కుట్రల చరిత్రను కూల్చివేసి మన చరిత్రను సమాజానికి అందించాలే. జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్..
మంథని మే 16(కలం శ్రీ న్యూస్):కుట్రలతో రాసిన చరిత్రను కూల్చివేసి మన చరిత్రను సమాజానికి అందించే బాధ్యతను తీసుకుని మహనీయుల విగ్రహాలను నెలకొల్పుతున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అనేక ఏండ్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన గత పాలకులు మహనీయుల చరిత్రను చెప్పలేదని, వారిని చూపించకుండా చేశారని, కనీసం పాఠ్యాంశాల్లో కూడా ఎక్కడ చేర్చలేదన్నారు.ఈ క్రమంలోనే వారి కుట్రలను ఎండగట్టే బాధ్యత తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ నియోజకవర్గంలో చరిత్ర లేని వాళ్ల విగ్రహాలు ఏర్పాటు చేశారని, కానీ చరిత్ర తెలుసుకోవాల్సిన మహనీయులను మరుగున పడేశారని ఆయన విమర్శించారు. ఆనాడు ఎంతో మంది మహనీయులు సర్వం కోల్పోయి తమజీవితాలను త్యాగం చేసి మన భవిష్యత్ తరాల కోసం పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. అక్షరానికి ఆస్తికి, అధికారానికి సమాజహోదాకు దూరం పెట్టిన వారు, కష్టాలు, కన్నీళ్లకు కారకులెవరో ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. చరిత్రను తెలుసుకోవాలంటే 1950కి ముందు, తర్వాత ఏం జరిగిందో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మహనీయుల చరిత్ర, పోరాటాలు, త్యాగాలను తెలుసుకోవాలన్నారు. వందల వేల ఏండ్ల క్రితం రాజ్యాంగం లేకపోవడంతో బాధలు కష్టాలు అనుభవించాం, సంపదను, అవకాశాలను చేజిక్కించుకుని అణిచివేశారని ఆయన గుర్తించారు. 1950 తర్వాత డాక్టర్‌బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కుల ద్వారా ఆర్థికంగా రాజీకీయంగా ఎదిగామన్నారు.అయితే రిజర్వేషన్‌లో పొందుపర్చిన ఆర్టికల్ 340 ఇప్పటి వరకు అమలు కాకపోవడంతో బీసీలకు అన్యాయమే జరుగుతున్నారు. ఆనాడు బీసీల స్థితిగతులను తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా రెండు కమీషన్‌లు వేశారని, ఇందులో మండల్ కమీషన్ ఉండదని, బీపీ మండల్ కమీషన్ నివేదిక ద్వారా దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగిందని, ఈ నివేదికతోనే కాన్షీరాం మండల్ కమీషన్ అమల్ కరో వర్ణా కూర్చీ ఖాళీ ఖరో అనే నినాదంతో ఢిల్లీలో 18 రోజులు ధర్నా చేశారని ఆయన గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమ ఫలితంగా ఈనాడు బీసీలు కొన్నిరిజర్వేషన్‌లు పొందుతున్నామన్నారు. ఆనాడు డాక్టర్ అంబేద్కర్ కోరినట్లు రాజకీయంగా చట్టసభల్లో రిజర్వేషన్‌లు లేకపోవడం బాధాకరమన్నారు. ఆనాడే సమాజం అంబేద్కర్‌ను అనుసరించి ఉంటే ఈనాడు ఈ పరిస్థితులు ఉండేవి కాదన్నారు. మహనీయుల ఆశయాలను స్పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలన్నారు. ఇప్పటికే బీసీ సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ బిల్లు చేశారని, కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసి బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్‌లు అమలు చేయాలని ఆయన ఈసందర్బంగా డిమాండ్ చేశారు. మంథని నియోజకవర్గంలోని బీసీలు, ఎస్సీలు ఒక్కతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని కాంగ్రెస్‌లోఉన్న వాళ్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీసీలకే టికెట్టు వస్తుందని ఆశిస్తున్నారని ఆయన అన్నారు. 40ఏండ్లుగా చెంచడు నీళ్లు పోయని కుటుంబం ఆస్తులు సంపాదించుకుని అమెరికాలాంటి పట్టణాల్లో ఉంటూ ఇక్కడ మాత్రం మన వర్గాలను విభజించి పాలిస్తున్నారనే విషయాలను అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నబహుజనుల్లో సైతం ఆలోచనలు మొదలయ్యాయని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌పార్టీలోని బీసీలు టికెట్టు అడిగే సమయం దగ్గరలోనే ఉందన్నారు. ఇలాంటి పరిస్థితులు రావాలని, బీసీ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా సామాజికంగా ఎదుగాలన్న బీపీ మండల్ స్పూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.