తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి…
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జయశంకర్, మహబూబాబాద్,వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్..
మంథని మే 10(కలం శ్రీ న్యూస్):అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని రైతుల నుండి ప్రభుత్వమే కొనుగోలు చేసి,నష్టపోయిన రైతులకు ఎకరానికి 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) డివిజన్ కమిటీ పేరుపై ప్రకటన విడుదల చేశారు.అకాల వర్షాలు, గాలి దుమారాలతో వరి, మొక్కజొన్నతో పాటు మిర్చి పంటలు తడిసి ముద్దయ్యి మొలకలు వచ్చాయని,కొన్ని పంటలు సగానికి పైగా, మరికొన్ని పూర్తిగా నష్టపోయాయి మామిడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని ప్రకటనలో పేర్కొన్నారు.ఇంకా వర్షాలు వస్తూనే ఉండడంతో రైతులకు కంటి నిండా కునుకులేకుండా పోయిందని, పెట్టుబడుదారులకు అమ్ముడుపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి దోచిపెట్టడానికి విత్తనాల హబ్ చేస్తానని ప్రకటించాడని పేర్కొన్నారు.దానితో తెలంగాణలో అనుమతులు లేని సీడ్స్ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొని వచ్చి రైతులను నమ్మించి వారితో ఒప్పందాలు చేసుకొని వరి వేయిస్తున్నారని,అవి మొలకెత్తకపోవడం,పండిన పంటలను కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇవ్వకుండా సీడ్స్ కంపెనీలు మరింత మోసం చేస్తూనే ఉన్నాయన్నారు.ప్రభుత్వం వేసిన పంటలను కొనుగోలు చేస్తామని చెప్పి అనుమతిలేని కంపెనీలను ప్రోత్సహించడం, పండించిన తరువాత వాటిని కొనుగోలు చేయకపోవడం, ఒకవేళ కొన్నా వాటిని తాలు, తరుగు,పచ్చివిగా ఉన్నాయనే పేరుతో ప్రభుత్వ అండతో మధ్య దళారులయిన మిల్లర్లతో 5 కిలోల నుండి 10 కిలోల వరకు తరుగు తీసి కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు.దానితో ఇటు సీడ్స్ కంపెనీలు ఇచ్చిన విత్తనాలతో నష్టపోవడం, పండిన పంటను కొని డబ్బులు ఎగ్గొట్టడం, కొనుగోలు చేసిన తరుగు పేరుతో 10 కిలోల వరకు తీసి వేయడంతో రైతులు పెట్టిన పెట్టుబడి రాక అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి కేవలం 10 వేలు ఇస్తామని,తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించి,ఆచరణలో రైతులు పెట్టుబడి పెట్టి అప్పుల పాలు అయి ఉండడం,ధాన్యాన్ని గోదాములో దాచుకోలేని పరిస్థితిని ఆసరా చేసుకొని మధ్య దళారులు కోతలు పెడుతూ కొనుగోలు చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
మధ్య దళారుల నుండి రైతులు మోసపోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి వరి, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలను ఎలాంటి షరతులు,కోతలు లేకుండా కొనుగోలు చేయాలిని డిమాండ్ చేశారు.తడిచిన ప్రతీ ఒక్క గింజను ప్రభుత్వమే వెంటనే కొనుగోలు చేయాలి,పూర్తిగా నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి 50 వేలు చొప్పున నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
అకాల వర్షానికి పంట నష్టపోయిన మధ్య,పేద రైతుల అప్పులను మాఫీచేసి కౌలు రైతులందరికి నష్టపరిహారం వర్తింపచేయాలని మావోయిస్టు పార్టీ పేరున ప్రకటన విడుదల చేశారు.