Thursday, September 19, 2024
Homeతెలంగాణతెలంగాణ ఏర్పాటుతోనే రాష్ట్ర ఆర్థికస్థితుల్లో మార్పు

తెలంగాణ ఏర్పాటుతోనే రాష్ట్ర ఆర్థికస్థితుల్లో మార్పు

  • తెలంగాణ ఏర్పాటుతోనే రాష్ట్ర ఆర్థికస్థితుల్లో మార్పు
  • వ్యవసాయ సాగునీటి రంగాలకు పెద్దపీట
  • దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు అమలు
  • రైతు సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్
  • రైతులకు సేవ చేయడం అదృష్టంగా బావించాలే
  • ప్రజలు ఓడించినా పుట్ట మధు సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్‌
  • జెడ్పీ చైర్మన్‌ పదవితోనే ఈ ప్రాంతానికి అభివృద్దిబాటలు
  • సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

మంథని ఫిబ్రవరి 24(కలం శ్రీ న్యూస్ ):తెలంగాణ రాష్ట ఏర్పాటుతోనే రాష్ట్ర ఆర్థికస్థితిగతుల్లో మార్పు సాధ్యమైందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.మంథని, కమాన్‌పూర్‌ మండలాల్లో నూతనంగా నియామకమైన వ్యవసాయ మార్కెట్‌ కమిటి పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ ,పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత ,పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ , మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ కమాన్‌ఫూర్‌ మార్కెట్‌ కమిటి చైర్మన్‌గా దాసరి రాయలింగు, వైస్‌ చైర్మన్‌గా గుర్రం లక్ష్మిమల్లు, మంథని మార్కెట్‌ కమిటి చైర్మన్‌ ఎక్కటి అనంతరెడ్డి, వైస్‌ చైర్మన్‌గా పుట్టపాక శ్రీనివాస్‌తోపాటు ఆయా కమిటీల పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయా మార్కెట్‌ కమిటి పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ

ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వ పరిపాలనతో ఇప్పుడున్న సహజ వనరులు ఉన్నప్పటికి వాటిని వినియోగించుకోవాలన్న ఆలోచన ఏనాడు చేయలేదన్నారు. అనేక ఏండ్లు రొటీన్‌గానే పరిపాలన చేశాయే కానీ ఇక్కడున్న వనరులను వినియోగించుకుని ఈ ప్రాంతాన్ని సశ్యశ్యామలం చేయాలని చూడలేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రొటీన్‌గా కాకుండా విన్నూత్న రీతిలో ఆవిష్కరణలు చేసి ఈ ప్రాంతానికి అవసరమైన వనరులు వినియోగించుకుని ఆర్థిక స్థితిగతులు మార్చారని అన్నారు. వ్యవసాయ, సాగునీటి రంగాలకు పెద్దపీట వేసి రాష్ట్ర అభివృద్దికి బాటలు వేశారన్నారు. వృధాగా పోతున్న నీటిని బీడు భూములకు మళ్లించేలా సరికొత్త ప్రణాళికలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కేవలం ఏడాదికి రెండు పంటలు తీయడానికే రైతులు అనేక కష్టాలు ఎదుర్కొనే వారని, కానీ ఈనాడు ప్రతి రైతు ఆనందంతో మూడు పంటలు తీయడానికి సిద్దమవుతున్నారని అన్నారు. ఏడాదికి ఆనాడు 60లక్షల మెట్రిక్‌ టన్నుల పంట తీస్తే ఈనాడు 2.55కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండిస్తున్నామని ఆయన వివరించారు. 65ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో గొప్పలుచెప్పుకోవడానికి ఏదీ లేదని ఆయన విమర్శించారు. ఈనాడు రైతులకు భరోసా కల్పించే రీతిలో దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బంధు అమలు చేస్తున్నామని చెప్పారు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయడం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు ఒక చైన్‌ సిస్టంలా ఒకే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులుఉంటే ఎంతో అభివృద్ది జరుగుతుందని ఆయన అన్నారు. ఆనాడు పుట్ట మధును ప్రజలు ఓడించినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన సేవలను గుర్తించి జెడ్పీ చైర్మన్‌ బాధ్యతలు అప్పగించారని, పుట్ట మధుకు జెడ్పీ చైర్మన్‌ అవకాశం ఇవ్వకుంటే ఈనాడు మంథనిప్రాంతంలో తట్టెడు మట్టి పోసేవాళ్లు ఉండేవాళ్లా అని ఆయన ప్రశ్నించారు. పుట్ట మధుకు అవకాశం రాబట్టే ఈ ప్రాంతానికి ఇన్నిపదవులు వస్తున్నాయని, ప్రతి ఒక్కరు ఆలోచనచేయాల్సిన అవసరం ఉందన్నారు. మంచినాయకుడిని ఎన్నుకుంటే అభివృద్ది గొప్పగా జరుగుతుందని ఆయన వివరించారు. ఎన్నికల సమయంలో ప్రజలు మంచిగా ఆలోచన చేయాలని మంచి నాయకుడిని ఒక్కసారి ఎన్నుకుంటే ఐదేండ్లు మనకు ఎంతోసేవలు చేస్తారని ఆయన వివరించారు. మార్కెట్‌ కమిటి పాలకవర్గ సభ్యులుగా ఎన్నికై రైతులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా బావించాలని ఆయన తెలిపారు. రైతులకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ వారికి అండగా నిలిచి ఆర్థికాభివృద్దికి సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.పుట్ట మధు మాటల నిజాయితీపై చర్చ జరుగాలే ఎంపీ బొర్లకుంట వెంకటేష్‌నేత.జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధు మాటల్లో నిజాయితీ ఉందని, ఆ మాటల నిజాయితీపై చర్చ జరుగాలని పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్‌నేత అన్నారు. నియోజకవర్గ అభివృద్ది, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేసిన పుట్ట మధు మాటల్లో ఎంతో బాధ కన్పిస్తోందన్నారు. ఆనాడు తెలంగాణ రాకముందు అటుతర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పును ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగున్నర ఏండ్లలో పుట్ట మధు ఎమ్మెల్యేగా అనేక అభివృద్ది చేయడంతో పాటు, ఆపదలో ఉన్నా అన్నా అంటే నేనున్నానంటూ ఎల్లప్పుడు అందుబాటులో ఉన్నాడని ఆయన గుర్తు చేశారు. అలాంటి మంచి నాయకుడిని ఓడించారని, అయినా ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తించారని అన్నారు. మంచి నాయకుడిని కోల్పోతే ఎంతో నష్టం జరుగుతుందని, మంచి చేయాలన్న ఆలోచన చేసే నాయకుడిని దూరం చేసుకోవద్దన్నారు. ఆనాడు టీఆర్‌ఎస్‌గా ఆవిర్బవించి, ఈనాడు బీఆర్‌ఎస్‌గా మారి దేశాభివృద్దికి బాటలు వేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో మంథని నుంచి ఢిల్లీ గద్దె వరకు గులాబీజెండాలు ఎగురాలన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మనలో చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తుంటారని, అలాంటి మోసాలను తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆనేక ఏండ్లు పరిపాలన చేసిన గత పాలకులు కుర్చీ కోసమే మన కులాలను వాడుకున్నారని జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. మంథని నియోజకవర్గంలో ఒకే కుటుంబం అనేక ఏండ్లు పరిపాలన చేసిందే కానీ ఏనాడు కులాలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. పదవులు ఇస్తే అడ్డుపడుతారనే ఆలోచనతో ఏ వర్గాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగనీయలేదని ఆయన గుర్తు చేశారు. తాము చిన్ని కులాలను ఎలా ప్రేమిస్తామో పెద్ద కులాలను సైతం గౌరవిస్తామన్నారు. అందుకు ఈనాడు మార్కెట్‌ కమిటి చైర్మన్‌గా ఎక్కటి అనంతరెడ్డిని ప్రతిపాదించడమే నిదర్శనమన్నారు. 40ఏండ్లలో మార్కెట్‌ కమిటిలో ఎవరికి అవకాశం సరైన ఇవ్వలేదని, పదవులు ఇచ్చినా పెత్తనం వారిదే ఉండేదన్నారు. ఆర్థికంగా బలపడితే అడ్డుకుంటామనే ఆలోచన ఆ కుటుంబంలో ఉందని ఆయన విమర్శించారు. ఎక్కటి అనంతరెడ్డి ఎంతో అనుభవం ఉన్న నాయకుడని, తెలుగు దేశం హయాంలోనే స్వయంగా ఎన్‌టీఆర్‌ మంథని ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చేందుకు సిద్దపడ్డా ఆయన స్వీకరించలేదన్నారు. అటుతర్వాత టీఆర్‌ఎస పార్టీ ఆవిర్బవించిన సమయంలో ఈ ప్రాంతంలో జెండా మోసిన నాయకుడని, ఆనాడు ఎంతో మంది నవ్వినా పట్టించుకోలేదన్నారు. అలాంటి నాయకుడి అనుభవాన్ని గుర్తించే ఏఎంసీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చామన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎంతో మంది పార్టీ కోసం కష్టపడినా గుర్తింపు,సరైన గౌరవం ఇవ్వలేదన్నారు. ఈనాడు తాము ఈ ప్రాంతంలో ప్రజల కోసం పనిచేస్తుంటే అనేక కుట్రలు, కుతంత్రాలుచేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లతో అధికారం చేపట్టి ఏండ్ల తరబడి పదవులు అనుభవించి ఆస్తులు సంపాదించుకుని అమెరికా, బెంగళూరులాంటి ప్రాంతాల్లో దాచుకున్నారే కానీ ఈ ప్రాంత పేదలకు రూపాయి ఖర్చు చేయలేదన్నారు. సేవలపై తాము ప్రశ్నిస్తే ఈ ప్రాంతానికి అనేక కళాశాలలు, పాఠశాలలు తీసుకువచ్చామని, ఉన్నత చదువులు అందించి గొప్పవాళ్లం చేశామని గొప్పలుచెప్పకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎవరైనా గొప్పగా సంపాదిస్తే నలుగురికి సాయం చేయాలని ఆలోచన చేస్తారని, కానీ ఆమెరికాలో ఆస్తులు కూడబెట్టుకున్న శ్రీధర్‌బాబు కుటుంబం ఈ ప్రాంత ప్రజలకు ఏం సేవ చేశారని, కనీసం తన స్వంత ఊరిలో ప్రభుత్వ పాఠశాలకు నాలుగు బేంచీలు అందించారా అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంత అభివృద్ది, ప్రజాసంక్షేమంతో పాటు గత పాలకుల వ్యవహరశైలిపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. కులాలను వాడుకుని కుర్చీలు ఎక్కే ఆ కుటుంబంపై అన్ని కులాలు ఆలోచన చేయాలని ఆయన గుర్తు చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!