Thursday, September 19, 2024
Homeతెలంగాణనేడే ప్రచారం ముగింపు...

నేడే ప్రచారం ముగింపు…

నేడే ప్రచారం ముగింపు…

హైదరాబాద్,నవంబర్28(కలం శ్రీ న్యూస్): తెలంగాణ వ్యాప్తంగా గత నెలరోజులుగా పొలిటికల్ జాతర సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందునుండే ప్రధాన రాజకీయ పార్టీలు ఎలక్షన్ పాలిటిక్స్ ప్రారంభించాయి. అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపు, నామినేషన్లు, హోరాహోరి ప్రచారం… ఇలా ఇప్పటివరకు రాజకీయ పార్టీలు చేసిన హడావిడి అంతాఇంతా కాదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు, అందరు అభ్యర్ధులు ఇప్పటివరకు ముమ్మర ప్రచారం చేసారు. ఈ ప్రచారానికి నేటితో తెరపడనుంది. నవంబర్ 30న అంటే వచ్చే గురువారం తెలంగాణవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో 48 గంటల ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాల్సి వుంటుంది… కాబట్టి మంగళవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది.

కొద్దిరోజులుగా పట్టణాలు, గ్రామాల్లో మారుమోగిన మైకులు నేటి సాయంత్రం మూగబోనున్నాయి… ప్రచార వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోనున్నాయి. ఏ ప్రచారం చేసినా ఇవాళ సాయంత్రం వరకే… దీంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అన్నిపార్టీలు, అభ్యర్థులు సిద్దమయ్యారు. దీంతో అన్ని నియోజక వర్గంలో ఇవాళ ప్రచారం జోరుగా ఉండనుంది.

119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు, పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేసారు. ఇక అన్నిపార్టీలు ప్రధాన మీడియాలోనే కాదు, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో కార్పోరేట్ స్థాయి ప్రకటనలతో హోరెత్తించాయి. జాతీయ పార్టీలయితే డిల్లీ నాయకులు, ఇతర రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నాయకులతో ప్రచారం చేయించాయి. గత వారంరోజులుగా జాతీయ నేతలంతా తెలంగాణలోనే మకాం వేసి ప్రచారాన్ని మరింత హోరెత్తించారు.

ఇలా తెలంగాణవ్యాప్తంగా హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం నేటితో ముగియనుంది. మరోవైపు రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించే పోలింగ్ ఎల్లుండి జరగనుంది. ఇందుకోసం ఎన్నికల కమీషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35వేల పోలింగ్ కేంద్రాలను సిద్దం చేసారు. 3 లక్షల మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వర్తించనున్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అలజడులు రేగకుండా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!