సంక్షేమ పథకాల అమల్లో విఫలమైన ప్రభుత్వం
అనర్హులకు అందిన డబుల్ బెడ్ రూములు
అఖిలపక్ష నాయకుల ఆవేదన
మంథని జనవరి 28(కలం శ్రీ న్యూస్ ):రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ కల్లబొల్లి మాటలతో మోసం చేస్తుందని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. ఆదివారం మంథని ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంథనిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో 80 శాతం మంది అనర్హులే ఉన్నారని వారు పేర్కొన్నారు. దళితులైన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేష్ లు డబుల్ బెడ్ రూమ్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఈ ఇండ్లలో ఒక్కరైనా దళితులు ఉన్నాడని చూసుకోకపోవడం శోచనీయమన్నారు. 8 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో ఎస్సీ,ఎస్టీ బీసీ లకు ఏమాత్రం న్యాయం జరగలేదని వారు తెలిపారు. అలాగే కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఈ ప్రాంతం నుండి సహజవనలు దోచుకుపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని లేనిపక్షంలో అన్ని పార్టీలు అఖిలపక్షం గా ఏర్పడి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు హెచ్చరించారు. ఈ అఖిల పక్ష సమావేశంలో లేబర్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఇరుగు రాళ్ల సంతోష్, ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బూడిద తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేల్పుల రాజు, లైసెట్టి రాజు, గంట బాలయ్య, కెక్కిర్ల సాగర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంథని రాకేష్, కందుల శ్రీనివాస్, సిపిఎం పార్టీ నాయకుడు ఆర్ల సందీప్, తదితరులు పాల్గొన్నారు.