తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ
–రజక సంఘ మండలాధ్యక్షుడు నిట్టూర్ శ్రీనివాస్
సుల్తానాబాద్, సెప్టెంబర్10(కలం శ్రీ న్యూస్): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ అని రజక సంఘ మండలాధ్యక్షుడు నిట్టూర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు స్థానిక పోస్టాఫీస్ కూడలిలో ని ఐలమ్మ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మీరాజమల్లు హాజరయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాం నవాబుకూ,ఆయన తొత్తులైన భూస్వాములకూ వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చిందామె అని,1895 సెప్టెంబర్ 26న సద్దుల బతుకమ్మ నాడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్ణాపురంలో ఆమె జన్మించి చిన్న వయస్సులోనే పాలకుర్తికి చెందిన నర్సయ్యతో వివాహం అయిందనీ,పాలకుర్తి పరిసరాల్లో మల్లంపల్లి దొరవద్ద కొంత భూమిని ఐలమ్మ కుటుంబం కౌలుకు తీసుకొని సాగు చేసిందనీ, ఇది పాలకుర్తి పొరుగునే ఉన్న విస్నూర్ గ్రామానికి చెందిన దేశ్ ముఖ్ రేపాక రామచంద్రారెడ్డికి కోపం తెప్పించిందనీ, దొర గడీల్లో వంతుల వారీగా వెట్టి చేసే ఐలమ్మ కుటుంబం సొంతంగా భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసుకోవడం సహించలేక పోయాడనీ, ఐలమ్మ భూమిని కాజేయాలనీ,ఆమె పండించిన పంటను గూండాలతో కొల్లగొట్టించాలనీ చూశాడనీ, ఐలమ్మ ‘ఆంధ్ర మహాసభ’ నాయకత్వంలో ఎర్రజెండా పట్టి పోరాడిందనీ,.’గుత్పల సంఘం’ సభ్యులు,గ్రామ స్థుల సహకారంతో పంటను తరలించుకు పోవడానికి వచ్చిన గూండాలను తరిమి కొట్టిందనీ, ఐలమ్మ సాధించిన ఈ విజయం తెలంగాణలో భూపోరాటానికి నాంది అయిందనీ,చివరకు రైతాంగ సాయుధ పోరాటం సాగి వేలాది ఎకరాలు సాగు చేసుకునే రైతుల పరం అయ్యాయనీ,ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10న తుది శ్వాస విడిచిందని వివరించారు.
అనంతరం నిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) అన్నారు. చిట్యాల ఐలమ్మను ‘తెలంగాణ తల్లి’గా గుర్తించి 2021 సెప్టెంబర్ 26 నుండి ఆమె జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందన్నారు.ట్యాంక్ బండ్ పై విగ్రహం పెట్టాలని, వరంగల్ జిల్లాని చాకలి ఐలమ్మ జిల్లాగా పేరు పెట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బిరుదు సమతా కృష్ణ,సూర శ్యామ్,రజక సంఘ పట్టణ అధ్యక్షుడు నిట్టూరి రాజేశం,మాజీ పట్టణ అధ్యక్షులు నిట్టూరి మైసయ్య,నిట్టూరి అంజయ్య,తోటపల్లి సంతోష్,నిట్టూరి కృష్ణ, నిట్టూరి ఓదెలు,మైలారం మధురయ్య,నిట్టూరి ఆనంద్,కొత్త కొండ శ్రీనివాస్, నిట్టూరి దీపక్,శంకర్,శీను,ప్రశాంత్,శ్రీనివాస్,శంకర్,హరీష్,మహేష్,రజక సంఘ నాయకులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.