాటలు తెలంగాణ పల్లెలకు కొత్త అందం తీసుకొస్తాయి. అవి అందర్నీ కవ్విస్తాయి.. నవ్విస్తాయి. యువకులను ఉర్రూతలూగిస్తాయి. ఆ పాటల్లో కష్టాలు ఉంటాయి, కన్నీళ్లూ ఉంటాయి.. అంతులేని ఆనందం కూడా ఉంటుంది. అంతకుమించి లోతైన అర్థం ఉంటుంది. తేలికైన పదాల్లో గొప్ప సందేశం ఇవ్వడం, ఆ అర్థాన్ని సున్నితమైన హాస్యంతో మిళితం చేసి చెప్పడం జాజిరి పాటలకే సొంతమైన ప్రత్యేకత.

 

జాజిరి పాటలు పాడుతూ ఇళ్ల ముందుకు వచ్చే యువకులకు ఆడపడుచులు తమకు తోచిన కానుకలు ఇచ్చి పంపిస్తారు. సాధారణంగా బియ్యం, డబ్బులు కానకలుగా ఇస్తారు. ఇలా 9 రాత్రులు ఆడుకుని చివరి రోజు కామనదహనం చేస్తారు. మరుసటి రోజు రంగులు జల్లుకుంటూ హోలీ పండగను సంబరంగా జరుపుకొంటారు.

రంగుల్లో తడిసి ముద్దయ్యాక స్నేహితులంతా కలిసి ఊరి చివరి బావుల వద్దకు వెళ్లి ఈత కొడుతూ సందడి చేస్తారు. అనంతరం అక్కడే.. మంచి నీడ ఉన్న ఓ చెట్టు చూసుకొని కోడికూర, అన్నం వండుకొని ఇష్టంగా తింటారు. కొంత మంది అయితే.. తాటి కళ్లు కూడా రుచి చూస్తారు. ఇలా.. మొత్తం మీద హోలీ పండగను ఉల్లాసంగా చేసుకుంటారు.

 

పల్లె పదాల సాహిత్యం గుబాళించే జాజిరి పాటలు..

జాజిరి పాటల్లో పురాణ ఇతిహాసాలకు సంబంధించిన పాటలతో పాటు వ్యవసాయ సంబంధ, శృంగార సంబంధ అంశాలు ఎక్కువగా ఉంటాయి. కోలలు, డప్పులు, చప్పట్లకు అనుగుణంగా, లయబద్ధంగా పాటలు ఉంటాయి. టీవీలు, సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల రాకతో పాత సంప్రదాయాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో మళ్లీ పాతతరం, పాత ఆచారాలు, పాత సంప్రదాయాలు రావాలని ఆశిద్దాం…..

 

 

 

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!