ఘనంగా చాకలి ఐలమ్మ 38వ వర్థంతి
సుల్తానాబాద్,సెప్టెంబర్10(కలం శ్రీ న్యూస్): చాకలి ఐలమ్మ 38వ వర్థంతి వేడుకలను సుల్తానాబాద్ పట్టణంలో రజకసంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా మున్సిపల్ పరిథిలోని పోస్టాఫీస్ ఎదురుగా గల చాకలి ఐలమ్మ విగ్రహానికి రజకసంఘం మండలాధ్యక్షులు నిట్టూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రజకసంఘం నాయకులు, పురప్రముఖులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిట్టూరి శ్రీనివాస్ తోపాటు పలువురు చాకలి ఐలమ్మ సేవలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. సాయుధ పోరాటంలో ఆమె చేసిన సేవలను కొనియాడారు. చాకలి ఐలమ్మ అసలు పేరు చిట్యాల ఐలమ్మ అని, ఆమె సెప్టెంబరు 26, 1895లో సద్దుల బతుకమ్మ పండుగ రోజున తెలంగాణజిల్లా(అప్పటి ఆంధ్రప్రదేశ్) వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం, కిష్టాపురం గ్రామం లో జన్మించిందన్నారు. ఎన్నో సాయుధపోరాటాలలో ఉమ్మడి కమ్మూనిస్టు పార్టీలో చురుకుగా పనిచేసి ఎన్నో ఎదురుదెబ్బలను ఎదుర్కొందన్నారు. అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా దొరా అని ఉత్పత్తి కులాల(బీసీ కులాల)చేత పిలిపించుకొనే సంస్కృతికి చరమగీతం పాడినవారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారన్నారు. దాదాపు 90సంవత్సరాల ప్రాయంలో సెప్పెంబరు 10, 1995న వరంగల్ జిల్లా పాలకుర్తి గ్రామంలో తన తుదిశ్వాస విడిచినట్లు పేర్కొన్నారు. చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉధ్యమకారిణి వీరవనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక అధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి, 2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఆమె ను ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకోవడం ప్రస్తుత యువత స్త్రీలకు, భావితరాలకు దిక్సూచిగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా బీఆర్ఎస్ నాయకులు పారుపల్లి గుణపతి, వేగోలం అబ్బయ్యగౌడ్, ముత్యం రమేష్, రజకసంఘం నాయకులు నిట్టూరి శ్రీనివాస్, మండలాధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, నిట్టూరి మైసయ్య, నిట్టూరి అంజయ్య, కొత్తకొండ శ్రీనివాస్, నిట్టూరి ఆనంద్, మైలారం మధురయ్య, తోటపల్లి సంతోష్, చాతల శివ, దీపక్, శ్రీనివాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.