పెండ్లి పీఠలపై జరగాల్సిన పెండ్లి ఆసుపత్రిలో జరిగింది
మంచిర్యాల,ఫిబ్రవరి23(కలం శ్రీ న్యూస్):
శస్త్ర చికిత్స జరిగి ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న వధువుకు వరుడు తాళికట్టాడు. పెండ్లి మండపం లేదు, భజభజంత్రీలు లేవు,కుటుంబ సభ్యులు, బంధు, మిత్రుల సందడి లేదు, నిరాడంబరంగా ఆసుపత్రిలో జరిగింది.మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కు చెందిన బానోథ్ శైలజ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్వరాజు పల్లె గ్రామానికి చెందిన హట్కార్ తిరుపతి కి వివాహం నిశ్చయం అయ్యింది. గురువారం లంబాడిపల్లిలో పెండ్లి జరగవలసి ఉండగా వధువు శైలజ బుధవారం అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పడంతో ఇన్ పేషేంట్ గా ఉండిపోయింది. విషయం పెండ్లి కుమారుడు తిరుపతి కి తెలియడంతో కంగారుపడ్డాడు. ఓ వైపు ఇరు కుటుంబాలు పేదలు కావడం పెండ్లి ఏర్పాట్లు చేయడం, మళ్ళీ పెండ్లి అంటే ఖర్చు అవుతుందని భావించారు. ఎలాగైనా గురువారం పెద్దలు నిర్ణయించిన ముహూర్తం కు పెండ్లి చేసుకోవాలనే పట్టుదలతో ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించాడు. శైలజ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చి వైద్యులకు విషయము చెప్పారు. వరుడు మంచి మనసును అర్థం చేసుకున్న వైద్యులు పెండ్లికి ఒప్పుకున్నారు. వైద్యులే పెండ్లి పెద్దలుగా మారారు. బెడ్ పై ఉన్న శైలజకు తిరుపతి మాంగళ్యధారన చేసాడు. ఇద్దరు పూల దండలు మార్చుకుని దంపతులుగా మారారు. వధువు కుటుంబ సభ్యులు, వరుడు కోరిన మీదట పెండ్లికి అనుమతి ఇచ్చామని వైద్యుడు ఫణికుమార్ తెలిపారు. శైలజ కు బుధవారం ఆపరేషన్ చేశామని ఆయన చెప్పారు.